- సిఎం కెసిఆర్ ఎక్కడుండేవాడు
- సాగర్ సభలో చేసిన విమర్శలపై మండిపడ్డ భట్టి
- సాగర్ ఉప ఎన్నికతో టిఆర్ఎస్ పతనం ఖాయమని వెల్లడి
సీఎం కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హాలియా సభలో కాంగ్రెస్‌పై చేసిన విమర్శలు ఆయన అసహనానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ లేదని..కెసిఆర్ లేడని గుర్తుంచుకోవాలన్నారు. పాదయాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ఉపఎన్నికతోనే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతోందన్నారు. సాగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోపిడీకి పాల్పడ్డారన్నారు. లక్ష కోట్లతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఒక ఎకరానికి సాగునీరు అందింది లేదన్నారు.
అసలు కాళేశ్వరంలో నిర్మించింది ప్రాజెక్టు కాదన్నారు. నీళ్లను ఆపడానికి కట్టిన చెక్ డ్యామ్ అది అన్నారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. అనేక తప్పులు చేసిన కేసీఆర్… కేసుల భయంతో ఢిల్లీకి వెళ్లి కేంద్రం ముందు మోకరిల్లాడన్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతుల వైపా.. కేంద్ర ప్రభుత్వం వైపా.. అనేది కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు. ఇకపోతే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అసెంబ్లీలో రైతుల తరపున తన గొంతు వినిపిస్తానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని మండిపడ్డారు. నూతన చట్టాలతో రైతులకు ఒరిగిందేమీ లేదని, వ్యాపారులకు అండగా నిలిచేందుకే మోదీ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామని కేసీఆర్ చెప్పడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తోందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో చేపట్టిన రైతు దీక్షలో రైతులందరూ భాగస్వాములు కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రైతుల పక్షాన ఉండి రైతు సమస్యలను అసెంబ్లీతో పాటు శాసన మండలిలో వినిపించి వ్యవసాయ రంగాన్ని మెరుగు పరుస్తామన్నారు. రైతుబంధుతో సామాన్య రైతు కాకుండా భూములు వదిలేసి వెళ్లిన భూస్వాములు ఎంతగానో లాభపడుతున్నారని విమర్శించారు. ఇకనైనా కేసీఆర్ రైతులకు ఉపయోగపడే పనులు చేయాలని హితవు పలికారు.