అసలు నువ్వు ఈ దేశ పౌరుడివేనా? అని సగటు మనిషిని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, ఇక్కడే బూడిదైన వాళ్ల తాలూకు ఆధారాలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీ తల్లి తండ్రి జన్మస్థలాలు, ఇతర వివరాలు ఉంటే.. అవి సరైనవేనా కాదా? ఇక్కడ జీవిస్తున్న మీరు ఇతర దేశాల నుండి వలసొచ్చారా ? ఆక్రమణ దారులా ? సక్రమ దారులా తేలాల్సి ఉంది. మీ మూలాలేమిటో చెప్పాల్సి ఉంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 8, 14 ,15, 21 కి వ్యతిరేకంగా పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చింది. ఈ దేశపౌరులా కాదా ? అనేది ఎన్ఆర్సి నిర్ణయిస్తుంది. ఈ దేశస్థులా? విదేశీయులా అనేది సిఏఏ నిర్ణయిస్తుంది. పౌరుల జనాభాను ఎన్పీఆర్ లెక్కిస్తోంది. ఒకదానికొకటి లింకుతో దేశపౌరుల పౌరసత్వాన్ని కావాలని ప్రశ్నిస్తున్నారు. తద్వారా పౌరులను అవమాన పరచటం అనాగరిక సమాజ లక్షణమే! 70 ఏండ్ల గణతంత్ర రాజ్యంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి జవాబివ్వాల్సిందే. సరైన ఆధారాలు ఇవ్వాల్సిందే. ప్రభుత్వం చేసే సర్వేకు ఆధారాలివ్వకుంటే మీరు అక్రమ వలసదారులే.! ఇది నిజం. మీరు ఏ దేశం నుంచో అక్రమంగా ఇక్కడికీ వలసొచ్చిన వారు. ఇక్కడ అక్రమంగా జీవిస్తున్నారు. అందుకే మీ కోసం రెడీగా నిర్భంధ శిబిరాలున్నాయి. అందులో మీ చావు.. మీరు చావండి. అంతేకాదు, రాజ్యం (కాషాయ సేన) ఒప్పుకునే మతాలవారయితే మాకు అభ్యంతరం లేదు. లేదంటే శీల పరీక్షను ఎదుర్కోవాల్సిందే. తట్టా బుట్టా సర్దుకుని తెగిన గాలిపటంలా మీకు ఎక్కడైతే స్వేచ్ఛ దొరుకుతుందో.. ఎక్కడైతే మీ హక్కులు రక్షించబడతాయో.. ఎక్కడైతే మీకు భద్రత ఉంటుందో.. మీరు అక్కడికి తక్షణమే వెళ్లాలి. ఈ దేశంలో ఈ గడ్డపై మీకు బతికే అర్హత, అవకాశం లేదు మరి.
‘‘ఈ దేశానికి అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించి, ఖాళీ చేయడానికి సాధనమే జాతీయ పౌరసత్వ రిజిస్టర్’’ అని ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. ‘‘జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్ఆర్సి)ని సృష్టించటానికి జాతీయ జనగణన రిజిస్టరు మొదటి అడుగని 2014 నవంబర్ 26న ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది’’ ఇప్పటికి ఎవరు పౌరులు ఎవరు? అక్రమంగా వలస వచ్చారు? దానికి సంబంధించిన ప్రతిపాదిక ఏమిటనేది ప్రభుత్వం వద్ద స్పష్టత లేదు. అయినప్పటికీ దేశపౌరుల్లో గందరగోళ పరిస్థితిని పాలక ప్రభువులు కల్పిస్తున్నారు. అస్సాంలో అమలు చేసిన పౌరసత్వ రిజిస్టర్ వల్ల ఎన్ఆర్సి అంటే ఏంటో అర్థం అవుతున్నది. అది ఒక నమూనగా చూడొచ్చు. అదే ఇప్పుడు కేవలం మైనార్టీలే(అత్యల్ప సంఖ్యాకులు) కాక జనాధిక్యత కలిగిన సమూహాలను సైతం అనుమానంలోకి నెట్టివేసింది. ఇది కేవలం హిందూ – ముస్లింల మధ్య సమస్య మాత్రమే కాదు. ఈ నేలపై పుట్టిన ప్రతి జీవికి జీవన్మరణ సమస్య. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన అసోంలో ఎన్ఆర్సి మానవ సంక్షోభానికి దారి తీసింది. వారిలో జీవితకాల విషాదానికి కారణమైంది. 19 లక్షల మంది ఈ దేశ పౌరులు కాదన్నా ఈ విషయాన్ని ఎలా జీర్ణించుకోగలం. సమాధి 15 లక్షల మంది హిందువులని గణాంకాలు చెబుతున్నాయి. అస్సాంలోని ఆరు నిర్భంధ కేంద్రాలలో 988 మందిని బంధించారు. అందులో 28 మంది చనిపోయారు. (నవంబర్ 27,2019న రాజ్యసభలో ప్రభుత్వమే ప్రకటించింది.)
19 లక్షల మందిలో హిందువులు ముస్లింలు ఇతర మతస్తులు ఉన్నారు. వారిలో భార్యల నుంచి భర్తలను, తల్లి దండ్రుల నుంచి పిల్లలను వేరు చేశారు. వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సిఏఏ, ఎన్ఆర్సి అమలులో ముస్లిం వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడే పుట్టిన బిడ్డ శరణార్థినని చెప్పుకోవాలా? తన ‘పౌరసత్వం’ ఎలా నిరూపించుకోవాలి? లేదా నేను భారతీయుడినేనని ఎట్లా చెప్పుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాల్లేవు. డిసెంబర్ 17, 2019న హోంశాఖ మంత్రి అమిత్ షా ‘‘ఓటర్ కార్డు, ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లు పౌరసత్వాన్ని నిర్ధారించావని, ఆధార్ పౌరసత్వాన్ని అసలు నిరూపించాదని’’ అన్నారు. ప్రభుత్వ అధికారులు మంజూరు చేసిన డాక్యుమెంట్లు ప్రభుత్వం ఆమోదించే లిస్టులో ఉండవని మరోవైపు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అన్ని పత్రాలను మళ్లీ పౌరులు సమర్పించాల్సిన అవసరం ఎందుకొచ్చింది. ప్రజలను వేధింపులకు గురి చేయడంలో భాగమే ఇది. ఈ దేశపౌరుడునని నిరూపించుకోలేకపోతే శాశ్వత కాలం ఓటుహక్కు కోల్పోతారు. అదే తరుణంలో ప్రభుత్వం నుంచి మంజూరైన పథకాలు, ఆస్తులను కోల్పోవడం తప్పదు. దేశంలో సుమారుగా నలభై రెండు కోట్ల మంది పేదలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్నారు. వారికి నివాస స్థలాలు, ఇతర ఆధారాల్లేవు. నిరక్షరాస్యత, పేదరికం కారణంగా ఎలాంటి డాక్యుమెంట్స్ లేక పౌరసత్వాన్ని నిరూపించుకునే అవకాశం లేదని గణంకాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో దేశంలో ఎలాంటి సంక్షోభానికి దారితీస్తుందో గ్రహించవచ్చు.
అధికార బీజేపీ పార్టీ ట్విట్టర్లో ‘‘యావత్ దేశంలో ఎన్ఆర్సి అమలయ్యేలా చూస్తాం. బౌద్ధులు, హిందువులు, సిక్కులు మినహా ప్రతి ఒక్క చొరబాటు దారులను దేశం నుండి తొలగిస్తాం’’ అమిత్ షా ప్రకటనను వెల్లడించింది. దీనిద్వారా ప్రభుత్వం ఏం చేయనుందో అర్థం చేసుకోవచ్చు.
ఉషోదయాన్ని పూయిస్తోన్న ‘‘షహిన్ బాగ్’’
ఇప్పుడు డిల్లీ నగరంలోని ‘షహిన్ బాగ్’ కొత్త పాఠాన్ని నేర్పుతుంది. భారతదేశ ముఖచిత్రంపై చరిత్రను లఖిస్తోంది. సిఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సిలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాన్ని షహిన్ బాగ్ తన కర్తవ్యంగా నిర్వర్తిస్తుంది. ఆ పోరాటంలో పిల్లా జెల్లా ముసలి ముతక, వయసుతో సంబంధం లేకుండా, లింగ భేదం అసలే లేకుండా పోరాటంలో అగ్రభాగాన నిలుస్తుంది. మతాలకతీతంగా ఐక్యతను ప్రదర్శిస్తూ దేశభక్తిని ‘షహిన్ బాగ్’ చాటుకుంది. ‘పౌరసత్వం’ పేరుతో ప్రజల్ని చీల్చే కుట్రలను చీల్చి చెండాడుతోంది. ఆ పోరాటం అపూర్వమైనది. ప్రణాళికబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ పోరాటాన్ని మహిళలు ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు ప్రజలు స్వచ్ఛమైన మనస్సుతో స్వచ్ఛందంగా సహకారం అందివ్వడం ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలవడం అవుతుంది. ఇప్పుడు ఆ పోరాటం దేశ వ్యాప్త ప్రజా ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రతి పల్లె మరో ‘షహిన్ బాగ్’ కావాలి.షహిన్ బాగ్ ప్రజానీకం ముందుచూపుతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన వైనాన్ని గుర్తించింది. డిసెంబర్ 15న నలుగురితో ప్రారంభం అయినా నిరసన కార్యక్రమం ప్రళయాగ్ని సృష్టిస్తుందని ఎవరు ఊహించి ఉండరు. చిటపట చినుకులుగా ప్రారంభమైన ఉద్యమం సమర శీలంగా కొనసాగుతూ దేశ ప్రజానీకాన్ని ఆకర్షిస్తోంది. మహిళల చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ‘‘స్త్రీ వంటింటి కుందేలు’’ అనే నానుడి పటాపంచలు చేస్తుంది. కారుచీకటిని చీలుస్తూ ఉషోదయాన్ని పూయిస్తోంది.ఆరు వారాలుగా శాంతియుతంగా ఆందోళనలు అక్కడ జరుగుతున్నాయి. స్పూర్తిని తీసుకొని దేశ వ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలు తెలుపుతున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా షహీన్ బాగ్లో వేముల రోహిత్ తల్లితో పాటు సామాజిక కార్యకర్తలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం ప్రవేశిక చదవటం, దాని రక్షణకు ప్రతిజ్ఞ బూనటం చారిత్రాత్మకం. సమాజ ప్రగతికి ‘ప్రతి వంటగత్తె ఒక రాజకీయ వేత్త కావాలి’ అన్నాడు లెనిన్ మహాశయుడు. ఆ మాటను షహీన్ బాగ్ మహిళల పోరాట స్పూర్తి చాటుతుంది.
డిల్లీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘‘షహీన్ బాగ్’’ ఎన్నికల అస్త్రంగా మారింది. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, ఇతర పక్షాలు ఎన్ఆర్సి, సిఏఏ, ఎన్పీఆర్ లపై విమర్శనాలు సంధిస్తుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి విద్వేషాలను రగిలిస్తుంది. బిజెపి నాయకులు చేస్తున్న మత సంబంధమైన ప్రసంగాలపై ఎలాంటి చర్యలు లేవు. వాళ్లు నిరసన కారులను, ప్రజలను ఉద్దేశించి ఉపయోగిస్తున్న భాష వివాదాస్పదమైంది. నిరసనకారులను కుక్కలతో పోల్చారు. అవును నిజమే – ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాపాలా కుక్కలు ఉన్నారు వాళ్ళు. అందులో ఎలాంటి అనుమానం లేదు. గాంధీ వర్థంతి రోజున ‘‘మీకు ఆజాది నేను కల్పిస్తా’’ అంటూ దుండగుడు (గాడ్సే ఆలోచనల వారసుడు) తుపాకీతో పోలీసుల సమక్షంలో కాల్పులు జరపడం విద్వేషాల్ని వ్యాపింప చేయడమే అవుతుంది. ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. హింసాత్మక ఘటనలను రాజ్యం ప్రోత్సహిస్తే చివరకు మిగిలేది రక్తపాతమే.
– మామిండ్ల రమేష్ రాజా
సిపిఐ(ఎం.ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 7893230218