Take a fresh look at your lifestyle.

గోదారిలా నగరం

“హైదరాబాద్‌ ఇవాళ అతలాకుతలం అవుతోంది. రయ్‌ ‌మని లగ్జరీ వాహనాలు దూసుకుపోయే రోడ్ల పై పడవలు ప్రయాణం చేస్తున్నాయి. బతుకు జీవుడా అని నగర వాసి ప్రాణాలు అర చేత పట్టుకుని వరద ప్రవాహం నుంచి కట్టుబట్టలతో బయట పడే ప్రయత్నం చేస్తున్నారు. ఊహకు అందని వరద దృశ్యాలు ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వరద ఉధృతికి కార్లు, లారీలు కూడా కొట్టుకుపోవటం, అంతెత్తు బురదలో కూరుకుపోవటం, కొండ చిలువలు, మొసళ్ళు సైతం నీళ్లల్లో బయటపడటం…ఒకటేమిటి ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తున్న సంఘటనలు, దృశ్యాలు ఈ వరదల సమయంలో కనిపిస్తున్నాయి.”

pendrive rehana senior journalistహైదరాబాద్‌లో అడుగు పెట్టిన వాళ్లెవరూ ఈ నగరాన్ని ప్రేమించకుండా ఉండలేరు. హైదరాబాద్‌ అం‌టేనే ఓ ఫీల్‌… ఓ అనుభూతి…ఈ నగరం నాది అనుకునేంత దగ్గరితనం. చదువు, ఉద్యోగం, ఉపాధి…ఏ కారణంతో నగరానికి వలస వచ్చినా…అందరినీ అరమరికలు లేకుండా అక్కున చేర్చుకునే స్వభావం భాగ్యనగరానిది. అమ్మ అయి అన్నం పెడుతుంది. టీచర్‌లా జీవిత పాఠాలు ఒంట బట్టిస్తుంది. స్నేహితునికి మల్లే ఉత్సుక తరంగమై మనలో భాగం అవుతుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి సాదాసీదా అడ్డా మీద కూలీ వరకు…జీవితం ఏదైనా… నగర ఒడిలో జీవితం కుదురుకుంటుంది. అటువంటి హైదరాబాద్‌ ఇవాళ అతలాకుతలం అవుతోంది. రయ్‌ ‌మని లగ్జరీ వాహనాలు దూసుకుపోయే రోడ్ల పై పడవలు ప్రయాణం చేస్తున్నాయి. బతుకు జీవుడా అని నగర వాసి ప్రాణాలు అర చేత పట్టుకుని వరద ప్రవాహం నుంచి కట్టుబట్టలతో బయట పడే ప్రయత్నం చేస్తున్నారు. ఊహకు అందని వరద దృశ్యాలు ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వరద ఉధృతికి కార్లు, లారీలు కూడా కొట్టుకుపోవటం, అంతెత్తు బురదలో కూరుకుపోవటం, కొండ చిలువలు, మొసళ్ళు సైతం నీళ్లల్లో బయటపడటం…ఒకటేమిటి ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తున్న సంఘటనలు, దృశ్యాలు ఈ వరదల సమయంలో కనిపిస్తున్నాయి.

చేతులారా చేసుకున్నామా?
వరదతో అతలాకుతలం అవటం హైదరాబాద్‌కు ఇదే మొదటి సారి కాదు. నగర చరిత్రలోకి వెళితే 1908లో వచ్చిన మూసీ వరద గురించి తెలుసుకోవాల్సింది. డెక్కన్‌ ‌ప్లాట్యూలో ఉన్న నగరానికి నూట పన్నెండేళ్ల క్రితం భారీ వరద వచ్చింది. అప్పుడు మూడు రోజుల పాటు కుంభ వృష్టి కురిసింది. ఈ భారీ వర్షాలకు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్ళు కొట్టుకుపోయి మరో 80 వేల మంది రోడ్డున పడ్డారు. నగరంలో ఉన్న మూడు వంతెనలు అఫ్జల్‌, ‌ముస్సాలం జంగ్‌, ‌చాదర్‌ఘాట్‌ ‌తెగిపోవడంతో పూరానాపుల్‌ ‌వంతెన మాత్రమే ప్రధాన నగరంతో అనుసంధాన మార్గం అయ్యింది. వరదలో కొట్టుకుని పోతూ…ఉస్మానియా హాస్పటల్‌ ‌ప్రాంగణంలో ఉన్న ఒక చింత చెట్టు ఎక్కి పదుల సంఖ్యలో జనాలు అప్పుడు ప్రాణాలు పాడుకున్నారని చరిత్ర చెబుతోంది. ఈ వరద బీభత్సంతో ఫ్లడ్‌ ‌మేనేజ్‌మెంట్‌ అవసరాన్ని నాటి నిజాం గుర్తించారు అంటారు. భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్రఖ్యాత ఇంజనీర్‌ ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నిజాం సంప్రదించారు. అలా విశ్వేశ్వరయ్య వేసిన ప్రణాళికతో రెండు భారీ రిజర్వాయర్లు ఉస్మాన్‌సాగర్‌, ‌హిమాయత్‌ ‌సాగర్‌ ‌పురుడు పోసుకున్నాయి. దీని వల్ల వరద నీటిని రిజర్వాయర్లలోకి మళ్లించటం ద్వారా నగరం మునగకుండా జాగ్రత్త పడటానికి అవకాశం ఏర్పడింది. ఇది ఒక కోణం.

రెండో అంశానికి వస్తే చెరువుల కబ్జాకు గేట్లు తెరిచిన ధోరణి. 1950లో భాగ్యనగరంలో 500 వరకు చెరువులుండేవట. అవి కూడా ఒకదానికి ఒకటి గొలుసుకట్టు విధానంలో కలగలిసి ఉంటాయి. ఎగువ ప్రాంతంలో వరద లేదా వర్షం వల్ల ఎక్కువ నీళ్లు వస్తే అవి చెరువులోకి, ఆ చెరువు నిండితే…దాని కంటే కాస్త దిగువన ఉండే మరో చెరువులోకి నీళ్లు వెళతాయి. అలా మూసి నది వరకు నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఈ గొలుసు కట్టు విధానంలో ఏ చెరువు పై కూడా అదనపు నీళ్లు వచ్చి చేరినా ఒత్తిడి పడదు. చెరువు కట్ట తెగ పోయే పరిస్థితి రాదు. చెరువు చుట్టూ ఉంటే ఆవాసాలు నీళ్ళల్లో దిగ్బంధం అయ్యే ప్రమాదం తలెత్తదు. ఇంత అద్భుతమైన ఇరిగేటివ్‌ ఇం‌జనీరింగ్‌ ‌వ్యవస్థ నగరం నుంచి ఎప్పుడో గల్లంతు అయ్యింది. హైదరాబాద్‌ ‌లో ఇప్పుడు అటు ఇటుగా 191 చెరువులు మాత్రమే ఉన్నాయి. అంటే మిగిలిన చెరువులన్నీ ఇప్పుడు అంతెత్తు అపార్ట్‌మెంట్లకు కేరాఫ్‌ అ‌డ్రస్సులు అయ్యాయి. కమర్షియల్‌ ‌కాంప్లెక్సులు కట్టేశారు. బస్తీలు, కాలనీలు వెలిశాయి. ఇప్పుడు నామ్‌ ‌కే వాస్తేగా మిగిలిన చెరువుల విస్తీర్ణం కూడా సగానికి సగం తగ్గిపోయింది. నీటి క్వాలిటీ గురించి అసలు మాట్లాడాల్సిన పరిస్థితే లేదు. ఒకప్పుడు సాగునీరు, తాగు నీటి అవసరాలు తీర్చిన ఈ చెరువులు ఇప్పుడు మురికినీటి కుంటలుగా మారాయి. చెత్త డంపింగ్‌కు పనికి వస్తున్నాయి. మూడో ముఖ్యమైన అవసరాలకు సరిపోని డ్రైనేజ్‌ ‌వ్యవస్థ. పెరుగుతున్న అవసరాలకు తగినట్లు మౌలిక సౌకర్యాల కల్పన ఇంకా జరగాల్సి ఉంది.

గౌరవిద్దాం:
గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల 5,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రాష్ట్రం ప్రభుత్వం వెల్లడించింది. సహాయక చర్యల కోసం కేంద్రం వెయ్యి 350 కోట్ల రూపాయిల నిధులను విడుదల చేయాలని కోరుతూ ముఖ్య మంత్రి చంద్రశేఖర రావు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. నగరానికి వచ్చిన కష్టం చూసి చాలా మంది ముందుకు వచ్చి తమ వంతుగా సహాయం చేస్తున్నారు. ఆర్ధికపరమైన సహాయమే కాకుండా స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నీళ్ళల్లో చిక్కుకుపోయిన వారికి ఆహారం, నిత్యవసరాలు అందిస్తున్నారు. ప్రభుత్వంలో జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలో వర్షాల వల్ల నష్టపోయిన వారికి పదివేల నష్టపరిహారాన్ని ప్రకటించింది. కేంద్రం కూడా తన బృందాన్ని తెలంగాణాకు పంపిస్తోంది నష్టం అంచనా వేయటానికి. కాబట్టి కేంద్రం కూడా ఎంతో కొంత సహాయం అందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడటానికి ఇవన్నీ అవసరమే అయితే వీటికి మించి ఒక సమగ్ర, దీర్ఘ కాలిక ప్రణాళిక అవసరం. ఈ ప్రణాళిక కార్యాచరణ, అమలులో ప్రభుత్వం పాత్రే కాదు నగర వాసల భాగస్వామ్యం అవసరం అనేది గుర్తించాలి. పర్యావరణ పరిరక్షణను మనం గుర్తించి, గౌరవించినప్పుడే ప్రకృతి కూడా మనల్ని చల్లగా చూస్తుంది.

Leave a Reply