Take a fresh look at your lifestyle.

‌జగాన్నంతా కట్టడిలో పడేసిన చైనా కోలుకుంటోంది

జగాన్నంతా కొరోనా కట్టడిలో పడేసిన చైనా దేశం క్రమేణా కోలుకుంటోంది. గడచిన అయిదారు రోజులుగా దేశవ్యాప్తంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో, రెండు నెలలుగా పలు ప్రావిన్సుల్లో ఉన్న లాక్‌డౌన్‌ ఆం‌క్షలను మెల్లమెల్లగా అక్కడి ప్రభుత్వం తొలగిస్తోంది. కొరోనా జన్మస్థలంగా చెబుతున్న చైనాలోని వుహాన్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. చైనాలో కొరోనా బారిన పడిన మొత్తం కేసుల్లో దాదాపు యాభై నాలుగు శాతం వుహాన్‌ ‌ప్రాంతానికి చెందినవే కావడం గమనార్హం. కాగా మరో నగరం హుబే ప్రావిన్సులో అత్యధిక మరణాలతోపాటు, ఎక్కువ సంఖ్యలో వ్యాధిగ్రస్తులు నమోదైనారు. అయితే వైరస్‌కు మూలకేంద్రంగా భావిస్తున్న వుహాన్‌ ‌నగరంలో మాత్రం ఏప్రిల్‌ ఎనిమిదవ తేదీవరకు ఇంకా లాక్‌డౌన్‌ను కొనసాగుతుందని ప్రకటించిన ప్రభుత్వం, వ్యాధి ప్రభావం పెద్దగాలేని ప్రాంతాల నుండి ప్రజలను వారివారి స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీంత• రెండు నెలలుగా ఆంక్షల మధ్య నలిగిపోతున్న ప్రజలకు ఒక్కసారే స్వేచ్ఛ వచ్చినట్లైంది. తమతమ ప్రాంతాలకు బయలుదేరిన వారితో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి.

ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలు ఇంకా కొరోనా కోరల్లో విలవిల్లాడుతూనేఉన్నాయి. ప్రప•ంచమంతా విస్తరించిన ఈ మహమ్మారి, ఇప్పటి వరకు 21,524 మంది ప్రాణాలను హరించివేసి, మరో 4లక్షల 78వేల 331 మందితో ఆటలాడుకుంటున్నది. ఒక్క మంగళవారం నాడే ప్రపంచ వ్యాప్తంగా 24వందల మంది మృత్యువాత పడ్డారంటే ఈ వ్యాధి ఏమేరకు విస్తరిస్తుందో అర్థమవుతున్నది. ఏ రోజు కారోజు గంటగంటకు అటు మరణాల సంఖ్య, ఇటు వైరస్‌ ‌సోకినవారి జాబితా పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత ఎక్కువ నష్టపోయిన దేశం ఇటలీ. ఆ దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ ‌కారణంగా మరణించిన వారి సంఖ్య 6820కి చేరుకోగా, సుమారు డెబ్బైవేలమందికి పాజిటివ్‌ ‌రావడంతో ఆదేశం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈవ్యాధి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయలేకపోవడమే ఇంతపెద్ద స్థాయిలో నష్టపోవడానికి కారణమని ఆ దేశాధ్యక్షుడు వాపోవడం గమనార్హం. అలాగే స్పెయిన్‌లో దాదాపు మూడు వేలమంది మృతిచెందారు. ఇక్కడ ఒక్కరోజులోనే 738మంది చనిపోవడం అందరిని కలిచివేస్తున్న సంఘటన, ఇరాన్‌లో 1934, ఫ్రాన్స్‌లో 11వందల మంది మృత్యువాతపడ్డారు. అగ్రరాజ్యమైన అమెరికా కూడా తీవ్రంగా నష్టపోయింది. ఒక్క రోజులోనే పదివేల కేసులు నమోదు అయినాయంటే వైరస్‌ ఇక్కడ ఎంత తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నదో తెలుస్తున్నది. మొత్తం మీద అమెరికాలో ఈ వైరస్‌తో బాధపడుతున్న వారిసంఖ్య సుమారుగా 55వేలకు చేరుకున్నట్లు తెలస్తున్నది. అలాగే మృత్యువాతపడ్డ వారి సంఖ్య 775కు చేరుకుంది. ప్రధాన నగరాలైన న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిచిగాన్‌, ఇల్లినాయిస్‌, ‌ఫ్లోరిడాల్లో వైరస్‌ ‌ప్రభావం తీవ్రంగా ఉంది.

మన దేశంలో కూడా ఈ వైరస్‌ ‌ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు పదమూడు మంది మరణించినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. కాగా 649 పాజిటివ్‌ ‌కేసులున్నాయి. అగ్రరాజ్యాలే అదుపుచేయలేకపోతున్న ఈ వైరస్‌ను నాశనం చేయడానికి దానికి దూరంగా ఉండడమొక్కటే సరైన చికిత్సగా కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకే ఏప్రిల్‌ 12 ‌వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఉదయం పూట నిత్యావసరాల సరుకుల విషయంలో కొంత వెసులుబాటు కల్పించినా, రాత్రి ఏడుగంటల నుండి ఉదయం ఆరుగంటలవరకు కర్ఫ్యూ వాతావరణాన్ని కొనసాగించాలంటూ కఠిన ఆదేశాలు జారీచేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రధాని ఆదేశాలను స్వాగతిస్తూ, స్వీయ నియంత్రణను పాటిస్తున్నాయి. అయితే అక్కడక్కడ కొందరు అతిచేయడంతో పోలీసులు వారిని కట్టడి చేస్తున్నారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపట్ల దేశప్రజతోపాటు, ప్రతిపక్షాలన్నీ హర్షాన్ని ప్రకటించాయి.

స్వాతంత్య్ర సంగ్రామంలో దేశ ప్రజలంతా తమ ఐక్యతను ప్రకటించిన తర్వాత ఒకే లక్ష్యంగా యావత్‌దేశం ఒకటికావడం ఇదేనంటున్నారు. ముఖ్యంగా ప్రాణాంతకమైన ఈవ్యాధిని తగ్గించేందుకు నిరంతరం కృషిచేస్తున్న డాక్టర్లకు, ప్రజలను ఇంటికే పరిమితం చేస్తున్న రక్షణ సిబ్బందికి, వీధులన్నిటినీ శుభ్రపరుస్తున్న పారిశుధ్ధ్య కార్మికులందరికీ ఈ నెల 22న సాయంత్రం ఆరుగంటలకు దేశ ప్రజలంతా కరతాళధ్వనుల ద్వారా తమ సంఘీభావం తెలుపడం కూడా దేశప్రజలు ఇకముందు ఎలాంటి ప్రాణాంతక సమస్యవచ్చినా ఏకతాటిపై నిలబడతారని మరోసారి రుజువు చేసినట్లైంది. ఇదిలాఉంటే కేంద్రప్రభుత్వం తాజాగా గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌స్కీమ్‌ ‌పేరుతో 1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకోవడమే దీని ముఖ్యఉద్దేశ్యం. కాగా, శానిటేషన్‌ ‌వర్కర్లు, ఆశా, పారామెడికల్‌ ‌వైద్యులు, నర్సులకు ఒర్కొక్కరికి 50 లక్షల చొప్పున ప్రత్యే బీమా సదుపాయాలను కల్పిస్తున్నారు.

తెలంగాణలో ఇప్పటివరకు ఈవ్యాధి కారణంగా ప్రాణహాని జరుగలేదు కాని, ఇంతవరకు 44 కేసులు మాత్రం నమోదైనాయి. ఈనెల 22 నుండి వరుసగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ‌కారణంగా శ్రామికులు, కొన్ని ప్రాంతాల ప్రజల ఆకలితీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయిదు రూపాయల భోజనాలందించే అన్నపూర్ణ కేంద్రాల్లో ఉచిత భోజనం అందించే ఏర్పాటు చేసింది. అలాగే దినసరి కూలీలు ఇబ్బంది పడకుండా తెల్లకార్డు ఉన్నవారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యం, 15వందల నగదు కార్యక్రమానికికూడా శ్రీకారం చుట్టింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!