- కష్టాలు తెలుసుకునేందుకే రైతులతో ముఖాముఖి
- పదవుల కోసం కాదు..ప్రజల కోసమే..
- ‘ఖేడ్’లో సిఎల్పీ నేత భట్టి
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుపై కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం నాయకుడు భట్టి విక్రమార్క మల్లు తనదైనశైలిలో మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కుర్చీల కోసమే రైతు యాత్రలు చేస్తున్నారనీ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల కోసం కాదూ, ప్రజల కోసమే యాత్రలు చేపడుతున్నామనీ భట్టి స్పష్టం చేశారు. రైతులతో ముఖముఖి యాత్రలో భాగంగా సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణ్ ఖేడ్‌లో టామాట రైతులతో మాట్లాడిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యల సుడిగుండంలో ఉన్న రైతాంగం తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రైతులను కార్పొరేట్ శక్తులకు బలి ఇచ్చేలా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే రైతులతో ముఖాముఖి.. పొలంబాట-పోరుబాట చేపట్టామని భట్టి వివరించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం, దగా చేస్తున్న రైతులకు అండగా సిఎల్పీ పక్షాన పోరాటం చేస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. రైతులతో ముఖాముఖి చేస్తుంటే ముఖ్యమంత్రి గుండెల్లో వణుకు పుడుతోందన్నారు. అదే విషయంలో రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కే ఉందని భట్టి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం తిరుగుతున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎల్పీ నాయకుడిగా నేను తిరిగేది పదవుల కోసం కాదు.. ప్రజల కోసమని .. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలుసుకోవాలని చెప్పారు. పదవుల కోసమయితే తాము కూడా వారిలా ప్రజలను మోసం చేసేవాళ్లమన్నారు.
తాను తిరిగేది వారు చేసిన తప్పిదాలను, వారి విధానాల వల్ల సమస్యల్లో ఉన్న రాష్ట్ర రైతాంగం, వ్యవసాయ రంగానికి అండగా ఉండేందుకు చేస్తున్నామని మంత్రి హరీష్‌రావును ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో రైతులు కన్నీరు పెడుతున్నారని, రైతుల కోసం ఏందాకైనా పోరాడుతామనీ భట్టి అన్నారు. భట్టితో పాటు మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, సురేష్ షెట్కార్, సీనియర్ నాయకులు డాక్టర్ సంజీవ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఖేడ్ పర్యటనలో భాగంగా సిఎల్పీ భట్టి బృందం •మాట రైతులతో ముచ్చటించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.