విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, విద్యా వ్యవస్థ అభివృద్ధి నోచుకుంటుందని అనుకున్నానని, కానీ పూర్తిగా నిర్వీర్యం దిశగా సాగడం బాధాకరమని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ లెక్చరర్స్ జేఏసీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో ఇచ్చిన కేజీ టూ పీజీ ఉచిత విద్యాను అమలు చెయ్యాలని అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రమాణాలు మెరుగ్గా ఉండాల్సింది పోయి భ్రస్టుపట్టి పోయాయని ఆరోపించారు. ఉద్యోగ నియామకాలు లేక యువత తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యా వ్యవస్థను నెత్తిన పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, అందులో భాగమే 12000 ప్రభుత్వ పాఠశాల మూసివేత ప్రతిపాదన అని మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సినవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసి మెరుగైన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని కోరారు.
విద్యా వ్యవస్థను కాపాడుకోలేక పోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్లు అవుతామని అన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అధ్యాపకులు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్లే, ప్రేవేట్ ఉద్యోగాలలో వెట్టిచాకిరి చేసున్నారని ఆయన అన్నారు. భవిష్యత్ తరాలను మేధావులుగా తయారు చేసే శక్తి ఉపాధ్యాయులు, అధ్యాపకులు మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన హామీలతో చేస్తున్న మోసాలు ఎక్కువరోజులు సాగవని ప్రజలు జాగృతమై తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన తెలిపారు. పోరాటాలతో తెచ్చుకున్న రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ కోసం మరో పోరాటానికి విద్యార్థులు, నిరుద్యోగులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ జేఏసీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, గౌరవ చైర్మన్ ఎం. శ్రీధర్, వైస్ చైర్మన్లు విల్సన్, కే. సైదులు, చంద్రశేఖర్ రెడ్డి, గంగు నర్సింహరెడ్డి, తేజ, శ్రీకాంత్, చైతన్య, కన్వీనర్ రాము, రమణ, రుషి, సైదిరెడ్డి, శివప్రసాద్, జానకిరెడ్డి, వినోద్ రెడ్డి, కొండలరావు, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.