Take a fresh look at your lifestyle.

కొరోనాపై చైనా ఎదురుదాడి

ఎదురుదాడి ఎలా చేయాలో చైనాను చూసి నేర్చుకోవాలి. కొరోనా వైరస్‌ ‌చైనాలోని వూహన్‌ ‌నగరంలో పుట్టిందని అమెరికా అధ్యక్షునిగా పదవీ విరమణ చేయనున్న డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌తరచూ అనేవారు. అగ్రరాజ్యాధినేతగా, తనకు అందిన అధికార సమాచారాన్ని బట్టి ఆయన ఆ ప్రకటన చేసి ఉంటారని అంతా భావించారు. అప్పట్లో ఆయనకు ఎదురు మాట్లాడని చైనా ఇప్పుడు భారత్‌పై ఎదురు దాడి చేస్తోంది. అయితే, కొరోనా పుట్టిల్లు వూహన్‌ అనే అభిప్రాయంతో అంగీకరిస్తూనే వూహన్‌ ‌మార్కెట్‌ ‌నుంచి అది వ్యాపించి ఉండవొచ్చనీ, విదేశాల నుంచి దిగుమతి అయిన చేపల కంటైనర్ల నుంచి అది వ్యాపించి ఉండవొచ్చని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ అన్నారు. వూహన్‌ ‌నుంచి కొరోనా వ్యాపించిందన్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో ఆ సంస్థ దృష్టి మరల్చడం కోసం చైనా ఈ ఎత్తుగడ వేసినట్టు కనిపిస్తోంది. అంతేకాక, అమెరికా కొత్త అధ్యక్షునిగా రెండు నెలల్లో ప్రమాణం చేయనున్న జో బైడెన్‌ ‌దృష్టి మరల్చడం కూడా చైనా ఉద్దేశ్యమై ఉండవొచ్చు. ప్రస్తుతం బైడెన్‌ ‌భారత్‌, ‌చైనాలతో సమానమైన వైఖరితో ఉన్నారు. ఆయన చైనా పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించవొచ్చని డ్రాగన్‌ ఆశిస్తోంది.

తటస్థంగా ఉండటం వేరు, అనుకూల వైఖరిని అనుసరించడం వేరు. బైడెన్‌ ‌తటస్థంగానే ఉంటారన్నది అంతర్జాతీయ విశ్లేషకుల భావన. ఆయన ట్రంప్‌ ‌మాదిరిగా దూకుడు ప్రదర్శించరన్న మాట వాస్తవమే కానీ, చైనాకి దగ్గరగా జరిగే అవకాశం లేదు. ఒక్క కొరోనా విషయంలోనే కాకుండా, అమెరికన్‌ ‌లాబ్స్‌లో చైనా పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)‌కి సన్నిహితులైన వారు చేరి పరిశోధనలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పిఎల్‌ఏకి చేరవేశారన్న ఆరోపణలు కూడా ట్రంప్‌ ‌హయాంలో రుజువయ్యాయి. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. అమెరికాలో అధికారంలోకి ఎవరొచ్చినా, దేశ భద్రత అంశంపై రాజీపడరు. ఈ విషయం చైనాకి తెలియదని అనుకోలేం. అందువల్ల భారత్‌తో సన్నిహితంగా ఉండకుండా చూడటం కోసం చైనా ఈ ఎత్తుగడ వేసినట్టు విశ్లేషకుల భావన. మన దేశంలో కొరోనా వ్యాక్సినేషన్ల ఉత్పత్తికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం సత్ఫలితాలను ఇస్తోంది. అహ్మదాబాద్‌, ‌హైదరాబాద్‌ ‌పూణే నగరాల్లో కోవ్యాక్సిన్‌ ‌తయారీని శనివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా పరిశీలించారు. ఆయన హైదరాబాద్‌ ఎన్నికల్లో పరోక్షంగా ప్రచారం చేయడానికి వొచ్చారని సీపీఐ నాయకుడు నారాయణ ఆరోపించినా, కోవ్యాక్సిన్‌ ‌ట్రయిల్స్‌ను స్వయంగా పరిశీలించడానికే మోడీ వొచ్చి ఉండవచ్చును. సరిగ్గా మోడీ ఈ పర్యటన జరిపిన నాడే, కొరోనా భారత్‌ ‌నుంచి వ్యాపించిందన్న ఆరోపణ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చేయడం కాకతాళీయం కాదనలేం. ఎందుకంటే వైరస్‌ ‌నియంత్రణ విషయంలో భారత చిత్తశుద్ధిని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. భారత్‌ ‌నుంచి వ్యాక్సిన్‌ ‌కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రెడిట్‌ ‌భారత్‌కి ఎక్కడ వొస్తుందోనన్న దుగ్ధతోనే చైనా ఈ కొత్త ఆరోపణ చేసి ఉండవచ్చు.

కొరోనా వైరస్‌ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం సంక్లిష్టమైన పక్రియ అని చైనా ప్రతినిధి లిజియన్‌ ‌వ్యాఖ్యానించారు. వూహన్‌ ‌నుంచి వ్యాపించిన మాత్రాన అది వూహన్‌ ‌లోనే పుట్టిందని ఎలా చెప్పగలరంటూ ఆయన వితండ వాదం చేస్తున్నారు. ఇది వాదనకు బాగా కనిపించినా, తార్కికంగా నిలబడదు. చైనా ఈ మచ్చ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అందువల్ల పొరుగున ఉన్న భారత్‌పై బురద జల్లి పబ్బం గడుపుకోవాలని చైనా ఎత్తుగడ అయి ఉంటుంది. అంతేకాక, చైనా నుంచి దిగుమతులను నియంత్రిస్తున్నట్టే, చైనాకు ఎగుమతులను నియంత్రిస్తున్నారు. అసలు మన దేశం నుంచి చైనాకి ఎగుమతులు కొరోనా రాకపూర్వమే పూర్తిగా తగ్గిపోయాయి. అందువల్ల చేపల కంటైనర్ల ద్వారా కొరోనా వ్యాపించిందన్న చైనా వాదన నిలబడదు. అంతర్జాతీయంగా చైనాని ఇప్పుడు ఎవరూ విశ్వసించడం లేదు. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి వెనుకాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రారంభించిన యత్నాల్లో భాగంగానే ఈ ఎదురుదాడి ప్రారంభించి ఉండవొచ్చు. మరో వంక కొరోనా వైరస్‌ ‌పుట్టినిల్లుగా చైనాపై ముద్ర పడటంతో చాలా కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను చైనా నుంచి తరలిస్తున్నాయి. అలా తరలివొస్తున్న కంపెనీలు భారత్‌ని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నాయి. కొరోనా కాలంలో భారత్‌లో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ, విదేశీ పెట్టుబడులు పెరుగుతుండటం అనుకూలమైన అంశం. తమకు రావల్సిన పెట్టుబడులు సింగపూర్‌ ‌తదితర దేశాల పెట్టుబడులు భారత్‌కి తరలిపోతున్నాయన్న దుగ్ధతో చైనా ఈ ఆరోపణ చేసి ఉండవచ్చు.

కాగా, మోడీ శనివారం జరిపిన కోవ్యాక్సిన్‌ ‌తయారీ కేంద్రాల యాత్ర శాస్త్రవేత్తల్లో చిత్తస్తయిర్యాన్ని పెంచింది. దేశాధినేత స్వయంగా వొచ్చి తమ కృషిని పరిశీలించి మెచ్చుకోవడంతో వారిలో ఆత్మనిర్భరం పెరిగింది. ఇది మంచి పరిణామం. వారు మరింత శ్రద్ధతో, అంకిత భావంతో వ్యాక్సిన్‌ ‌తయారీపై దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. మోడీ జరిపిన కొరోనా వ్యాక్సిన్‌ ‌నగరాల యాత్రను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు. వ్యాక్సిన్‌ ‌పుట్టినిల్లు భారత్‌ అనే పేరు తెచ్చుకోవాలన్న ఆకాంక్ష ఆయనలో ఉన్న మాట నిజం కావొచ్చు. అదేమీ తప్పుకాదు. ఆ ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం.

Leave a Reply