- క్యాంపులు, రిసార్టు రాజకీయాలకు తెర
- కరీంనగర్ స్థానంలో అత్యధికంగా 99.69 శాతం పోలింగ్
- వోటు హక్కు వినియోగించుకోని సీఎం కేసీఆర్
- కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు
- కరీంనగర్లో టీఆర్ఎస్, బీజేపీ, ఖమ్మంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం
హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రతినిధి : రాష్ట్రంలోని 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసింది. కరీంనగర్లో 2, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాలలో ఒక్కో స్థానానికి గాను మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల్లో కొర్పోరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపిటిసిలు మొత్తం 5,326 మంది ఓటర్ల కోసం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.. ఆయా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వోటర్లు తమ వోటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ బూత్‌లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి క్యాంపులు, రిసార్టులకు తరలి వెళ్లిన కరీంనగర్, ఖమ్మం జిల్లాలలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రత్యేక బస్సులలో నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.69 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి 91.78 శాతం, ఖమ్మం జిల్లాలో 95 శాతం పోలింగ్ నమోదైంది.
ఆదిలాబాద్‌లో ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు అన్ని నియోజకవర్గాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వోటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి స్రాంగ్ రూంలకు తరలించారు. కాగా, ఈనెల 14న రాష్ట్ర ఎన్నికల సంఘం వోట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు విజేతలను ప్రకటించనుంది.
శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గాలలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో 6 స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ప్రధానంగా పోటీలో నిలిచారు.మెదక్, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు, ఇతర చోట్ల స్వతంత్రుల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ ఎదుర్కొంటున్నారు. మరోవైపు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు, ఖమ్మంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగింపజేశారు.