- పాదయాత్రతో ప్రభుత్వం దృష్టికి తెచ్చే యత్నం
- వొచ్చే నెల 9 నుంచి యాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం
ప్రజాతంత్ర, ఖమ్మం : ఖమ్మం జిల్లా పెండింగ్ సమస్యలపై పోరాటానికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క సిద్ధమయ్యారు. ఈ మేరకు సిఎల్పీ నేత భట్టి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మధిర నుంచి మొదలుకొని.. జిల్లా అంతటా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలపై గళం విప్పేందుకు యాత్రకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం మధిరలో పెద్ద సంఖ్యలో రైతుకుటుంబాలున్నాయి. ఇప్పుడు ఆ రైతుల సమస్యల పరిష్కారం కోసం..గ్రామ గ్రామాన పర్యటన చేయాలని నిర్ణయించారు భట్టి. మధిర నియోజక వర్గంలోని ముదిగొండ నుండి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడి నుండి నియోజకవర్గంలో గ్రామలన్నిటిని టచ్ చేస్తూ యాత్రకు ప్లాన్ చేస్తున్నారు.
జనవరి 9 నుండి సిఎల్పీ నేత భట్టి పాదయాత్ర ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. దీనికి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు భట్టి అనుచరులు. ముదిగొండ నుండి నిత్యం 10 నుండి 15 కిలోవి•టర్ల మేర పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ తయారు చేస్తున్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తవ్వగానే జిల్లా వ్యాప్తంగా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీకి కొంత జోష్ వచ్చింది. దీన్ని కంటిన్యూ చేయడం కోసం జిల్లా అంతటా పాదయాత్ర చేయాలని చూస్తున్నారు భట్టి. రైతుల సమస్యలను పాదయాత్రలో ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. భట్టి పాదయాత్ర షెడ్యూల్ జనవరి మొదటి వారంలో ఖరారు కానుంది. ముదిగొండ నుండి మొదలై ఖమ్మంలో ముగించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.