“నలభై సంవత్సరాల క్రితం వచ్చిన ఒక కాల్పనిక నవలలోని అంశాలు వాస్తవంగా కళ్ళముందు కనబడేసరికి ప్రపంచవ్యాప్తంగా మొదట సంబ్రమాశ్చార్యాలు కనిపించినా, తరువాత భయాందోళనలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు ఆ తర్వాత 2008లో సిల్వియా బ్రౌన్ రాసిన ‘‘ఎండ్ ఆఫ్ డేస్’’ నవలలో ఇటువంటి లక్షణాలే కలిగిన వ్యాధి ఒకటి 2020లో ప్రపంచంలోని చాల దేశాలలో వ్యాపించి ప్రపంచాన్ని వణికిస్తుందని వివరించింది. తీవ్రమైన న్యుమోనియా లక్షణాలు గల వ్యాధి ప్రపంచమంతటా వ్యాపించి ప్రజల ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద దాడి చేసి, వైద్య శాస్త్రానికి సవాలు విసురుతుంది.”
కరోనా వైరస్ ఇప్పటికే వేలాది మంది ప్రజల మరణానికి కారణమైన మహమ్మారి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించి దాదాపు ఇరవై రెండున్నర లక్షల మందికి ఈ వ్యాధి సోకినట్లు అంచనా. చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి బయటపడ్డ ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనావైరస్ దాటికి కుదేలైన అగ్రరాజ్యం అమెరికా మరణాల్లో ఇటలీ, స్పెయిన్ దేశాలను దాటేసింది. వందలాది ప్రజలు నివారణ లేక దిక్కులేని చావు చస్తున్నారు. వారి అంతిమ సంస్కారానికి శవపేటికలు సైతం లభించడం లేవు అంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాలు కోవిడ్-19 కేసులను నివేదిస్తున్నప్పుడు మానవాళి మనుగడ ప్రశ్నార్థకమని అనిపిస్తుంది. కరోనా వైరస్ తరహా రుగ్మతల గురించి ఎన్నో ఏళ్ళ ముందే చాలా పుస్తకాలు ప్రస్తావించాయి. ఇటువంటి లక్షణాలు గల వ్యాధి నేపథ్యంలో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ పుస్తకాలు, సినిమాలలో ఊటంకించిన వ్యాధులకు జన్మస్థలం అత్యంత ఆశ్చర్యకరంగా చైనా దేశమే. ఇది కాకతాళీయమా? లేక చైనాను ప్రపంచ స్థాయిలో అవమనించడానికి పనిగట్టుకుని రచించారా? ఇలా ఎన్నో ప్రశ్నలు మన మస్తిష్కాలను తొలుస్తూనే ఉంటాయి. వైరస్ వ్యాప్తి సంక్రమణపై విస్తృతమైన గందరగోళం భయాందోళనల మధ్య మనస్సులను మెలిపెట్టే అనేక కుట్ర సిద్ధాంతాలు సోషల్ మీడియా వేదికల మీద కరాళనృత్యం చేస్తున్నాయి. ఎన్నో సినిమాలు, పుస్తకాలు ఈ విపత్తులను ముందే ఊహించాయి.
ఈ ఊహలకు ఊతమిచ్చిన ఉన్మాధం ఎక్కడిది? అంత ఖచ్చితంగా ఆయా రచయితలు, దర్శకులు భవిష్యత్తును ఎలా అంచనా చేయగలిగారు? వారి ఊహలకు ఉన్న చోదకశక్తి ఎక్కడిది? భవిష్యత్తులో జరిగే సంఘటనలను ఊహించడంలో తిరుగులేని యానిమేటెడ్ కామెడి సీరిస్ ‘‘ది ఫ్యూచర్ టెల్లర్ సింప్సన్’’ లోని ‘‘బార్ట్ టు ది ఫ్యూచర్’’ అనే ఎపిసోడ్లో దాదాపు 16 సంవత్సరాల క్రితమే డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడవుతారని ఒక ఎపిసోడ్లో ప్రకటించింది. అదేవిధంగా 1993లో ప్రసారం అయినదని చెప్పబడుతున్న ఒక ఎపిసోడ్ నుంచి తీసిన చిత్రాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరస్ సంబంధిత వైరల్ ఫ్లూ ఒకటి జపాన్లో ఉద్భవించిందని, ఈ ఫ్లూను కార్మికులు ఒసాకా నుంచి స్ప్రింగ్ఫీల్డ్కు వ్యాప్తి చేస్తున్నారని ఊహించారు. 1981లో వచ్చిన ఫిక్షన్ క్రైమ్-థ్రిల్లర్ నవల ‘ది ఐస్ ఆఫ్ ది డార్క్ నెస్’’లో రచయిత డీన్ కూంట్జ్ వుహాన్ -400 అనే వైరస్ గురించి వ్రాసాడు. ఇది ప్రయోగశాలలో మొదట జీవాయుధంగా సృష్టించబడింది. ఆ వైరస్ మొత్తం నగరాలను, దేశాలను తుడిచిపెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. నలభై సంవత్సరాల క్రితం వచ్చిన ఒక కాల్పనిక నవలలోని అంశాలు వాస్తవంగా కళ్ళముందు కనబడేసరికి ప్రపంచ వ్యాప్తంగా మొదట సంబ్రమాశ్చార్యాలు కనిపించినా, తరువాత భయాందోళనలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు ఆ తర్వాత 2008లో సిల్వియా బ్రౌన్ రాసిన ‘‘ఎండ్ ఆఫ్ డేస్’’ నవలలో ఇటువంటి లక్షణాలే కలిగిన వ్యాధి ఒకటి 2020లో ప్రపంచంలోని చాల దేశాలలో వ్యాపించి ప్రపంచాన్ని వణికిస్తుందని వివరించింది. తీవ్రమైన న్యుమోనియా లక్షణాలు గల వ్యాధి ప్రపంచమంతటా వ్యాపించి ప్రజల ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద దాడి చేసి, వైద్య శాస్త్రానికి సవాలు విసురుతుంది. ఇందులో ‘‘ఈ వ్యాధి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అంతే అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. తిరిగి పది సంవత్సరాల తరువాత మళ్ళీ దాడి చేస్తుంది. ఆ తరువాత పూర్తిగా అదృశ్యమవుతుంది.’’2011లో విడుదలైన ‘‘కంటేజియన్’’ చిత్రంలో కూడ కరోనా వంటి వైరస్ ఒకటి ప్రపంచాన్ని భయకంపితులను చేస్తుంది. స్టీవెన్ సోబర్బర్గ్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర నేపథ్యం కూడా అత్యంత కాకతాళీయంగా చైనానే. హాంకాంగ్ నగరంలో జీవం పోసుకున్న ఎంఈవి-1 అనే వైరస్ ఒక్కసారిగా వ్యాప్తి చెంది ప్రపంచంలోని ఇరవై శాతం మంది ప్రజలకు సోకుతుంది. గ్లోబల్ హెల్త్ స్కేర్ను సెల్యులాయిడ్ మీద చూపిన ఈ చిత్రం ప్రస్తుతకాల వాస్తవికతకు దగ్గరగా ఉంది. ఈ చిత్రంలో చూపబడిన వైరస్ కారణం గబ్బిలాలు. అత్యంత కాకతాళీయంగా ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి కారణం కూడా గబ్బిలాలే అనే సందేశం ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2013లో విడుదలైన మరో చిత్రం ‘‘వరల్డ్ వార్ -జెడ్’’. మార్క్ ఫోస్టర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆధారం అదే పేరుతో 2006లో వచ్చిన నవల. ఈ నవల రచయిత మ్యాక్స్ బ్రూక్స్. ఈ నవలలో ‘‘గ్లోబల్ జాంబీ ప్లేగు’’ చైనాలో మొదలవుతుంది. అయితే సినిమాలో ఈ ప్లేగు కొరియాలో ప్రారంభమైందని చూపించబడింది. అదే విధంగా 2018లో వచ్చిన వెనొం చిత్రంలోని వైరస్ మలేషియాలో ప్రారంభమై ఈశాన్య దేశాల గుండా ఇతరదేశాలలో వ్యాప్తి చెందుతుంది.
ఇంతకీ ఈ వ్యాదుల నేపథ్యాలు చైనాతోనే ఎందుకు ముడిపడి ఉన్నాయి.? చైనాలోనే తప్పకుండా పుడతాయని ఆయా రచయితలు ముందస్తుగానే అంచనాలు వేసి పుస్తకాలు, సినిమాలు విడుదల చేశారా? క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనకు ద్యోతకమౌతాయి. చైనా అంటే మొదటి నుంచి పాశ్చాత్య దేశాలకు కంటగింపు. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలలో ఒక అనామకదేశమైన చైనా త్వరితంగా తన ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకుని అగ్రదేశాలకు సవాలు విసరడం సహజంగానే పాశ్చాత్య దేశాల అసూయకు కారణమైంది. దానితో వారి పుస్తకాలు, సినిమాలలో చైనాను నెగెటివ్ కోణంలోనే ప్రొజెక్ట్ చేసేవారు. కమ్యూనిస్టు దేశమైన చైనా క్యాపటలిస్ట్ దేశమైన అమెరికాకు సమానస్థాయిలో ఆర్థికవ్యవస్థను శాసిస్తోంది. ఇంతకు ముందు రష్యాను వారి సాహిత్యం, సినిమాలలో విలన్గా చూపేవారు. అమెరికా ప్రయోజనాలకు ఇబ్బంది ప్రతి దేశానికి వ్యతిరేకంగా అనేక చిత్రాలు హాలివుడ్ లో నిర్మించబ్డ్డాయి. సిల్విస్టర్ స్టాలోన్ హీరోగా వచ్చిన రాంబో, రాకీ సీరిస్ చిత్రాలు సోవియట్ యూనియన్, క్యూబా దేశాలకు వ్యతిరేక ఇతివృత్తులతో విడుదలయ్యాయి. ప్రక్యాత జేంస్ బాండ్ చిత్రాలు, మిషన్ ఇంపాజిబుల్ సీరిస్ చిత్రాలన్ని అమెరికా గూడాచార్య కథాంశాలుగా ప్రపంచం ముందు రష్యాను దోషిగా నిలబెట్టడానికి చేసిన ప్రయత్నాలే. గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో ఇరాక్కు వ్యతిరేకంగా స్నైపర్ తరహా సినిమాలు నిర్మించబడ్డాయి. సోవియట్ యూనియన్ పతనం తరువాత ఈ ఒరవడి మారింది. ఇప్పుడు చైనాను లక్షంగా చేసుకున్నట్లు కనిపిస్తుంది. బ్రాడ్ పిట్ హీరోగా వచ్చిన ‘సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్’లో చైనా ప్రభుత్వం టిబెట్లో మానవహక్కులను ఉల్లంఘిస్తున్న విధానాన్ని చూపించే ప్రయత్నం జరిగింది. అంతేకాకుండా 2016లో వచ్చిన ‘డాక్టర్ స్ట్రేంజ్’, 2019లో విడుదలైన ‘అబామినెబుల్’ చిత్రాలు పూర్తి స్థాయి చైనా వ్యతిరేక ఇతివృత్తాలను కలిగినవే. చైనాపై ఇంత అక్కసుకు దారి తీసిన పరిస్థితులేంటి? అయితే చైనా సాధించిన సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థికాభివృద్ధి ఒకరకంగా ప్రపంచ దేశాలకు సవాలు విసురుతున్నాయి.
మనదేశంతో చైనాకు సరిహద్దు సంఘర్షణలు ఉన్నాయి. తనతో సమానంగా ఎదుగుతున్న భారతదేశంతో చైనాకు ఆర్థికపరమైన పోటీ ఉంది. దానికి వాస్తవరూపమే పాక్-చైనా ఎకనామిక్ కారిడార్. ఒకవేళ చైనా ఉద్దేశపూర్వకంగా వ్యాధులను వ్యాప్తిచేస్తే వాటి బారినపడే మొదటి బాధితదేశం భారతదేశమే. ఇవి కాకుంటే… సదరు పుస్తకాలు, సినిమాలు ఇచ్చిన స్పూర్తితో చైనానే స్వయంగా కరోనా వంటి జీవాయుధ వైరస్ను సృష్టించి, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించాలని అనుకుని ఉండవచ్చు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థికవ్యవస్థలో చైనా తన ప్రత్యేక ప్రభావాన్ని కలిగి ఉంది. ఒకవేళ తన ప్రభావానికి విఘాతం కలగకుండా ఉండాలంటే సదరు పుస్తకాలు, సినిమాలలో చూపిన విధంగా ప్రపంచ వ్యాప్తంగా జీవాయుధాలను వ్యాప్తి చేసి, వాటి నివారణకు తిరిగి తనే మందు కనిపెట్టబోతోందా? చైనా చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటి నుంచి చైనా ఇతరదేశాలతో అసంపర్క విధానాన్ని పాటించి, తలుపులు మూసి ఉంచే(క్లోజ్డ్ డూర్ పాలిసీ) విధానాన్ని అవలంభించింది. తమ రాజు స్వర్గలోకపు పాలకుడనీ, తాము స్వర్గలోకస్తులమనే నమ్మకం వారిలో ఉండేది. ప్రాచీన కాలంలో పట్టును ఎగుమతి చేస్తూ పెద్దమొత్తంలో లాభాలు గడించిన ఈ దేశం పాశ్చాత్య దేశాల నుంచి ఏ రకమైన వస్తువులను దిగుమతి చేసుకోకపోవడం విశేషం. అయితే 1854-60 మధ్య జరిగిన నల్లమందు(ఓపియమ్ వార్స్) యుద్ధాల అనంతరం ఈ నమ్మకాలు పటాపంచలయ్యాయి. వారి ఏకాంత విధానానికి విఘాతం కలిగించిన ఈ యుద్ధాలు ఆ దేశ బలహీనతలను బట్టబయలు చేశాయి. కమ్యునిస్ట్ చైనా ఆవిర్భావం తర్వాత మావో, డెంగ్ జియోపింగ్ల కాలంలో చైనా అభివృద్ధికి బాటలు వేయబడ్డాయి. మావో నిర్మించిన శుద్ధ కమ్యూనిజాన్ని అవలంభిస్తూనే డెంగ్ చైనాలో సాంస్కృతిక విప్లవాన్ని అమలుపరిచి పెట్టుబడిదారీ విధానానికి ద్వారాలు తెరిచాడు. ప్రస్తుత అధ్యక్షుడు జిన్ పింగ్ సైతం చైనాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 16 దేశాలు జీవాయుధ(బయోవార్) యుద్ధాన్ని చేసే సామార్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆ జాబితాలో భారతదేశం లేదు. ఇటివలే తైవాన్ కూడా ఆ జాబితాలో చేరడం గమనార్హం. ఆ జాబితాలో చైనా ఉండడం భారతదేశానికి ప్రమాదకరం. ప్రపంచ రాజకీయ, ఆర్థికవ్యవస్థలో చైనా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సమ యంలో జీవాయుధలతో దాడి చేసే అవసరం ఆ దేశానికి ఉండకపోవచ్చు. ఒకవేళ చేసినా, దాని పరిణా మాలు అన్ని దేశాలకంటే చైనాకే ఎక్కువ తెలుసు.
