Take a fresh look at your lifestyle.

అనంతపురం జిల్లా అంటే అంత కసి ఎందుకు

  • రాయలసీమకు అన్యాయంపై సిఎం జగన్‌ ‌సమాధానం చెప్పాలి
  • మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఘాటు విమర్శ

అనంతపురం,ఆగస్ట్31 : అనంతపురం జిల్లాపై కసి చూపుతున్నారని.. జిల్లా అంటే సీఎం జగన్‌కు అంత అలుసా అని మాజీ మంత్రి, పోలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై సీఎం జగన్‌మోహన్‌ ‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఏపీ, తెలంగాణ సీఎంలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం.. రాయలసీమను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన డియాతో మాట్లాడుతూ..హంద్రీనీవా ప్రాజెక్టును అడ్డుకునేందుకే.. అక్రమం అంటూ, తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందన్నారు. ఎన్టీఆర్‌ ‌పెట్టిన రాజకీయ భిక్షతో పైకొచ్చిన కేసీఆర్‌.. ‌హంద్రీనీవా అక్రమం అని మాట్లాడటం దారుణమని చెప్పారు. హంద్రీనీవా సుజల స్రవంతి.. ఎన్టీఆర్‌ ‌స్వప్నమని గుర్తు చేశారు.

రెండేళ్లలో సీఎం జగన్‌మోహన్‌ ‌రెడ్డి.. హంద్రీనీవాను వివాదాస్పదం చేసి నాశనం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ అసంబద్ధ ఫిర్యాదులకు.. రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వకపోతే రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో రాయలసీమ గురించి మాట్లాడిన మేధావులంతా.. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. పనిచేయని వైసీపీ ప్రభుత్వాన్ని.. ఈ మేధావులంతా ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తుందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగే సమావేశం అనంతరం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడుసార్లు పన్నులు పెంచారని చెప్పారు. కొవిడ్‌ ‌నిబంధనలు పాటించలేదని కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అధికారులకు న్యాయ స్థానాలు ఇప్పటికే పలుమార్లు చివాట్లు పెట్టిన సంగతి గుర్తించుకోవాలని సూచించారు. అక్రమ కేసులపై ప్రజాక్షేత్రంలో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply