Take a fresh look at your lifestyle.

హాంకాంగ్‌ ఆ‌క్రమణకు చైనా పన్నాగం

అగ్రరాజ్య హోదా కోసం చైనా ఇప్పుడు చిన్న దేశాల, పొరుగుదేశాల అస్తిత్వాన్నీ, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడం కోసం ప్రయత్నిస్తోంది. అమెరికా మీద కోపంతో అగ్రరాజ్యంతో సన్నిహితంగా ఉండే దేశాలకూ, పాలనా వ్యవస్థలకూ హాని కలిగించే రీతిలో ప్రయత్నిస్తోంది. హాంకాంగ్‌ ఒకప్పుడు బ్రిటిష్‌ ‌వలస ప్రాంతం. ఆ ప్రాంతానికి స్వయం పాలనా ప్రతిపత్తిని కల్పించేందుకు చైనా, బ్రిటిష్‌ ‌ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని తుంగలోకి తొక్కేందుకు చైనా ప్రయత్నిస్తోంది. హాంకాంగ్‌ ‌లో జాతీయ భద్రతా చట్టం బిల్లును చైనా పార్లమెంటు గురువారంనాడు ఆమోదించింది. ఒకరు తప్ప పార్లమెంటులో అంతా ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో హాంకాంగ్‌ ‌పై చైనా మరింత పట్టు సంపాదించింది. చైనా ఆధిపత్యాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే నేరంగా పరిగణించి పౌరులను అణచివేయడానికి ఆస్కారం కలుగుతుంది. చైనా ఉక్కు పాదం కింద ఇప్పటికే టిబెట్‌, ‌తైవాన్‌ ‌లు నలిగి పోతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో దీవులను కాజేయడానికి చైనా సాగిస్తున్న విన్యాసాల వల్ల ఫిలిప్పీన్స్ , ‌వియత్నాం తదితర దేశాలు విలవిల లాడుతున్నాయి. ఇటు మన దేశంలో అంతర్భాగమైన లడఖ్‌ ‌గాల్వాన్‌, ‌పాంగాంగ్‌ ‌లోయలను ఆక్రమించడానికి సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతను పెంచింది. సిక్కిం- భూటాన్‌ ‌సరిహద్దుల్లో డోక్లాంలో కూడా సరిహద్దుల చొరబాట్లకు గత ఏడాది ప్రయత్నించి భంగ పడింది. ఇప్పుడు హాంకాంగ్‌ ‌పై చైనా దృష్టి కేంద్రీకరించడానికి కారణం అమెరికా నుంచి వస్తున్న వొత్తిళ్ళే. కరోనా పుట్టక రహస్యాలను గురించి తెలుసున్నా బాహ్య ప్రపంచానికి తెలియజేయడం లేదని చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌కారాలు, మిరియాలు నూరుతున్నారు. హాంకాంగ్‌ ‌లో అమెరికా, దాని మిత్ర దేశాల వాణిజ్య సంస్థలు అనేకం ఉన్నాయి. హాంకాంగ్‌ ‌లో ప్రపంచంలో అతి పెద్ద స్టాక్‌ ‌మార్కెట్‌ ఉం‌ది. హాంకాంగ్‌ ‌లో స్వయం పాలనా స్వయం పాలనా ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు చైనా సాగిస్తున్న యత్నాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది గత ఏడాది ఆందోళన జరిపారు. వారికి అమెరికా సహా, ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోంది.

కరోనా కారణంగా కొంత కాలం వెనక్కి తగ్గి ఉన్న చైనా ఇప్పుడు అక్కడి ఆందోళన కారులను నిర్దాక్షిణ్యంగా అణచి వేయడం ద్వారా అమెరికాను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తోంది. బ్రిటిష్‌ ‌పాలనలో హాంకాంగ్‌ ‌స్వేచ్ఛావాణిజ్య మండలంగా అభివృద్ధి చెందింది. చైనా నియంతృత్వ ధోరణులను అక్కడి ప్రజలు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. హాంకాంగ్‌ ‌ప్రజలు స్వేచ్చా ప్రియులు. ఎవరి ఆధిపత్యాన్నీ సహించే స్థితిలో లేరు. స్వేచ్ఛ, స్వతంత్ర భావాలను చైనా పాలకులు సహించలేక పోవడం వల్లనే హాంకాంగ్‌ ‌పై తరచూ గొడవ పెట్టుకుంటున్నారు. అయితే, హాంకాంగ్‌ ‌లో వ్యాపార, బ్యాంకింగ్‌ ‌సంస్థల మద్దతు, వాటి ద్వారా రుణాలు లేనిదే చైనా కంపెనీలు ముందుకు సాగలేవు. అందువల్ల ఆ సంస్థలను లొంగ దీసుకోవడానికి చైనా ప్రభుత్వం సామదానభేద దండోపాయ పద్దతిని అనుసరిస్తోంది. హాంకాంగ్‌ ‌లో ప్రస్తుత పరిణామాలను ఈ కోణం నుంచే చూడాల్సి ఉంటుంది ప్రపంచంలో వాణిజ్యంలో హాంకాంగ్‌ ఆరవ స్థానంలోనూ, మానవాభివృద్ది సూచిలో నాల్గవ స్థానంలో ఉంది. హాంకాంగ్‌ ‌ను 1997లో చైనాకు బ్రిటిష్‌ ‌వారు అప్పగించారు. ఒక దేశం- రెండు వ్యవస్థలు సూత్రాన్ని పాటిస్తాననీ, హాంకాంగ్‌ ‌స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తానని మాట ఇచ్చిన చైనా కొద్ది రోజులకే మాట తప్పింది. అప్పటి నుంచి బ్రిటన్‌ ‌కూడా చైనాపై గుర్రు పెంచుకుంది.

అప్పట్లో కుదిరిన ఒప్పందం ప్రకారం హాంకాంగ్‌ ‌లో చైనా చట్టాలు వర్తించవు హాంకాంగ్‌ ‌పరిపాలకురాలిగా ఉన్న మేరీ కామ్‌ ‌చైనా అనుకూల వైఖరి వల్ల ప్రజల్లో అసహనం పెరిగి ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఈ ఆందోళనలను చైనా పాలకులు చైనాపై తిరుగుబాటుగా చిత్రించి అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆందోళన కారులపై ఉగ్రవాద ముద్ర వేశారు. దీంతో వారు మరింత రెచ్చి పోయారు. వీరిపై ఉక్కుపాదాన్ని మోపేందుకే జాతీయ భద్రతా చట్టాన్ని చైనా పార్లమెంటు ఆమోదించింది. తమ ది స్వయం పాలిత ప్రాంతమనీ, చైనా చట్టాలు వర్తించవని హాంకాంగ్‌ ‌ప్రజలు వాదిస్తున్నారు. ఈ ఆందోళనకారులకు అమెరికా,ఇతర పాశాచ్య దేశాలు అన్ని విధాల సాయం అందిస్తున్నాయి. హాంకాంగ్‌ ‌ను అంతిమంగా తమ దేశంలో అంతర్భాగం చేసేసు కోవాలన్నదే చైనా నాయకుల వ్యూహం.ఆ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధులు సమయం వచ్చినప్పుడల్లా స్పష్టం చేస్తూనే ఉన్నారు. తైవాన్‌, ‌హాంకాంగ్‌ ‌లు తమ దేశ అంతర్భా గాలేనంటూ చైనా విదేశాంగ ప్రతినిధి ఇటీవల చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శన. అన్ని వైపులా అన్ని ప్రాంతాలనూ కబళించే యత్నాలతో ముందుకు సాగుతుండటం వల్లనే చైనాపై ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత పెరుగుతోంది.

Leave a Reply