Take a fresh look at your lifestyle.

గాల్వాన్ ఘటనపై చైనా పశ్చాత్తాపం… నమ్మశక్యమా

లడఖ్ తూర్పు ప్రాంతంలోని గాల్వాన్ లోయలో రెండు నెలల క్రితం చైనాకి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) సైనికులు జరిపిన కాల్పులలో 20 మంది భారత సైనికులు మరణించిన సంఘటన పట్ల చైనా విచారాన్ని వ్యక్తం చేసింది. ఇది జరగకుండా ఉండాల్సిందంటూ చైనా రాయబారి సన్ వీడాంగ్ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. చైనా చర్యను ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. చైనా సైనికుల దాడిని మన సైనికులు తిప్పి కొట్టినప్పుడు చైనా సైనికులు చాలా మంది మరణించారు.అయితే, ఎంత మంది మరణించారో చైనా రక్షణ శాఖ ఇంతవరకూ బయటపెట్టలేదు. మొదట అసలు ప్రాణనష్టమే జరగలేదనీ, తమ సైనికులు వీరోచితంగా పోరాడి భారత్ సైనికులను పరుగులెత్తించారంటూ చైనా రక్షణ శాఖ ప్రగల్భాలు పలికింది. గాల్వాన్ లోయ సంఘటనలో చైనా సైనికుల ప్రాణనష్టంపై అంతర్గతంగా అలజడి రేగినట్టు వార్తలు వొచ్చాయి. సైనికుల కుటుంబాలు నిరసన తెలిపాయి. అయితే, చైనీస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. కొరోనా వైరస్ వ్యాప్తిలో చైనా పాత్ర ఉందన్న ఆరోపణల నేపధ్యంలో అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో గాల్వాన్ సంఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో చైనా ప్రభుత్వం ఇరుకున పడింది. కొరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచంలో అన్ని దేశాలూ చైనాను వేలెత్తి చూపాయి.

గాల్వాన్ లోయలో ఉద్రిక్తతలకు కూడా చైనాదే తప్పనే విమర్శలు చైనా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేశాయి. దాంతో వెంటనే ఇందుకు బాధ్యతను అంగీకరిస్తే తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందన్న కారణంగా చైనా ప్రభుత్వం ఇందుకు భారత సైనికుల కవ్వింపులే కారణమంటూ బుకాయిస్తూ వొచ్చింది. నిజానికి గాల్వాన్ సంఘటన జరగడానికి ముందు ఇరుదేశాల మిలటరీ కమాండర్ల స్థాయి సమావేశాలు రెండు,మూడు పర్యాయాలు జరిగాయి. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్నదున్నట్టు పరిస్థితిని కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నారు.అయినప్పటికీ చైనా సైనికులు భారత సైనికులపై దొంగదెబ్బతీసే ప్రయత్నం చేశారు. దీనికి మన సైనికులు అప్రమత్తంగా ఉన్నారు కనుక, ధీటైన సమాధానమిచ్చారు. గాల్వాన్ సంఘటన తర్వాత కూడా కమాండర్ల స్థాయి సమావేశాలు జరిగాయి. చైనాది మాట తప్పే స్వభావం. ఇరుదేశాల మధ్య కుదిరిన అవగాహన, అంగీకారాలకు కట్టుబడి ఉండకపోవడం వల్లనే భారత్ తో తరచూ సైనిక ఘర్షణలు జరుగుతున్నాయి. సిక్కిం సరిహద్దులలో దాదాపు రెండు నెలలు పైగా ఉద్రిక్తత కొనసాగడానికి చైనా సైనికుల మోహరింపు ప్రధాన కారణం. డోక్లామ్ వద్ద భూటాన్, సిక్కిం ప్రాదేశిక ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చే రీతిలో మహామార్గంలో భాగంగా ఒక రోడ్డు నిర్మాణాన్ని చైనా చేపట్టినప్పుడు ఈ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ వివాదాన్ని దౌత్య పరమైన ఒత్తిడి ద్వారా మన దేశం ఎదుర్కొంది. చైనాదే తప్పు అని పొరుగు దేశాలే కాకుండా ఇతర దేశాలు ఆరోపించాయి. ఒకప్పుడు అమెరికాది సామ్రాజ్య వాద విస్తరణ కాంక్ష అని విమర్శించిన చైనా ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత ఆర్థికంగానూ, ప్రాదేశికంగానూ విస్తరణ కార్యక్రమాలను చేపట్టి ప్రపంచ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. గతంలో అమెరికా కి మాత్రమే పరిమితమైన ఈ పాత్రను ఇప్పుడు చైనా పోషిస్తోంది.

చైనా రాయబారి సన్ వీడాంగ్ భారత- చైనా యూత్ వెబనార్ లో ప్రసంగిస్తూ సుద్దులు పలికారు. ఇరుదేశాల్లో యువకులు చేతులు కలిపితే ప్రపంచంలో అజేయమైన శక్తిగా ఎదగవచ్చని అన్నారు. ముఖ్యంగా, భారతీయ యువకుల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన మెచ్చుకున్నారు. కరోనా కారణంగా చైనా నుంచి భారతీయ ఐటి నిపుణులు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు స్వదేశానికి తిరిగి వస్తుండటంతో చైనా లో కంపెనీల్లో మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చైనా రాయబారి గాల్వాన్ సంఘటనకు పశ్చాత్తాపాన్ని ప్రకటించడమే కాకుండా, భారతీయ యువ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను పొగడటం మొదలు పెట్టారు. అయితే, చైనా ఇప్పుడు ఎన్ని యత్నాలు సాగించినా మళ్ళీ ఆ దేశంలో ఉద్యోగాల కోసం వెళ్ళేందుకు భారతీయ సాంకేతిక నిపుణులు సిద్దంగా లేరు. ఆ మాటకొస్తే చైనా నుంచి ఎంఐ, వివో వంటి కంపెనీలు,ఇంకా పేరు మోసిన కంపెనీలు బిచాణా ఎత్తేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

చైనాలో కరోనా భయం ఒకటే కాకుండా, శాస్త్ర , సాంకేతిక నిపుణులపై నిఘా పెరిగింది. ఇది కూడా అమెరికాను చూసే చైనా అమలు జేస్తోంది. వీడాంగ్ చైనాని వెనకేసుకుని రావడానికి చాలా కష్టపడ్డారు. పొరుగు దేశమైన భారత్ ను చైనా మొదటి నుంచి మిత్ర దేశంగా పరిగణిస్తోందని అన్నారు. చరిత్ర తెలిసిన వారెవరూ ఈ మాటలను నమ్మరు. 1962లో ఆనాటి చైనా ప్రధాని చౌ ఎన్ లే మాయమాటలకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హిందీ-చీనీ బాయీభాయ్ అనే నినాదంతో చైనాకు స్నేహ హస్తాన్ని అందించారు. దానిని చైనా అలుసుగా తీసుకుని దురాక్రమణకు పాల్పడింది. ఆనాడు చైనా ఆక్రమించుకున్న ప్రాంతాలు ఇప్పటి వరకూ మనకు స్వాధీనం చేయలేదు. అంతవరకూ ఎందుకు, కాశ్మీర్ ను విభజించి లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని చైనా ఇప్పటికీ అభ్యంతరం చెబుతోంది. ఆక్రమిత కాశ్మీర్ అనే పదంలోనే కాశ్మీర్ భూభాగాన్ని పాక్ ఆక్రమించుకుందన్న అర్థం వెల్లడవుతోంది. ఆ ప్రాంతంలో చైనా విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఆ ప్రాంతం గుండా ఎకనామిక్ కారిడార్ ను నిర్మిస్తోంది. పైకి సుద్దులు చెప్పడం, వెన్నుపోట్లు పొడవడం చైనాకు అలవాటే. 20 మంది భారత సైనికుల ప్రాణాలను బలిగొన్న గాల్వాన్ సంఘటనపై ఇప్పుడు చైనా పశ్చాత్తాపాన్ని ప్రకటించడాన్ని ఎవరూ నమ్మరు. చైనా మేకవన్నె పులి అన్న సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు.

Leave a Reply