Take a fresh look at your lifestyle.

లడఖ్‌పై చైనా అవాకులు… తిప్పికొట్టిన భారత్‌

మొన్నటి వరకూ జమ్ము, కాశ్మీర్‌లో అంతర్భాగమైన లడఖ్‌ ‌గురించి చైనా మాట్లాడటం విడ్డూరమే. అయితే, చైనాకు అలాంటివేమీ లేవు. పొరుగుదేశాల భూభాగాలను ఆక్రమించుకోవడంలో ప్రపంచంలో చైనాను మించిన దేశం లేదు. భారత్‌ ‌భూభాగాలను  దాదాపు అరవై ఏళ్ళ క్రితమే ఆక్రమించిన  చైనా, మొన్నటి వరకూ చెట్టపట్టాలేసిన నేపాల్‌ ‌లోని సరిహద్దు ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంది. సిక్కిం, భూటాన్‌ ‌సరిహద్దుల్లో డోక్లాం భూభాగాన్ని మూడేళ్ళ క్రితం ఆక్రమించుకునేందుకు ప్రయత్నించింది. మన సేనల మోహరింపుతో అక్కడ మూడు మాసాల పాటు ఉద్రిక్తత కొనసాగింది. ఆక్రమిత కాశ్మీర్‌(‌పీఓకె) లో సగంపైగా భూభాగాలను చైనా విద్యుత్‌ ‌ప్లాంట్ల నిర్మాణం సాకుతో ఆక్రమించుకుంది. అటువంటి చైనా ఇప్పుడు లడఖ్‌ని  కేంద్ర పాలిత ప్రాంతంగా మన దేశం ఏర్పాటుచేస్తోంది. లడఖ్‌ ‌ప్రాంతం ప్రజలు స్వాతంత్య్రం రాక ముందు నుంచి భారత్‌లో అంతర్భాగమైన కాశ్మీర్‌ ‌రాజ్యం  పరిధిలో ఉండేవారు. భారత్‌తో సత్సంబంధాలను వారు కోరుకుంటున్నారు. జమ్ము,కాశ్మీర్‌లో అంతర్భాగంగా ఉన్నప్పుడు  ఉగ్రవాదుల దాడుల ప్రభావం వల్ల శాంతిభద్రతల సమస్యల కారణంగా తమ ప్రాంతాన్ని కాశ్మీర్‌ ‌ప్రభుత్వం పట్టించుకోలేదనీ, ఇకపైనా నేరుగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలను కలిగి ఉండటం వల్ల తమ ప్రాంతం అభివృద్దికి అవకాశాలు మెరుగయ్యాయని ఆ ప్రాంతానికి  ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు జెమ్యియాంగ్‌ ‌త్సేరింగ్‌  ‌నామంగ్యాల్‌ ‌పార్లమెంటులో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. లడఖ్‌లో బౌద్ద భిక్షుల సంఖ్య ఎక్కువ. వారికి హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆరాధ్యదైవం.

ఆయనను సందర్శించుకోవడానికి, సంబంధాలు పెంచుకోవడానికి భారత్‌లో అంతర్భాగంగా ఉంటమే ప్రయోజనకరమని వారు భావిస్తున్నారు. అంతేకాక, తమ ప్రాంత ఉత్పత్తులకు భారత్‌లో మార్కెటింగ్‌ ‌సౌకర్యాలు లభిస్తాయని లడఖ్‌ ‌ప్రజల భావన. చైనా చొరబాట్లను వారు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లడఖ్‌ ‌తూర్పు ప్రాంతంలో గాల్వానా లోయలోకి చైనా ఇటీవల జరిపిన చొరబాట్లను  భారత్‌ ‌సైనికులు తిప్పికొట్టిన సందర్భంలో సైనికులకు నైతిక మద్దతు ఇచ్చారు. లడఖ్‌ ‌జమ్ము, కాశ్మీర్‌ అం‌తర్భాగంగా ఉన్నప్పుడు స్థానిక సమస్యలను    ప్రభుత్వం దృష్టికి తెచ్చినా కాశ్మీర్‌ అశాంతి  కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేకపోవడంతో విడిగా, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండటానికే వారు ఇష్టపడుతున్నారు. అప్పట్లో రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌కి వెళ్ళాల్సి వస్తే వారు చాలా  అవస్థలు పడేవారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. లడఖ్‌ ‌ప్రత్యేక ప్రాంతం కావడం వల్ల చైనా ఆటలు సాగడం లేదు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడానికి మన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. లడఖ్‌ ‌తూర్పు ప్రాంతంలో కూడా  రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయాలను మెరుగు పర్చే కార్యక్రమాలను మన దేశం ముమ్మరం చేయడం వల్లనే అక్కడికి చైనా సైన్యాన్ని తరలించింది. కవ్విపు చర్యలకు పాల్పడుతోంది. నిజానికి చైనాకు లడఖ్‌పై ఏమాత్రం హక్కు లేదు. చైనా తలపెట్టిన మహామార్గం నిర్మాణానికి అవసరమైన భూభాగాలన్నింటినీ   ఆక్రమించుకునే ఉద్దేశ్యంతోనే చైనా పొరుగు దేశాల భూభాగాల్లోకి చొచ్చుకుని వస్తోంది. భూటాన్‌ ‌భూభాగంలోకి కూడా ఇదే మాదిరిగా చొచ్చుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. నేపాల్‌ ‌ప్రధాని ఖడ్గ ప్రసాద్‌ ‌శర్మ ఓలీని చైనా అధ్యక్షుడు జిన్‌ ‌పింగ్‌ ‌మాయమాటలతో  లొంగ తీసుకున్నారు. నేపాల్‌ ‌భూభాగంలో కూడా శాశ్వత కట్టడాలను చేపట్టారు. ఈ నేపథ్యంలో నేపాల్‌ ‌ప్రధాని ఓలికి స్వదేశంలో ప్రతిపక్షాలు వ్యతిరేకమయ్యాయి.

లడఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) పొడవునా మనకు చెందిన వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఇప్పటికే ఆక్రమించుకుంది. దీనిపై మన దేశం వివిధ స్థాయిలలో నిరసనలు తెలిపింది. ఈ భూభాగాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించింది. అయితే, తాము నిర్ధారించినదే అసలైన ఎల్‌ ఏసీ అని చైనా బుకాయిస్తోంది. పాకిస్తాన్‌ ‌నుంచి వచ్చే ఉగ్రవాదులకు చైనా ఈ ప్రాంతంలో ఆశ్రయం ఇచ్చి భారత్‌లో అక్రమ ప్రవేశానికి అన్ని విధాల సాయ పడుతోంది. అటు పాకిస్తాన్‌కీ, ఇటు చైనాకీ చెక్‌ ‌పెట్టేందుకే గత సంవత్సరం ఆగస్టులో కాశ్మీర్‌ ‌విభజన సమయంలో లడఖ్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా మన ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్‌ ‌నుంచి వచ్చే ఉగ్రవాదులకు దారులన్నీ మూసుకుని పోయాయి. దీంతో పాక్‌ ‌ప్రోద్భలంతో లడఖ్‌ను కాశ్మీర్‌ ‌నుంచి వేరు చేయడాన్ని గుర్తించమంటూ చైనా కొత్త పల్లవిని అందుకుంది. నిజానికి భారత్‌ ‌సర్వసత్తాక పరిధిలో ఉన్న ప్రాంతంలో మార్పులు చేర్పులు చేసేందుకు సంపూర్ణమైన హక్కును కలిగి ఉంది. ఆ హక్కును ప్రశ్నించే హక్కు ఏదేశానికీ లేదు. చైనా మన దేశాన్ని కవ్వించడం కోసమే  ఈ ప్రకటన చేసింది. అయితే, మన ప్రభుత్వం చైనాకు  సరైన రీతిలో గట్టి సమాధానమిచ్చింది. భారత్‌లో అంతర్భాగమైన ప్రాంతాల  గురించి మాట్లాడే  హక్కు చైనాకు లేదని స్పష్టం చేసింది. చైనా ఈ మాదిరిగా పరిధిలు మీరి మాట్లాడటం ఇది మొదటి సారి కాదు. ఇంతటితో ఆపేస్తుందన్న  నమ్మకం లేదు. సరిహద్దులలో చైనీస్‌ ‌సైనికుల చొరబాట్లను మన సైనికులు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉన్నారు. సరిహద్దులలో  చైనాకు ధీటుగా మిసైళ్ళనూ, ఇతర ఆయుధాలను మోహరించి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మన సేనలు సిద్ధంగా ఉన్నాయి.

Leave a Reply