Take a fresh look at your lifestyle.

కొరోనా లక్షణాలు లేకుంటే ముందస్తు మందులు వాడొద్దు

కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సూచనలు
18 ఏళ్ల లోపు పిల్లలకు టీకా.. క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌చేపట్టిన భారత్‌ ‌బయోటెక్‌
కొరోనా చికిత్సలో పలు కీలకమైన మార్పులను కేంద్ర ఆరోగ్యశాఖ చేసింది. డైరెక్టరేట్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ (‌డీజీహెచ్‌ఎస్‌) ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ మేరకు కొరోనా లక్షణాలు లేని వాళ్లకు అసలు ఏ మందులూ వొద్దని స్పష్టం చేసింది. స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లు యాంటీపైరెటిక్‌, ‌యాంటీట్యూసివ్‌ ‌మందులు మాత్రమే వాడాలని చెప్పింది. ఇన్నాళ్లూ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లకు కోవిడ్‌ ‌చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఐవర్‌మెక్టిన్‌, ‌డాక్సీసైక్లిన్‌, ‌జింక్‌, ‌మల్టీ విటమిన్ల వంటి ట్యాబ్లెట్లు అవసరం లేదని తేల్చి చెప్పింది. జ్వరం కోసం యాంటీపైరెటిక్‌, ‌జలుబు కోసం యాంటీట్యూసివ్‌ ‌మందులు మాత్రం వాడితే చాలని తెలిపింది. అవనసరంగా పేషెంట్లకు సీటీ స్కాన్లు చేయించొద్దని కూడా డాక్టర్లకు సూచించింది. కొవిడ్‌ను అడ్డుకోవడానికి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేసింది.

కొవిడ్‌ ‌లక్షణాలు కనిపిస్తే టెలీకన్సల్టేషన్లు జరపాలని, పోషకాహారం తీసుకోవాలని సూచించింది. పేషెంట్లు, కుటుంబ సభ్యులు ఫోన్‌లో, వీడియో కాల్స్‌లో మాట్లాడుకుంటూ ఉండాలని, సానుకూల విషయాలు చర్చించాలని చెప్పింది. లక్షణాలు లేని వాళ్లకు అసలు ఎలాంటి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లయితే మాత్రం తాము వాడుతున్న మందులను కొనసాగించాలని సూచించింది. స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లు ఎప్పటికప్పుడు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్‌ ‌సాచురేషన్‌ ‌వంటివి చెక్‌ ‌చేసుకుంటూ ఉండాలని సూచించింది. దగ్గు ఉంటే ఐదు రోజుల పాటు ఆవిరి కోసం బుడెసొనైడ్‌ 800 ఎం‌సీజీ డోసు రోజుకు రెండుసార్లు వాడాలని చెప్పింది. ఇక ఎలాంటి చికిత్స, మందులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇకపోతే తొలుత కరోనా పేషెంట్లకు ప్లాస్మా కావాలని సూచించా తాజాగా ప్లాస్మా థెరఫినీ పక్కన పెట్టింది. అయితే ఇప్పటికీ కరోనాకు ఓ పద్దితి ప్రకారం అంటే ప్రోటోకాల్‌ ‌లేదని గుర్తించాలి.

18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ : ‌క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌చేపట్టిన భారత్‌ ‌బయోటెక్‌
‌కొరోనా థర్డ్ ‌వేవ్‌ ‌చిన్నపిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కీలక ముందడుగుపడింది. భారత్‌ ‌బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ ‌టీకా క్లినికల్‌ ‌ట్రయల్స్ 18 ఏళ్ల లోపు వారిపై ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఈ పరీక్షలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి డీజీసీఐ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ ఆస్పత్రిలో క్లినికల్‌ ‌పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే 12 నుంచి 18 ఏళ్ల పిల్లల రక్తనమూనాలను సేకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 50 మంది వాలంటీర్లను పరిశీలించినట్లు పేర్కొన్నాయి. రక్తనమూనాల నివేదికలు అందిన తర్వాత వారికి టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. మరోవైపు ఢిల్లీ ఎయిమ్స్‌లో చిన్న పిల్లలపై కొవాగ్జిన్‌ ‌క్లినికల్‌ ‌పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కొవాగ్జిన్‌, ‌కోవిసీల్డ్, ‌స్పుత్నిక్‌ ‌టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చిన్న పిల్లలకు వేసేందుకు ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదు.

Leave a Reply