Take a fresh look at your lifestyle.

దళిత బంధు… ఆత్మగౌరవం మధ్య ఘర్షణ

తెలంగాణ రాజకీయాల్లో విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటివరకు ఒక పార్టీ కండువ కప్పుకుంటున్నవారు తెల్లవారేసరికి మరే పార్టీ కండువా కప్పుకుంటారో తెలియకుండా పోతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌. ‌రమణ కారెక్కితే, హుజురాబాద్‌ ‌కాంగ్రెస్‌లో పట్టున్న కౌశిక్‌ ‌రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడం ఆసక్తికర పరిణామాలె. అలాగే భారతీయ జనతా పార్టీలో దళిత నేతగా చలామణి అవుతున్న నర్సింహులు కూడా అదే గులాబిరంగు కారెక్కడం వందశాతం ఖాయమన్నట్లుగానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇలా టిఆర్‌ఎస్‌ ‌ప్రతిపక్షాలకు చెక్‌ ‌పెట్టడంతోపాటు ఇప్పుడు తాజాగా హుజురాబాద్‌ ‌లక్ష్యంగా అక్కడున్న దళిత వోటర్లను ఆకర్షించేందుకు ‘దళిత బంధు’పేర త్వరలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. ఇది ఎన్నికల ఎత్తుగడ అని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక కంఠంగా విమర్శిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎవరి ఎత్తుగడలు వారివే అనేందుకు ఈ పథక రచన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ పథకాన్ని హుజురాబాద్‌ ‌నియోజకవర్గంనుండే ప్రారంభిస్తున్నట్లు టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించడమే కాకుండా, అవును.. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే దీన్ని హుజురాబాద్‌లోనే పైలెట్‌ ‌ప్రాజెక్టుగా ప్రవేశపెడుతున్నామని ఆయన స్పష్టం చేయడంద్వారా ఒక విధంగా ప్రతిపక్షాలకు సవాల్‌ ‌విసిరారు.

ఇప్పుడు ఆ సవాల్‌ను స్వీకరించి, ఎదురు నిలువాల్సిన బాధ్యత ప్రతిపక్షాల పైన పడింది. ఇప్పటికే అధికార పార్టీనుండి బహిష్కృతుడైన ఈటల రాజేందర్‌ ఇం‌తకు ముందునుండే తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సవాలుగా తీసుకుని నియోజకవర్గాన్ని చుట్టబెట్టారు. తాజాగా పాదయాత్ర పేరున చేపట్టిన తన ప్రచార కార్యక్రమానికి అవరోధం ఏర్పడింది. పాదయాత్ర సందర్భంగా ఆయన మోకాలికి ఇబ్బంది ఏర్పడడం, ఆయన హాస్పిటల్‌ ‌లో చేరడం, తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం అనూహ్యంగా జరిగిపోయాయి. ఆయన కోలుకుని తిరిగి ప్రచార కార్యక్రమంలో పాల్గొనే వరకు ప్రచారంలో ఏమాత్రం వెనుక బడకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు భారతీయ జనతాపార్టీపై పడింది. నిన్నటి వరకు టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బిజెపినే అనుకుంటున్న తరుణంలో ఈ అనూహ్య పరిణామాలు ఎటు దారితీస్తాయన్నది ఊహాతీతంగా మారాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ ఇక్కడ పోటీ చేసే విషయంలో కౌశిక్‌రెడ్డి పార్టీ మార్పిడి ఆ పార్టీకి పెద్ద దెబ్బే. అయినా ఆ పార్టీ సారధ్యం చేపట్టిన రేవంత్‌రెడ్డి టిఆర్‌ఎస్‌కు ధీటైన ప్రణాళికను సిద్దంచేసి త్వరలో అమలు పర్చనున్నాడు.

దళిత బంధువు పేరున అధికార పార్టీ ప్రతీ దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంపై ఆయన తీవ్రంగా స్పందిస్తున్నారు. దళితులను డబ్బుతో కొనుగోలు చేయాలనుకోవడం వారి ఆత్మగౌరవాన్ని కించపర్చడమేనంటూ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ పేరున ప్రత్యమ్నాయ కార్యక్రమాన్ని రూపోందించారు. అయితే టిఆర్‌ఎస్‌ ‌దళిత బంధుకు పోటీగా హుజురాబాద్‌ ‌నుండి కాకుండా ఇంద్రవెల్లినుండి ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్‌ ‌ప్రకటించింది. రాష్ట్ర రాజధానికి సుదూరంలో ఉన్న ఇంద్రవెల్లి ఎందుకు ఎంచుకున్నారన్నది ఆ పార్టీ వర్గాలకే తెలియాలి. ఈ విషయంలో అప్పుడే ఆ పార్టీలో బేదాభిప్రాయాలుకూడా పొడసూపుతుండడం వేరే విషయం. ఏమైనా ఆగస్టు 9నుండి ప్రారంభం కానున్న ఈ ఆత్మగౌరవ దండోరా సెప్టెంబర్‌ 17 ‌వరకు వివిధ దశల్లో నిర్వహించాలన్నది ఆ పార్టీ నిర్ణయం. ఆదివాసీ, గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున్నే ఇంద్రవెల్లిని ఎంచుకుని ఉండవొచ్చన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా దళితుల పేరు చెప్పి అధికార పార్టీ చాలా కాలంగా దళితుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నదన్న దానిపైనే ఈ దండోరా యాత్ర కొనసాగుతుందన్నది ఆ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌డాక్టర్‌ ‌గీతారెడ్డి మీడియాకు వివరించిన విషయం తెలియందికాదు.

దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూపొందించిన ఏ పథకాన్ని కూడా పూర్తిగా అమలు పరిచింది లేదన్న విషయాన్ని దళితులకు సోదాహరణంగా వివరించేందుకు కాంగ్రెస్‌ ‌తీవ్ర ప్రయత్నం చేస్తోంది. బడ్జెట్‌లో దళితులకోసం కేటాయించిన నిధులను ఏనాడు పూర్తిగా వ్యయం చేయకపోవడాన్ని ఎత్తి చూపేందుకు లెక్కలు తయారు చేస్తున్నారు. దళితుల కోసం 85 వేల కోట్ల రూపాయలు కేటాయించి, ఇంతవరకు కేవలం 47 వేల కోట్ల రూపాయలను మాత్రమే వ్యయం చేసే విధానాన్ని ఎత్తి చూపుతున్నారు. అలాంటిపరిస్థితిలో దళిత బంధుకోసం లక్షలకోట్ల రూపాయలు ఎలా ఖర్చుపెడుతారని కాంగ్రెస్‌ ‌ప్రశ్నిస్తోంది. రాష్ట్రం ఏర్పడుతున్న క్రమంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న ప్రకటన ఏమైందో దళిత వర్గాల దృష్టికి మరోసారి తీసుకువొచ్చి వారిని చైతన్యం చేయాలన్నది ఆ పార్టీ తీసుకున్న మరో నిర్ణయం. దళితులకు మూడు ఎకరాల భూమిని అందజేస్తామని ప్రగల్భాలు పలికిన ఈ ప్రభుత్వం మూడు లక్షల కుటుంబాలకు గాను, ఆరు వేల ఆరు వందల కుటుంబాలకు మాత్రమే భూమిని కేటాయించింది. అలాగే అంబేద్కర్‌ ‌మీద చాలాప్రేమను ఒలకబోస్తున్న ఈ సిఎం ఏనాడు అంబేద్కర్‌ ‌చిత్రపటానికి పూలమాలకూడా వేసింది లేదన్నది ఆ పార్టీ ఆరోపణ. అంతేకాదు చైనాలో 125 ఫీట్ల అంబేద్కర్‌ ‌విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు ప్రకటించడమేగాని, నిజంగా ఆదితయారు అవుతున్నదా, ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని ఇంతవరకు ప్రజల దృష్టికి తీసుకురాలేదని, ఇలాంటి పరిస్థితిలో హుజురాబాద్‌లో ప్రవేశపెట్టే దళిత బంధు కేవలం అక్కడి ఎన్నికలకే పరిమితం చేసినా ఆశ్చర్య పడాల్సింది లేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టాలన్న తదితర డిమాండ్‌తో కాంగ్రెస్‌ ‌దండోరా కార్యక్రమాన్ని చేపడుతున్నది.

Leave a Reply