Take a fresh look at your lifestyle.

సిఎం డైరెక్షన్‌, ‌గంగుల యాక్షన్‌.. ‌హుజురాబాద్‌ ఉప ఎన్నికకు రంగం సిద్ధం

హుజురాబాద్‌ ‌రాజకీయాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. సాధారణంగా అధికార ప్రతిపక్షాల మద్య జరిగే మాటల, చేతల యుద్ధం ఇప్పుడు స్వంత పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జరగటం విశేషం. రాముడిని వీడని లక్ష్మణుడిగా ఇరవై సంత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌వెంట నడిచిన ఈటెల రాజేందర్‌ను ఎవరూ ఊహించని విధంగా, కొరోనా తీవ్రత కొనసాగుతున్న వేళ, ఆరోగ్యశాఖ మంత్రి పదవినుండి బర్తరఫ్‌ ‌చేసినప్పటినుండి హుజురాబాద్‌ ‌రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఉత్తానపతనాలు చవిచూస్తున్నప్పటికీ పార్టీ వర్గాలుగా ఏర్పడిందిలేదు. కాని, ఈటెల బర్తరఫ్‌తో హుజురాబాద్‌ ‌శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఆ పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పవచ్చు. ఉద్యమ కాలం నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఈటెలకు పార్టీ అన్యాయం చేసిందని ఆయన్ను అభిమానించే చోటా బడా నాయకులు, కార్యకర్తలు పలువురు తాము ఆయన వెంటే ఉంటామని సమావేశాలు నిర్వహించి హామీ ఇస్తున్నారు. ఈటెలను మంత్రి వర్గంనుండైతే బర్తరఫ్‌ ‌చేశారుగాని, శాసనసభ్యత్వంకు రాజీనామా చేసే విషయం మాత్రం ఈటెల రాజేందర్‌ ‌చేతిలోఉంది.

ఒక వేళ ఆయన రాజీనామా చేస్తే ఇక్కడ ఉప ఎన్నిక తప్పదు. ఉద్యమ కాలం నుండి రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్తానంలో ఈటెలకు ఈ నియోజకవర్గంతో అవినాభావ సంబంధం ఉండడంవల్లే ఆయన్ను స్థానిక ప్రజలు ఆరుసార్లు ఎంఎల్‌ఏగా ఎన్నుకున్నారు. ఇప్పుడు శాసనసభ్యత్వానికి ఈటెల రాజీనామా చేస్తే మరోసారి ఆయన్నే స్థానిక ప్రజలు ఎన్నుకుంటారన్న దానిలో ఎలాంటి సందేహంలేదు. రాజీనామాకు ముందు ఆయన తనకు మద్దతును కూడగట్టుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకే పార్టీ క్యాడర్‌తో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఈటెల ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఇతర పార్టీల నాయకులు కూడా సమావేశం అవుతుండడం వెనుక ఈటెల ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పడుతుందా అన్న అనుమానాలకు తావేర్పడుతున్నది. ఇదిలీ ఉంటే ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైతే ఎట్టి పరిస్థితిలోనూ ఈటెలను ఇక్కడినుండి గెలువనీయవద్దన్నది టిఆర్‌ఎస్‌ అధినేత నిర్ణయంగా తెలుస్తున్నది.అందుకే ఇక్కడ ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా ఈటెలకు స్థానంలేకుండా చేసేందుకు అధికార టిఆర్‌ఎస్‌ ‌పావులు కదుపుతోంది.

అందుకోసం కరీంనగర్‌ ‌జిల్లాకే చెందిన మరో మంత్రి గంగుల కమలాకర్‌కు ఈ బాధ్యత అప్పగించినట్లు స్పష్టమవుతున్నది. ఈ సందర్భంగానే గంగుల, ఈటెల మద్య మాటల యుద్దం కొనసాగుతుండగా, వారి అనుయాయుల మధ్య చేతలుకూడా చోటుచేసుకుంటున్నాయి. భూ ఆక్రమణల ఆరోపణతో ఈటెలను ప్రజల్లో డీఫేమ్‌ ‌చేసిన అధిష్టానం, ఆ తర్వాత ఆయన అనుచరులొక్కొక్కరిని తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది పార్టీ. అందులో భాగంగా వామన్‌రావు దంపతుల హత్యకేసుతో సంబంధమున్నదంటూ పుట్ట మధుపై ఆరోపణలు చేయడంతో పాటు, ఆయన ఈటెలకు అత్యంత సన్నిహితుడంటూ ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ప్రభుత్వం సక్సెస్‌ అయింది. అలాగే ఈటెల వెంటతిరిగే వీణవంక జడ్‌పిటిసి, అలాగే మరికొందరికి నోటీసులివ్వడం, హెచ్చరికలు చేయడం ద్వారా ఈటెలకు దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈటెల వర్గీయుల ఆరోపణ.

ఇదంతా సిఎం డైరెక్షన్‌లో గంగుల యాక్షన్‌లో జరుగుతున్నప్పటికీ, పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరున్న హరీష్‌రావు , మాజీ ఎంపి వినోద్‌కుమార్‌, ఎం‌పి క్యాప్టెన్‌ ‌లక్ష్మికాంతరావుల ప్రణాళికేనంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పార్టీలోని చోటా బడా నాయకులు, కార్యకర్తలందరికీ ఎలా చెప్పాలో అలా చెప్పి తమ దారికి తెచ్చుకునేందుకు పార్టీ సర్వ విధాలుగా ప్రయత్నిస్తోంది. నిన్నటి వరకు తనకు జై కొట్టినవారు తెల్లవారే సరికి అధికారం వెంటే ఉంటామని చెబుతున్నారంటే వారిని అనేక రీతుల భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నది ఈటెల రాజేందర్‌ ఆరోపణ. తనపై కక్ష్యసాధింపులో భాగంగా అమాయకులైన పార్టీ క్యాడర్‌ను అవస్థలకు గురిచేయడంపట్ల ఈటల ఆవేదన వ్యక్తచేస్తున్నారు. ఇరవై ఏళ్ళుగా మంచీ చెడుకు తన వెంట ఉన్న క్యాడర్‌ను ఇప్పుడు ప్రజలనుండి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ ‌పేరు ఉచ్చరించకుండానే ఆయనపై ఈటెల మండి పడుతున్నాడు. ప్రభుత్వ పథకాలు అమలు కావాలంటే, నిధులు సమకూరాలన్నా, చేసిన పనులకు డబ్బు మంజూరు కావాలన్నా తమ వెంటే ఉండాలని వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచిది కాదని, అధికారం ఎవరికీ శాశ్వతంకాదు, 2023 తర్వాత టిఆర్‌ఎస్‌ ఎలాగూ అధికారంలో ఉండదు.

అప్పుడు అధికారంలో ఉన్నవారు ఇప్పుడు మీరేమి చేస్తున్నారో అలాగే చేస్తారు. అందుకు మర్యాదగా నడుచుకుంటే మంచిదంటూ ఈటెల చేసిన హెచ్చరికలకు అంతే తీవ్రంగా గంగుల కూడా సమాధానమివ్వడంతో ఇక్కడ రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. కరీంనగర్‌ ‌జిల్లాను బొందలగడ్డగా మార్చడం, సర్కార్‌ ‌పన్నులు ఎగ్గొటటం లాంటి ఆరోపణలను తనపై చేయడాన్ని గంగుల తిప్పికొడుతూ తనకన్నా ముందునుండి మంత్రి పదవిలో ఉన్న ఈటెల అప్పుడే తనమీద ఎందుకు చర్య తీసుకోవలేదని సవాల్‌ ‌విసిరారు. బిడ్డా అంటూ తనను బెదిరించడంపై స్పందిస్తూ తానూ బిసి బిడ్డనేనని, తనకూ ఆత్మగౌరవం ఎక్కువే ఉందంటూ, ఇంకా పార్టీలోనే కొనసాగుతుండడంతో మర్యాదగానే మాట్లాడుతున్నానంటు ఒకరి తర్వాత ఒకరు విలేఖరుల సమావేశాల్లో వ్యక్తం చేస్తున్న ఆగ్రహవేశాలు హుజురాబాద్‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో వేడిపుట్టిస్తున్నాయి.

Leave a Reply