Take a fresh look at your lifestyle.

కొత్తగా వెయ్యికోట్లతో సిఎం దళిత్‌ ఎం‌పవర్‌మెంట్‌ ‌పోగ్రామ్‌

మహిళా సంఘాలకు ఈ ఏడాది రూ.3 వేల కోట్లు
ఆర్థికాభివృద్ధిలో దేశంలో తెలంగాణ ప్రబల శక్తిగా ఎదుగుతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. మన రాష్ట్ర పురోగతి ఎంతో మెరుగ్గా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎం‌తో దూరదృష్టితో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిని చేస్తున్నారని తెలిపారు. అందువల్లే కరోనా సంక్షోభం చుట్టుముట్టినా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడిందన్నారు.

’దేశ తలసరి ఆదాయం సంవత్సరానికి రూ.1,27,768గా ఉంటుందని అంచనా. ఇది గత సంవత్సరం కంటే -4.8 శాతం తగ్గింది.. అంటే తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే రూ.99,377 అధికంగా ఉంది. దీన్నిబట్టి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన రాష్ట్ర పురోగతి ఎంతో మెరుగ్గా ఉందని అర్థం చేసుకోవచ్చు. నేడు దేశంలో తెలంగాణ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోందనడానికి ఇది సరైన నిదర్శనం’ అని హరీశ్‌ ‌రావు పేర్కొన్నారు. ఇకపోతే రాష్ట్రంలోని దళితుల పట్ల సీఎం కేసీఆర్‌ ‌మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. దళిత అభ్యున్నతికి వరాల వర్షం కురపించారు.

రూ. వెయ్యి కోట్ల నిధులతో సీఎం దళిత్‌ ఎం‌పవర్‌మెంట్‌ ‌పోగ్రామ్‌ అనే పథకాన్ని రూపొందించినట్లు శాసనసభ వేదికగా ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు ప్రకటించారు. రాష్ట్రంలోని షెడ్యూల్‌ ‌కులాల ప్రజలకు ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున ప్రయోజనాలు కలగనున్నాయని మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు. ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇకపోతే మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం ప్రభుత్వం భారీ మొత్తం కేటాయించింది. మహిళా సంఘాలకు ఈ ఏడాది రూ.3 వేల కోట్లు ఇవ్వనుంది. రాష్ట్రంలో మొత్తం 4,29,262 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.

వాటిలో 46,65,443 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరంతా పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు పొందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల రూపంలో బ్యాంకులు రూ.9,803 కోట్లు అందించాయి. వీరంతా క్రమం తప్పకుండా చెల్లిస్తుండటంతో రుణాల రికవరీ రేటు 97.25 శాతంగా ఉన్నది. అలాగే రాష్ట్రంలోని మహిళలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే షీ టాయిలెట్లు నిర్మించిన విషయం విదితమే.

ఇప్పుడు కొత్తగా పోలీసు స్టేషన్లు, అన్ని యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లను నిర్మించేందుకు బడ్జెట్‌లో నిధులు ప్రతిపాదించింది. మహిళా పోలీసు అధికారులు, సందర్శకులు, మహిళా నేరస్తులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో, అన్ని పోలీసు స్టేషన్లలో షీ టాయిలెట్లు నిర్మించేందుకు రూ. 20 కోట్లు, అదే రీతిలో మహిళా ప్రొఫెసర్లు, విద్యార్థినులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు యూనివర్సిటీల్లో రూ. 10 కోట్లు ప్రతిపాదించి షీ టాయిలెట్లను నిర్మిస్తామని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు.

Leave a Reply