- దిల్లీ ఆనంద్ విహార్ వద్ద భూగర్భ స్టేషన్ నిర్మాణం
- తక్కువ కోట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ‘షాంఘై టన్నెల్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్ STEC)
- వ్యతిరేకిస్తున్న స్వదేశీ జాగరణ్
- టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదంటున్న కేంద్రం
భారత-చైనా దేశాల మధ్య ప్రాచీనకాలం నుంచి సానుకూల సంబంధాలున్నప్పటికినీ, ఆధునిక కాలంలో దాగుడు మూతల ఆట దోరణులనే రెండు దేశాలు అనుసరిస్తున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలకు వత్తాసు పలకడం.., శ్రీలంక, మాల్దీవుల వంటి చిన్న దేశాలలో సైతం పెట్టుబడులు పెట్టి పరోక్షంగా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కలిగించడం ప్రస్తుతం చైనా అనుసరిస్తున్న వ్యూహాత్మక వ్యతిరేకవాదం. ఈ మధ్య కాలంలో కొరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో చైనా ను ప్రపంచ దేశాలు దోషిగా చూస్తున్నాయి . మన దేశంలో చైనా దేశ వస్తువుల బహిష్కరించి ఆర్థికంగా దెబ్బ కొట్టాలని కొన్ని స్వచ్చంద సంస్థలు పిలుపునిచ్చాయి . సామాజిక మాధ్యమాల్లో ఆ అభిప్రాయం విస్తృతంగా వైరల్ అయింది . గత కొన్ని దశాబ్దాలుగా మైత్రిని కొనసాగిస్తూనే సరిహద్దు వివాదం పై ఇరు దేశాలు భిన్న అభిప్రాయాలతో ఉన్నాయి.
భారత్, చైనా మధ్య ఉద్రిక్త ఘర్షణ పరిస్థితి నెలకొన్న సమయంలోనే. చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ‘షాంఘై టన్నెల్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్ STEC))’ కి, ఢిల్లీ-మీరట్ RRTS(రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) భూగర్భ మెట్రో విస్తీర్ణ నిర్మాణానికి కాంట్రాక్టు దొరికింది. ఈ సంస్థ అతి తక్కువ బిడ్డర్‌గా తన కొటేషన్ పంపించింది. దీనితో చైనాకు చెందిన షాంఘై టన్నెల్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్‌తో, జూన్ 12 న, నరేంద్ర మోడీ ప్రభుత్వం, చైనా బహుళజాతి నిర్మాణ సంస్థ షాంఘై టన్నెల్ ఇంజనీరింగ్ కో (STEC) కు 1,126 కోట్ల రూపాయల కాంట్రాక్టును కట్టబెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడిది వివాదాస్పదమైనది. చైనా కంపెనీకి భారత ప్రభుత్వం కాంట్రాక్టు ఇవ్వడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికి ముందే, రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగ్రన్ మంచ్ చైనా కంపెనీతో చేసుకున్నఒప్పందం రద్దు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఈ ప్రాజెక్టును నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సిఆర్‌టిసి) నిర్వహిస్తోంది. గత వారం ఐదు సంస్థలు బిడ్లు ఆన్లైన్ లో సమర్పించాయి.వీటిలో అతి తక్కువ కొటేషన్ ‘షాంఘై టన్నెల్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్ STEC)’ ది కావటంతో కాంట్రాక్టు చైనా కంపెనీకి లభించింది . అన్ని కంపెనీల కొటేషన్స్ ఇలా వున్నాయి. షాంఘై టన్నెల్ ఇంజనీరింగ్ కో. (STEC ) 1126.89 కోట్లు. లార్సెన్ అండ్ టౌబ్రో లిమిటెడ్ (ఎల్ అండ్ టి,ఇండియా ) 1170.00 కోట్లు, గుల్లెర్మాక్ అగిర్ సనాయి ఇన్సాట్ వె తహూత్ A.S..(టర్కీ ) 1325.92 కోట్లు, టాటా ప్రాజెక్టస్ లిమిటెడ్ టిడి. – ఎస్కె ఇ అండ్ సి జెవి (టిపిఎల్ – ఎస్కెఇసి జెవి,కొరియా ) 1346.29 కోట్లు,అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (అఫ్కాన్స్,ఇండియా ) 1400.40 కోట్లు కోట్ చేశాయి.
ఎన్‌సిఆర్‌టిసి ప్రకారం, 1,126 కోట్ల రూపాయలను కోట్ చేయడం ద్వారా షాంఘై టన్నెల్ ఇంజనీరింగ్ కో. (STEC) ఎల్ -1 గా అర్హత సాధించిందని, ఆ తరవాత అతి తక్కువగా భారతీయ కంపెనీ లార్సెన్, టూబ్రో లిమిటెడ్ (ఎల్ అండ్ టి) 1,170 కోట్లు కోట్ చేసినందున ఎల్ -2 గా లిస్ట్ చేశామని చెబుతున్నది. రోడ్ మినిస్ట్రీ ప్రకారం బిడ్ ల పరిశీలన న్యాయమైన, జవాబుదారీ పద్దతి ప్రకారం జరిగాయని చెబుతున్నది. ఈ ప్రాజెక్టు కోసం ఎన్‌సిఆర్‌టిసి గత ఏడాది నవంబర్‌లో బిడ్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ ప్యాకేజీకి సంబంధించిన బిడ్లను మార్చి 16 న తెరిచి చూసారు. పని పరిధిలోకి ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ నుండి యూపీలోని సాహిబాబాద్ ప్రాంతం వస్తుంది. ఈ ప్రాంతంలో జంట సొరంగాల రూపకల్పన నిర్మాణం చైనా కంపెనీ చేయనున్నది. ఆనంద్ విహార్ వద్ద భూగర్భ స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. ఎన్‌సిఆర్‌టిసి లెటర్ ఆఫ్ ఆక్సెప్టెన్స్ జారీ చేసిన తరువాత 1,095 రోజుల్లో ‘షాంఘై టన్నెల్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్ STEC)’ టన్నెలింగ్ పనులు పూర్తి చేయాలి. ఆర్ఆర్టిఎస్ ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 3 రాపిడ్-రైల్ కారిడార్లలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్టు పూర్తీ అయితే ఎన్‌సిఆర్‌టిసి ప్రకారం ఢిల్లీ-మీరట్ మధ్య దూరం సుమారు 62 నిమిషాల్లో కవర్ చేయవచ్చు.
ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాన్ని చైనా వస్తువులు,సేవలకు వ్యతిరేకంగా పోరాడే స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యతిరేకిస్తున్నది. చైనా సంస్థలపై స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యతిరేకత చాలా కాలంగా వుంది. భారత భూభాగంలో చైనా చొరబాట్ల తరువాత చైనా వస్తువులు బహిష్కరించడం అనే ప్రచారం చేయటంలో స్వదేశీ జాగరణ్ మంచ్ ముందంజలో ఉంది. భారతదేశంలో 5 జి ట్రయల్స్‌లో చైనా దిగ్గజం హువావే పాల్గొనడాన్ని స్వదేశీ జాగరణ్ మంచ్ గతంలో తీవ్రంగా వ్యతిరేకించింది. కొరోనా సంక్షోభాన్ని స్వావలంబనగా ఎదగడానికి ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు స్వదేశీ జాగరణ్ మంచ్ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారం స్వదేశీ జాగరణ్ మంచ్ పెద్దఎత్తున చేస్తున్నది. చైనా సంస్థ కాంట్రాక్టు దక్కించుకోవటంపై కాంగ్రెస్ విమర్శలు ప్రారంభించినప్పటికీ ప్రభుత్వానికి అధిక ఇబ్బందులు స్వదేశీ జాగరణ్ మంచ్ నుంచి తలెత్తుతున్నాయి.
స్వదేశీ జాగరణ్ మంచ్ కో-కన్వీనర్ అశ్వని మహాజన్ మాట్లాడుతూ ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్‌ను భారతీయ కంపెనీకి ఇవ్వాలి. ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ ను ప్రోత్సహిస్తున్నందున, ఇంత పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాన్ని భారతీయ సంస్థ ద్వారా నిర్వహించాలి అని అశ్వని మహాజన్ డిమాండ్ చేస్తున్నారు.