కొరోనా కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతుండడాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయవాదుల సంక్షేమార్థం సోమవారం దేశంలో మొట్టమొదటిసారిగా మొబైల్ వ్యాన్ ద్వారా అత్యవసర సివిల్, క్రిమినల్ కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టబోతున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ మొబైల్ వ్యాన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, అడ్మినిస్ట్రేషన్ జడ్జి వరంగల్ నవీన్ రావు సమక్షంలో ‘‘వీడియో లింకేజ్ ద్వారా డిజిటల్ ఇనాగ్యురేషన్’’ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులు కోర్టులకు హాజరు కానవసరం లేకుండా, న్యాయవాదులు నివాసం ఉండే వివిధ ప్రదేశాలలో అన్ని పని దినాలలో మొబైల్ వ్యాన్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ వ్యాన్ను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ సమకూర్చి నట్లు ఈ సందర్భంగా తెలిపారు. మొబైల్ వ్యాన్లోనే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే న్యాయవాదులకు అవసరమయ్యే సదుపాయాలు కలుగజేస్తున్నామని తెలిపారు. మొబైల్ వ్యాన్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, న్యాయవాదులు, న్యాయార్థులు (కక్షిదారులు) కోర్టులకు హాజరు కావాల్సిన అవసరం ఉండదని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే న్యాయవాదులు కొరోనా వ్యాధి సంక్రమించకుండా తగు జాగ్రత్తలు పాటించడంతో పాటు, సామాజిక దూరాన్ని పాటిస్తూ, తప్పకుండా మాస్కు ధరించి ఉండాలని తెలిపారు. వరంగల్ జిల్లాలోని కోర్టులో కేవలం న్యాయమూర్తులు, సిబ్బంది మాత్రమే హాజరవుతారని, న్యాయవాదులు, న్యాయార్థులు కోర్టులోనికి హాజరు కావాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయకుమార్, అదనపు జిల్లా న్యాయమూర్తులు కె.శైలజ, వై.పద్మ, కె.ప్రభాకర్ రావు, ముక్తిదా, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు డి.వి నాగేశ్వరరావు, జె.విక్రమ్, మురళి మోహన్, జి.వి మహేష్ నాధ్, జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జలందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇ.వేణుగోపాల్ రావు, బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్ధన్, సిరికొండ సంజీవ రావు, న్యాయవాదులు, జిల్లా కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.