Take a fresh look at your lifestyle.

రాందేవ్‌బాబా పై వేయికోట్లకు దావా

ఆయన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని ప్రధాని మోడీకి ఐఎంఎ లేఖ

‌ప్రధాని నరేంద్ర మోదీకి ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ ‌లేఖ రాసింది. వ్యాక్సినేషన్‌ ‌విషయంలో ఆయన చేస్తున్న తప్పుడు వ్యాఖ్యాలను నిలువరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా దోశద్రోహ చట్టం ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని మెడికల్‌ అసోసియేషన్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. రాందేవ్‌ ‌బాబా చేసిన వ్యాఖ్యలను అత్యంత బాధతో మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రెండు డోసుల వ్యాక్సిన్‌ ‌తీసుకోవడం వల్ల 10 వేల మంది డాక్టర్లు చనిపోయారు. లక్షల మంది ప్రజలు అల్లోపతి వైద్యం వల్ల మరణించారు అని రాందేవ్‌ ‌బాబా వ్యాఖ్యానించారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ఇవ్వాలన్న మీ అకుంఠిత దీక్షకు, మీ నిబద్ధతకు మేం నాయకత్వం వహిస్తాం. వ్యాక్సిన్‌ ‌వేసుకోవాలన్న మీ పిలుపుతో మేమందరమూ స్పందించాం. వ్యాక్సిన్‌ ‌వేసుకున్నాం. దానిపై ఉన్న సందేహాలను తొలగించామని మెడికల్‌ అసోసియేషన్‌ ‌లేఖలో పేర్కొంది.

మరోవైపు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఉత్తరాఖండ్‌ ‌డివిజన్‌ ‌పరువు నష్టం నోటీసును పంపించింది. అల్లోపతి మందుల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేసింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పకపోతే, రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఆయన వ్యాఖ్యలు అల్లోపతితోపాటు తమ సంఘంలోని సుమారు 2,000 మంది ప్రాక్టీషనర్ల పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీస్తున్నట్లు ఆరోపించింది. ఐఎంఏ ఉత్తరాఖండ్‌ ‌శాఖ ప్రెసిడెంట్‌ ‌డాక్టర్‌ అజయ్‌ ‌ఖన్నా మాట్లాడుతూ, బాబా రామ్‌దేవ్‌తో ముఖాముఖి మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

అల్లోపతి గురించి ఆయనకు ఏమీ తెలియదన్నారు. అయినప్పటికీ ఆయన అల్లోపతిని, డాక్టర్ల అసోసియేషన్‌ను వ్యతిరేకిస్తున్నారన్నారు. కోవిడ్‌-19 ‌మహమ్మారిపై పగలు, రాత్రి పోరాడుతున్న వైద్యుల ఆత్మస్థయిర్యాన్ని ఆయన వ్యాఖ్యలు దెబ్బతీశాయన్నారు. ఆయన తన మందులను అమ్ముకోవడం కోసం అబద్దాలు చెప్తున్నారన్నారు. రామ్‌దేవ్‌కు ఐఎంఏ శనివారం ఓ లీగల్‌ ‌నోటీసును పంపించింది. దీనిపై ఆయన నేతృత్వంలోని పతంజలి యోగపీఠ్‌ ‌ట్రస్ట్ ‌స్పందిస్తూ, ఆయన తనకు వచ్చిన వాట్సాప్‌ ‌మెసేజ్‌ను చదివారని వివరించింది.

 

మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌కఠిన పదజాలంతో లేఖ రాయడంతో బాబా రామ్‌దేవ్‌ ‌దిగి వచ్చారు. ఆధునిక మెడికల్‌ ‌సైన్స్‌ను, అల్లోపతిని మేము వ్యతిరేకించడం లేదు. శస్త్ర చికిత్స, ప్రాణ రక్షణ వ్యవస్థలో అల్లోపతి బాగా ప్రగతి సాధించింది, మానవాళికి సేవలందిస్తోంది. నేను వాలంటీర్ల సమావేశంలో చదివిన వాట్సాప్‌ ‌మెసేజ్‌ను ప్రస్తావిస్తున్నారు. ఇది ఎవరి మనోభావాలనైనా గాయపరచి ఉంటే క్షమించండని బాబా రామ్‌దేవ్‌ ‌కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply