Take a fresh look at your lifestyle.

లోకల్ పంచాయతీ…!

“ఏకగ్రీవ వ్యవహారం మరో పంచాయతీ కానున్నట్లు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాాతావరణాన్ని బట్టి అర్ధం అవుతోంది. ఏకగ్రీవాల కంటే ఎన్నికల వైపే ఎస్ఈసీ మొగ్గుచూపుతున్నారు. ఏకగ్రీవాల పై ఒక కన్నేసి ఉంచుతాం అని చెప్పిన నిమ్మగడ్డ ఏకంగా ఒక ఐపీఎస్ అధికారిని దీని కోసం ప్రత్యేకంగా నియమించారు. తర్వాతి ఎత్తు ప్రభుత్వం వేసింది. ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ గతంలోనే చట్టం తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేసింది.”

rehana senior journalistఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల నగారా మోగింది. కరోనా కాలం నుంచి వ్యాక్సినేషన్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య కొనసాగిన ఘర్షణ చివరకు సుప్రీం కోర్టు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమని చెప్పటంతో తాత్కాలికంగా బ్రేక్ పడి ఎన్నికలు ముందుకు వచ్చాయి. అయితే కలిసి సాగాల్సిన రెండు వ్యవస్థల్లో ఒక దాని పై మరొో వ్యవస్థకు నమ్మకం లేకపోవటం, పై చేయి సాధించాలనే ప్రయత్నం ఇక్కడ కీలక అంశాలు.

విబేధాలకు మూలం
గత ఏడాది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై కొనసాగుతున్న క్రమంలోనే కరోనా వైరస్ దేశంలో అడుగు పెట్టింది. ఏపీలో అప్పటికి పెద్దగా పరిగణించదగిన స్థాయిలో కరోనా కేసులు నమోదు కాలేదు. కారణాలు ఏవైతేనేం నిమ్మగడ్డ ఎన్నికల ప్రక్రియను అర్దాంతరంగా నిలిపేస్తూ నిర్ణయం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవటాని కంటే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించకపోవటం, క్షేత్ర స్థాయిలో కరోన ప్రమాదం ఏ స్థాయిలో ఉందో నివేదిక తెప్పించుకునే ప్రయత్నం చేయకపోవటంతో వైసీపీ ప్రభుత్వానికి రుచించ లేదు. అప్పటి నుంచి విబేధాలు ఈ రెండు వర్గాల మధ్య రాజుకుంటూనే ఉన్నాయి. ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గించి నిమ్మగడ్డను తొందరగా ఇంటికి పంపించే విఫల ప్రయత్నం కూడా జగన్ సర్కార్ చేసింది. మరోవైపు నిమ్మగడ్డ టీడీపీ డెరెక్షన్ లో పని చేస్తున్నారని ఆరోపించిన ప్రభుత్వం ఆ మేరకు ఆధారాలను కూడా బయట పెట్టింది. హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో నిమ్మగడ్డ టీడీపీ-బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లతో రహస్యంగా సమావేశమైన సీసీటీవీ ఫుటేజ్ అస్త్రాన్ని సంధించింది. ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య అపనమ్మక వాతావరణమే ఉంది.

- Advertisement -

రణ రంగం అవుతాయా
సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ తప్పనిసరి కావటంతో ఎస్ఈసీకి సహకరించటానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాని ఎన్నికల ముగిసేంత వరకు ఏ పూట, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరికీ తెలియని పరిస్థితి అయితే ఉంటుందనే చెప్పాలి. ఎన్నికల ప్రక్రియ పై ప్రభుత్వం ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే పంచాయతీ మొదలయ్యింది. ఎస్ఈసీ ఆదేశాలతోనే పంచాయతీరాజ్ శాఖ అధికారులను బదిలీల చేశామని ప్రభుత్వం ప్రకటించగనే…నిమ్మగడ్డ వర్గాలు దీన్ని ఖండించాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ఈ సమయంలో సంబంధింత అధికారులను బదిలీలు చేయాల్సిన అవసరం లేదని లీకు వార్తలు ఇచ్చాయి. ఈ వార్తలు మీడియా స్క్రీన్ల పై వచ్చిన మరో గంటలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ల తీరును తీవ్రంగా తప్పు బడుతూ నిమ్మగడ్డ 8 పేజీల ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. ఇవన్నీ ఆ అధికారుల సర్వీస్ రికార్డుల్లోనే నమోదు చేయాల్సిందే అని కూడా స్పష్టం చేశారు. ఇలా సీనియర్ ఐఏఎస్ అధికారుల పై సెన్సుయర్ రిమార్క్ వేయటం చాలా అరుదే.

ఇక ఏకగ్రీవ వ్యవహారం మరో పంచాయతీ కానున్నట్లు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాాతావరణాన్ని బట్టి అర్ధం అవుతోంది. ఏకగ్రీవాల కంటే ఎన్నికల వైపే ఎస్ఈసీ మొగ్గుచూపుతున్నారు. ఏకగ్రీవాల పై ఒక కన్నేసి ఉంచుతాం అని చెప్పిన నిమ్మగడ్డ ఏకంగా ఒక ఐపీఎస్ అధికారిని దీని కోసం ప్రత్యేకంగా నియమించారు. తర్వాతి ఎత్తు ప్రభుత్వం వేసింది. ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ గతంలోనే చట్టం తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేసింది. జనాభాను బట్టి ఏకగ్రీవాలు జరిగే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు నుంచి 20 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తుంది. వాస్తవంగా ఇది కొత్త విధానమూ కాదు, మన రాష్ట్రానికే పరిమితమైంది కూడా కాదు. గుజరాత్, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ప్రోత్సకాలు అందిస్తున్నాయి. పల్లెల్లో పోట్లాటలు లేకుండా అందరూ కలిసి తమ సర్పంచ్ ను ఎన్నుకుంటే ఆ సహృద్భావ వాాతావరణం కొనసాగుతుందన్నది దీని వెనుక ఉన్న ఉద్ధేశం. కాని చాలా చోట్ల గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు టీడీపీ, బీజేపీ-జనసేనకు కూడా క్షేత్ర స్థాయిలో సత్తా చూపాలన్న పట్టుదల ఉంటుంది కనుక ఏకగ్రీవాలకు ఆస్కారం తక్కువే ఉంటుందని చెప్పొచ్చు.

చివరగా
రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య ఈ స్థాయి విబేధాలు ఉండటం చాలా అరుదు. కలిసి కట్టుగా సాగాల్సిన రెండు వ్యవస్థలు ఇలా పరస్పరం అపనమ్మకంతో ఉన్నప్పుడు ఎన్నికలు కూడా కచ్చితంగా పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం ప్రజలకు ఉండదు. అందుకే చివరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ కూడా రంగంలోకి దిగారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ ఇద్దరితో నూ వేర్వేరుగా సమావేశమై హితోపదేశం చేశారు. మరి ఎన్నికలు ఎంత వరకు సాఫీగా జరుగుతాయో వేచి చూద్దాం.

Leave a Reply