Take a fresh look at your lifestyle.

మట్టిమనుషుల పక్షం..! “వంగపండు” సాహిత్యం..!!

రామనా చందనాలో..
వెన్నెలా…
పేరులేని దాన్ని,
పేద దాన్ని,
వంట లేని దాన్ని,
ఒంటి దాన్ని,
అన్నమంటే నా కొడుకు..నిన్నే చూపిస్తాను వెన్నెలో.. వెన్నెలా… వెన్నెలతో తన బాధను చెప్పుకుంటూనే…
చిన్నారి నా కొడుకును సింహం పిల్లనే చేస్తాను వెన్నెలా…అంటూ విశ్వాసాన్ని వెలిబుచ్చే తల్లుల అంతరంగాన్ని అవిష్కరించారు “వంగపండు ప్రసాదరావు”.
అంతే కాదు “ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. ఏం పిల్లో ఎల్దమొస్తవా” అంటూ పోరుకు సిద్దం కావాలనే సంకేతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
” సికాకులంలో సీమలకొండకి.. ఏం పిలడో ఎల్దమొస్తవా.. చిలకలు కత్తులు దులపరిస్తయట.. సాలూరవతల సవర్లకొండకి.. ఏం పిలడో ఎల్దమొస్తవా.. సెవల పిల్లులే శంఖమూదెనట…
తెలంగాణా కొమరయ్య కొండకి అంటూ” శ్రీకాకుళ పోరాటం, ఇతర విప్లవ ఉద్యమాల నేపథ్యాన్ని విస్తృతపరిచారు.
జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ”పామును పొడిచిన చీమలు”న్నాయంటూ…
తుపాకి పేల్చిన తూనిగలున్నాయట…
సింహాలను మింగిన గొర్రెలు న్నాయట అంటూ నూతన చైతన్యాన్ని, ధైర్యసాహసాలు, ఆశాభావాన్ని ప్రజల్లో నింపెందుకు కృషి చేశారు.
కమ్యూనిస్టు ఉద్యమం దారిలో సాగిన వంగపండు తన జానపద గేయాలతో ప్రజా చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సుమారు నాలుగు వందల వరకు పాటలు రాశారు. అనేక పాటలు పలు బాషలలో కూడా అనువాదం చేయబడ్డాయి.
పాటలు పాడుకోని బతకటానికి జానపదం పుట్టలేదు. సమాజాన్ని బతికించటానికి జానపదం  పాటలు పుట్టాయని నమ్మి, దానికనుగుణంగానే జీవించిన మనిషి వంగపండు ప్రసాదరావు. చదువు లేని జనం నుంచే జానపదాలు మొదలయ్యాయని, ఇలాంటి జానపదాలు నిత్యనూతనమైనదని, దానికి చావు లేదని, జానపదాన్ని బతికిస్తేనే తెలుగు బాష బతుకుతుందని, జానపదాన్ని బతికించుకునేందుకు కృషి చేశారు. వంగపండు ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారు.  తన సాహిత్యం ద్వారా తెలుగు ప్రజలను జాగృతం చేశారు. తన గొంతుతో, తన పదాలతో అశేష ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారు. ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేశారు. వంగపండు సాహిత్యం అనేక భాషల్లోకి అనువదించడం తెలుగు జాతికే గర్వకారణంగా చెప్పక తప్పదు. పీడిత తాడిత ప్రజల హక్కుల సాధన కోసం తన గొంతును, తన సాహిత్యాన్ని అంకితం చేసిన చరితార్ధుడు వంగపండు. ప్రజల పక్షం వహిస్తూ జానపదాన్ని తనదైన శైలిలో ఆధునీకరించేందుకు కృషి చేశారు. దేశవ్యాప్తంగా పర్యటించారు. తన ప్రోగ్రాములన్నీ జనం మధ్యలో, రోడ్లమీదనే సాగాయి. వంగపండు గజ్జెగట్టి పాటపాడితే వందలు, వేల సంఖ్యలో జనం పోగవాల్సిందే. మహాకవి “శ్రీ శ్రీ” సైతం వంగపండు పాటకు ఉరకలేసిన ఉత్సాహంతో నాట్యం చేశారంటే “వంగపండు” ఆటా, పాట ప్రజలను ఎంతటి ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవాలి. ” శ్రీ శ్రీ ” అంతటి వారే “వంగపండు” ప్రజల కవి అంటూ అభినందించటాన్ని గుర్తించాలి. అయితే తను ఏనాడు కళను, జానపదాలను, తన ఆటా, పాటను డబ్బులకు ముడిపెట్టలేదు. డబ్బుల కోసం వెంపర్లాడలేదు. డబ్బుల కోసం గజ్జె గట్టలేదు. చివరి వరకూ తన కష్టాలు తనే అనుభవించారు. అధిగమించారు. సాహిత్యం, కళారూపాలు, జానపదం, ఆధునికరూపం పేరుతో ఎటువైపు అడుగులేస్తుందో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఈ నేపథ్యంలో సాహిత్యం ద్వారా ప్రజలను జాగృతం చేసిన “వంగపండు” మృతి తీరని లోటు. గజ్జెగట్టి ఆడేవారు, పాడేవారు, ప్రజాగొంతుకలు, కవులు, రచయితలు, అభ్యుదయ వాదులు “వంగపండు”ను స్మరించుకోవాలి. సాధ్యమైనంత మేరకు వంగపండులా సాహిత్య రంగంలో కృషి చేయాలి. ” ఏం పిల్లడో ఎల్దుమొస్తవా..అంటూ వంగపండు పిలిచినట్లుగానే వంగపండు జీవనసరళిని తొంగిచూడాలి. సాహిత్య రంగంలో మట్టిమనుషుల పక్షాన ఎంతమేరకు ఉంటున్నామనే అంశాన్ని తరిమిచూసుకోవాలి.
rajendhar dhamera
రాజేందర్ దామెర
సీనియర్ జర్నలిస్ట్,
వరంగల్
సెల్ : 80962 02751

Leave a Reply