Take a fresh look at your lifestyle.

అధికారం, ఆదిపత్యం కోసం సుడాన్‌లో అంతర్యుద్ధం..!

సూడాన్‌లో 15 ఏప్రిల్‌ 2023‌న ప్రారంభమైన అంతర్గత సంక్షోభాగ్నికి, తుపాకుల మోతకు జడిసి వేల మంది అమాయకులు ప్రాణాలు వదలడం(ఐరాస నివేదిక ప్రకారం 413 మంది), లక్షకు పైగా ప్రజలు దేశ సరిహద్దులు దాటి వలసలు వెళ్లడం, అంతర్జాతీయ సంస్థలు శరణార్థులకు రక్షణ గొడుగులు పట్టడం జరుగుతోంది. సైనిక కమాండర్లు రెండు వర్గాలుగా విడిపోయి అధికారమే పరమావధిగా ఒకరి మీద మరొకరు దాడులు చేసుకునే స్థాయికి చేరడం విచారకరం. అక్టోబర్‌ 2021‌లో జరిగిన సైనిక తిరుగుబాటులో ప్రజా ప్రభుత్వం పడిపోయి ఆర్మీ చేతుల్లోకి పాలన పగ్గాలు చేరడంతో సూడాన్‌ ఆర్మీ, పారామిలటరీ రాపిడ్‌ ‌సపోర్ట్ ‌ఫోర్స్ (ఆర్‌యస్‌పీ)ల మధ్య అధికారం కోసం అంతర్యుద్ధం మొదలు కావడం, మాసాలుగా కొనసాగడం చూస్తున్నాం. నాటి నుంచి నేటి వరకు సైనిక జనరల్స్ ‌సభ్యులుగా ఏర్పడ్డ కౌన్సిల్‌ అధికారం చెలాయిస్తున్నట్లు వింటున్నాం.

అధికారం, ఆధిపత్యం కోసం అంతర్యుద్ధం:
సూడాన్‌ ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ అబ్దెల్‌ ‌ఫతే అల్‌-‌బుర్హాన్‌కు, ఆర్‌యస్‌యఫ్‌ ‌లీడర్‌ ‌జనరల్‌ ‌మహమ్మద్‌? ‌హమ్డాన్‌ ‌డగాలో (సాధారణ పేరు హమెడ్టీ)ల మధ్య అధికారం పగ్గాల విషయంలో బయటపడ్డ విభేదాలతో ఆర్మీ, పారామిలటరీ ఆర్‌యస్‌యఫ్‌ల మధ్య భీకర పోరు నేటికీ కొనసాగుతూనే ఉండడం విచారకరం. బషీర్‌ ‌నేతృత్వంలో పాలన నడుపుతున్న పౌర ప్రభుత్వాన్ని తిరుగుబాటుతో కూలదోసి అధికార పగ్గాలు చేపట్టడానికి ఆర్మీ చీఫ్‌ ‌హెమడ్టీ తెలివిగా సివిలియన్‌ ‌పార్టీలతో కలిసి ఫోర్సెస్‌ ‌ఫర్‌ ‌ఫ్రీడమ్‌ అం‌డ్‌ ‌చేంజ్‌(‌యఫ్‌యఫ్‌సి) అనే సంకీర్ణ ప్రభుత్వం ద్వారా సూడాన్‌ను తనదైన శైలిలో దేశాధినేతగా ఏలడానికి తెలివిగా పావులు కదుపుతున్నారు. ఆర్మీ చీఫ్‌ ‌బుర్హనీ తీసుకుంటున్న నిర్ణయాలు హమెడ్టీకి నచ్చకపోవడంతో విభేదాలు పెరిగి అంతర్యుద్ధానికి దారి తీసింది. సుమారు లక్ష మంది ఆర్‌యస్‌యఫ్‌ ‌బలగాలను ఆర్మీలో విలీనం చేయడం, సైన్యానికి నాయకత్వం వహించడం లాంటి విషయాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సాయుధ పోరు ప్రారంభమై తీవ్ర రూపం దాల్చింది. సైనిక తిరుగుబాటు సరైన పద్దతి కాదని, ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలని హమెడ్టీ చెబుతూ వస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రభుత్వానికి పూర్తి అధికారాలు బదలాయిస్తానని బుర్హన్‌ ‌నమ్మబలుకుతున్నారు. ఇద్దరు సైనిక జనరల్స్ ‌మధ్య విభేదాలు ముదిరి 15 ఏప్రిల్‌న రాజధాని ఖార్తుమోతో పాటు ఇతర ప్రాంతాల్లో ఘర్షణలు ప్రారంభమైనాయి. 2013లో ఏర్పడిన ఆర్‌యస్‌యఫ్‌ ‌బలగాలు బలపడి యెనెన్‌, ‌లిబియా అంతర్యుద్ధాల్లో కూడా జోక్యం చేసుకునేంతగా ఎదిగి పోయాయి. ఆర్‌యస్‌యఫ్‌ ‌నేత హమేడ్టీ ఆదిపత్యంలో బంగారు గనులు కూడా ఉండడం కొస మెరుపుగా చెప్పుకోవాలి.

పేదరికానికి పెట్టింది పేరు సూడాన్‌ :
‌గ్లోబల్‌ ‌హంగర్‌ ఇం‌డెక్స్-2023 ‌జాబితాలో  ప్రపంచవ్యాప్త 121 దేశాల్లో సూడాన్‌ 106‌వ స్థానంలో నిరుపేద దేశంగా ఉన్నది. సహారా ఎడారి ప్రాంతంలోని సూడాన్‌లో వాతావరణ ప్రతికూలతల, సహజ వనరుల లేమితో అత్యంత హృదయవిదారక దుస్థితిలో ప్రజలు మగ్గుతున్నారు. అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో మొదలైన ఈ పోరాటంతో 4.79 కోట్ల ప్రజల బతుకులు గోరుచుట్టుపై రోకలి పోటులా మారడం చూస్తున్నాం. బషీర్‌ ‌నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం దశాబ్దాలుగా నిరంకుశత్వం, అంతర్గత సంక్షోభం, ఆర్థిక దివాళ/ఆంక్షలు, ఆకలి కేకలు వంటి సమస్యలతో అనాదిగా సతమతమవుతున్నది. జనాభాలో దాదాపు తెలంగాణను పోలిన సూడాన్‌ ‌వైపు ప్రపంచ దేశాలు దీనంగా చూడడం జరుగుతోంది. సూడాన్‌లో ఉన్న వివిధ దేశస్థులను తమ తమ ప్రభుత్వాలు తిరిగి వెనక్కి తీసుకురావడానికి కూడా అత్యంత చొరవను చూపాల్సి వస్తున్నది. అరబిక్‌, ఆం‌గ్లం మాట్లాడే సూడాన్‌లో ముస్లిమ్‌లు మెజారిటీగా ప్రజల సగటు ఆదాయం రోజుకు రూ: 167/- మాత్రమే ఉండడం ఆ దేశ దుస్థితికి అద్దం పడుతున్నది.

విజయవంతమైన ఆపరేషన్‌ ‌కావేరి:
సూడాన్‌లో స్థిరపడిన దాదాపు 1500 మంది భారతీయులతో పాటు 3000 మంది భారతీయులు ఘర్షణల్లో చిక్కుకుపోవడంతో వారిని దేశానికి సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ ‌కావేరి’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నది. అమెరికా, యూకె, సౌధీ, యూఏఈ, ఈజిప్ట్ ‌లాంటి దేశాలు తమ పౌరులను తరలించడం జరుగుతోంది. దేశాన్ని వదిలి వెళ్లేందుకు సూడాన్‌ ‌ప్రజలు వేల సంఖ్యల్లో సరిహద్దులకు చేరడం, రవాణా సదుపాయాలు లేకపోవటంతో డైవర్లు లక్షల్లో దోపిడీ చేయడం జరుగుతోంది. కాలినడకన దేశ సరిహద్దులు దాటడాన్ని నిషేధించడంతో 30 కిమీ బస్సు ప్రయాణానికి రూ: 32 లక్షలు (40 వేల డాలర్లు) అడుతున్న డైవర్ల దోపిడీతో సూడాన్‌లో గందరగోళం, ప్రాణభయం, అభద్రత, ఆకలి కేకలు రాజ్యమేలుతున్నాయి. బ్యాంకులు, ఏట్రియంలు మూసివేయడంతో ప్రజలు డబ్బుల్లేక నరకయాతన పడుతున్నట్లు తెలుస్తున్నది.

వైరస్‌/‌బాక్టీరియా బాంబులు పేలనున్నాయా..!
సూడాన్‌లోకి కేంద్ర పరిశోధనాలయం (సెంట్రల్‌ ‌ల్యాబ్‌) ఆర్మీ లేదా ఆర్‌యస్‌యఫ్‌ ‌బలగాల చేతుల్లోకి చేరితే వివిధ రకాల వ్యాధుల శాంపిల్స్‌లో ట్యాంపరింగ్‌ ‌జరిగి ప్రపంచంలో వైరస్‌/‌బాక్టీరియా వ్యాధుల బాంబులు పేలవచ్చని కూడా భయపడుతున్నారు. ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఇదొక్కటే చాలని డబ్ల్యూహెచ్‌ఓ ‌లాంటి సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. అనేక సందర్భాల్లో విపత్తులు/సంక్షోభాల కోరల్లో చిక్కిన శ్రీలంక, టర్కీ, సిరియా లాంటి దేశాలకు సకాలంలో స్పందించి ఆపన్నహస్తం అందించిన భారత్‌ ‌నేడు సూడాన్‌లో నెలకొన్న సంక్షోభాన్ని అంతం చేయడానికి మధ్యవర్తిత్వం చేయాలని కూడా పౌరులు సూచిస్తున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూలన, ఏదో ఒక దేశంలో యుద్ధ వాతావరణం నెలకొనడం, సామాన్య ప్రజలు విలవిల్లాడడం, ప్రాణాలు కాపాడుకోవడానికి సరిహద్దుల వైపు పరుగు తీయడం, దాడుల్లో మరణించడం/గాయపడడం జరుగుతూనే ఉన్నాయి. 365 రోజులు దాటిన ఉక్రెయిన్‌-‌రష్యా యుద్ధంతో ప్రపంచ దేశాలు భారీ ఆర్థిక మూల్యాలను చెల్లిస్తూనే ఉన్నాయి. శ్రీలంక, పాకిస్థాన్‌ ‌లాంటి దేశాల్లో ఆకలి కేకల ఆర్తనాదాలు వింటూనే ఉన్నాం. వివిధ సందర్భాల్లో పొడచూపుతున్న సంక్షోభాలను ఆదిలోనే అంతం చేయడానికి ఐరాస లాంటి సంస్థలు చొరవ తీసుకోవాలి. ప్రపంచంలో ఏ మూలన యుద్ధం జరిగినా దాని మూల్యాన్ని ప్రపంచ మానవాళి అందరూ చెల్లించాల్సి వస్తున్నదన్న విషయం మరిచిపోరాదు.

image.png
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply