Take a fresh look at your lifestyle.

అరుణాచల్ లో చైనా గ్రామం… భారత్ ఆక్షేపణ

నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం.. అని మహాకవి శ్రీశ్రీ అన్నాడు. చైనా చరిత్ర సమస్తం చొరబాట్లే. 1964లో ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించిన చైనా ఇంతవరకూ ఖాలీ చేయలేదు. మన దేశానికి చెందిన 90వేల హెక్టార్ల భూమిని చైనా ఆక్రమించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటించారు.అది పాత చరిత్ర అనుకుంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ తూర్పు ప్రాంతంలో నాలుగైదు కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకుని వొచ్చి చైనా ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించింది. చైనా భూదాహానికే కాదు. జలమార్గా ల అక్రమ చొరబాట్లకూ అంతు లేదు. చైనాను నిలువరించే శక్తి ప్రపంచంలో అమెరికాకు మాత్రమే ఉంది. కానీ, అమెరికా అధ్యక్ష పదవిని మొన్నటి వరకూ నిర్వహించిన ట్రంప్ అనుసరించిన విధానాల వల్ల చైనా మరింత బలపడింది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు జో బైడెన్ హయాంలోనైనా చైనాకు ముకుతాడు వేస్తారని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. చైనా మన భూభాగంలో అరుణాచల్ ప్రాంతంలోకి, అటు లడఖ్ లోని తూర్పు ప్రాంతంలోకి చొచ్చుకుని వొచ్చేందుకు వీలున్నప్పుడల్లా ప్రయత్నిస్తోంది. గత సంవత్సరం జూన్ లో లడఖ్ తూర్పు ప్రాంతంలోని గాల్వాన్ ప్రాంతంలోకి చొచ్చుకుని వచ్చిన చైనీస్ దళాలను మన సైనికులు తరిమి కొట్టారు. ఈ క్రమంలోనే 20 మంది సైనికులు మరణించారు.వారిలో తెలంగాణాకు చెందిన సంతోష్ బాబు ఉన్నారు. ఆయనకు మరణానంతర పురస్కారంగా పరమవీర చక్ర పురస్కారాన్ని రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వొచ్చాయి. చైనా మొదటి నుంచి చొరబాటు వైఖరిని అనుసరిస్తోంది. పాకిస్తాన్ కూడా మన దేశంలోకి చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. చైనా చొరబాట్లు శాశ్వతంగా భూభాగాలను కబ్జా చేయడమైతే, పాకిస్తాన్ చొరబాట్ల ద్వారా ఉగ్రమూకలను మన దేశంలోకి పంపడం. రెండింటి ప్రయోజనాలు వేర్వేరే అయినా,వాటి లక్ష్యాలు భారత్ ను బలహీనపర్చడమే. అందుకే,ఆ రెండు దేశాలూ ఏకమయ్యాయి.

భారత దేశానికి పొరుగుదేశాలతో ముప్పు ఈ విధంగా ఏర్పడింది. ఇప్పుడు చైనా నిర్మించిన గ్రామం పై భారత్ అభ్యంతరం తెలిపింది. అయితే,ఈ గ్రామాలు నిర్మించిన ప్రదేశం తమ భూభాగంలోనే ఉందనీ, తమ టిబెట్ కు చెందిన భూభాగంలోనే నిర్మించడం జరిగిందని చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునైంగ్ ప్రకటించారు. నిజానికి టిబెట్ కూడా స్వతంత్ర దేశమే. కానీ,ఆ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాను వెళ్ళగొట్టింది. దలైలామా దశాబ్దాల క్రితం మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆశ్రమం నిర్మిచుకుని ఆశ్రయం పొందుతున్నారు. దలైలామా మన దేశంలో ఏ ప్రాంతంలో పర్యటించినా, అమెరికా, తదితర దేశాల్లో పర్యటించినా చైనా అభ్యంతరం తెలుపుతోంది. చివరికి దలైలామా వారసుని ఎంపిక విషయంలో కూడా చైనా జోక్యం చేసుకుంటోంది. నిజానికి దలైలామా వారసుని ఎంపిక పూర్తిగా బౌద్ధుల ఆంతరంగిక వ్యవహారం. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాని హెచ్చరించారు.అయితే,అప్పటికే చైనాతో ఆయన వైరం బాగా ముదరడం వల్ల ఆయన హెచ్చరికలను చైనా పట్టించుకోలేదు. దలైలామా మన దేశంలో ఆశ్రయం పొందుతున్నప్పటికీ దలైలామా ఆంతరంగిక వ్యవహారాల్లో ముఖ్యంగా,ఆయన పర్యటనలు, బౌద్ధుల కార్యక్రమాల విషయంలో మన దేశం ఎన్నడూ జోక్యం చేసుకోలేదు.

- Advertisement -

ఇదే విషయాన్ని దలైలామా స్వయంగా పేర్కొన్నారు. భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశమే కాకుండా, సెక్యులర్ దేశమనీ, అన్ని మతాలకూ స్వేచ్ఛ ఉందని ప్రశంసించారు. ఈ విషయంలో చైనాను కట్టడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలు కలిసి రావాలని దలైలామా విజ్ఞప్తి చేశారు. జపాన్, థాయిలాండ్ లలో కూడా బౌద్ధం అధికార మతంగా ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు చైనాతొ తగాదా పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు. తైవాన్ చిన్న దేశమైనా ఈ విషయంలో మనకు మద్దతుగా నిలుస్తోంది. చైనా నిర్మించే కట్టడాలు భారత్ లోనే కాకుండా, భూటాన్, తదితర పొరుగు దేశాల్లో కూడా ఉన్నాయి. భూటాన్ లో కట్టడాల విషయంలో అభ్యంతరం తెలిపినా చైనా లెక్క చేయలేదు. మూడేళ్ళ క్రితం డోక్లామ్ వద్ద చైనా సైన్యాన్ని మోహరించినప్పుడు మన దేశం కూడా సిక్కిం సరిహద్దులలో సేనలను మోహరించింది. చాల కాలం ఉద్రిక్తత తర్వాత చైనా సేనలు వైదొలగాయి. కాశ్మీర్ విభజన విషయంలో కూడా చైనా సంబంధం లేకపోయినా జోక్యం చేసుకుంటోంది. కాశ్మీర్ లో అంతర్భాగంగాఉంటూ వచ్చిన లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం వల్ల చైనా వ్యూహాలకు ఆటంకం కలిగింది.

లడఖ్ భూభాగం మీదుగా నిర్మాణాలు చేపట్టేందుకు చైనా పథకాలు తయారు చేసింది. కాశ్మీర్ భారత్ అంతర్భాగమైన ప్పటికీ కాశ్మీర్ విషయంలో చైనా పాకిస్తాన్ కు వంత పాడుతూ జోక్యం చేసుకుంటోంది. చైనా, పాకిస్తాన్ లు కాశ్మీర్ విభజన విషయంలో జోక్యం చేసుకోవడాన్ని అమెరికా,ఇతర అగ్రదేశాల వ్యతిరేకించాయి. భారత్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లో తలదాచుకున్న జైష్, లష్కర్ ఉగ్రవాద సంస్థల నాయకులపై వేటు పడకుండా చైనా కాపుకాస్తోంది. ఈ విషయంలో కూడా చైనాకు అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తనకున్న వీటో పవర్ ను ఉపయోగించి చైనా మన కు అన్ని సందర్బాల్లో అడ్డుపడుతోంది. ఇప్పుడు ఏకంగా గ్రామాన్నే నిర్మించి భారత్ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ట్రంప్ కన్నా భిన్నంగా ఉంటారని అనుకున్నా, ఇలాంటి విషయంలో బైడన్ స్వతంత్ర వైఖరిని అనుసరించకపోతే చెడ్డపేరు తెచ్చుకుంటారు.

Leave a Reply