పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం
కష్టం, సౌఖ్యం,శ్లేషార్ధాలూ
ఏమీ ఎరుగని పువ్వుల్లారా
అయిదారేడుల పాపల్లారా!
మీదే మీదే సమస్త విశ్వం
మీరే లోకపు భాగ్యవిధాత లు! అని మహాకవి శీశ్రీ గారు అన్నట్లు పాపం ,పుణ్యం, కష్టం, సుఖం అంటే ఏమీ ఎరుగని అమాయకపు పిల్లలు రేపటి ప్రపంచపు భాగ్యవిధాత లు…. బాలలే రేపటి మానవాళి భవిష్యత్తు…. బాలలే జాతి సంపద, వారే రేపటి భావి భారత పౌరులు… అటువంటి బాలల పట్ల సమాజము ప్రభుత్వాలు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చి వారిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కల్లా కపటం ఎరుగని చిరునవ్వుల చిన్నారులు అంటే మన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కి ఎంతో ఇష్టం. అందుకని ఆయన పుట్టిన రోజు నవంబర్ 14న మన దేశంలో బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రపంచంలోని చాలా దేశాలలో ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు నవంబరు 20న బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మన దేశ భవిష్యత్తు మన పిల్లల చేతుల్లోనే ఉందని అప్పటి మన ప్రధానమంత్రి నెహ్రూ సగర్వంగా చెప్పే వారు. ‘‘నేటి బాలలే భారతదేశ ఆకృతిని అందంగా తయారు చేస్తారు .ఈరోజు మనం తీసుక వచ్చే విధంగా భారతదేశం యొక్క భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది’’ అని నెహ్రూ తరచుగా చెప్పేవారు. ఆ అభిప్రాయంతోనే పిల్లలకు విద్య విషయంలో నెహ్రూ ఏ మాత్రం వెనక్కితగ్గే వారు కాదు. ప్రధాని గా విశేష సేవలు అందించిన నెహ్రూ పిల్లలను అమితంగా ప్రేమించి ‘‘చాచా ‘‘గా పిలుచుకునే విధంగా ఆ పసి హృదయాలను కొల్లగొట్టిన వ్యక్తి. 1964లో నెహ్రూ గారు మరణించిన తర్వాత అతడు జన్మించిన రోజును ,తను ప్రేమించిన వ్యక్తుల కోసం కేటాయించాలని నవంబర్ 14 ను పిల్లలకు అంకితం చేయబడింది .అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము.
స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, 57 సంవత్సరాల నుండి బాలల దినోత్సవం జరుపుకుంటున్న భావితరాల భవితవ్యం గురించి శ్రద్ధ వహించి బాలల అభివృద్ధికి కొంత మేరకు కృషి చేసిన ఇంకనూ వారి సంక్షేమం ,సంరక్షణ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగానే ఉంది….. మానవ జీవన పరిణామ క్రమంలో బాల్యం అతి మధురమైనది, అమూల్యమైనది ,మరియు అపురూపమైనది… చీకు చింతా లేని బాల్యం భవిష్యత్తుకు నాంది. బాలల సంరక్షణ అత్యంత ఆవశ్యకము అయినది. నేటి ప్రభుత్వాలు తల్లిదండ్రులు వీరి రక్షణ కొరకు తీసుకుంటున్న కార్యక్రమాల గురించి చర్చించుకునే ముందు నేటి బాల భారతాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.బాలల పరిరక్షణ అత్యంత ప్రమాదకరంగా ఉంది…. ఆర్థిక సంస్కరణలు అమలు లోకి వచ్చిన తరువాత వారి సంరక్షణ మరింతగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది. సంస్కరణలకు ముందు గ్రామాలన్నీ స్వయం సమృద్ధిగా విలసిల్లుతూ ప్రజలు హాయిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మానవీయ విలువలు ,సంబంధాలు కలిగి ఉండటం మూలంగా, ఉమ్మడి కుటుంబాలలో జీవనం కొనసాగిస్తూ ఉండడం వల్ల పిల్లలు స్వేచ్ఛగా, స్వచ్ఛమైన ఆలోచనలతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎటువంటి మానసిక ఒత్తిడి, ఉరుకులు పరుగులు లేకుండా నిబ్బరంగా భద్రత కలిగిన భరోసాతో, ఆటపాటలతో ఆనందంగా ఉండే వారు …..నైతిక విలువలను ,కుటుంబ విలువలను ,వారితో కలిసి జీవించే పెద్దల నుండి నేర్చుకొని ,ఆచరిస్తూ …. ఎలాంటి కల్మషం, కాలుష్య వాతావరణం లేకుండా నెహ్రూ గారు అన్నట్లు బాలల అభివృద్దే జాతి అభివృద్ధి గా భావిస్తూ…. మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉండేది ….. బాలలు అందరికీ సమాన అవకాశాలు లభించేవి…..1990-91 తరువాత ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చిన తరువాత శరవేగంగా మానవ జీవన విధానంలో మార్పులు వచ్చాయి…. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు గా తయారయ్యాయి.
త్వరత్వరగా నిచ్చెన మెట్లు ఎక్కిన చందంగా సంపద ను సృష్టించడంలో అనేక అనారోగ్యకరమైన పనులకు పాల్పడుతూ వ్యామోహంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న తరుణంలో బాలల సంరక్షణ దయనీయంగా తయారయింది. లింగ వివక్షత సైతం పెరిగింది. ఆడవారి పుడితే మైనస్ అని , మగవారు పుడితే ప్లస్ అని,లెక్కలు వేసుకుంటూ లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడుతూ…. భ్రూణహత్యలకు పాల్పడుతూ మొగ్గలోనే బాలల భావితవ్యాన్ని త్రుంచి వేయడం అమానుషం….. ఒకవేళ వారిని బ్రతుకనిచ్చి బట్ట కట్టనిస్తే , బాలల పెంపకం సైతం వ్యాపార మయం గా తయారయింది. నేడున్న సమాజంలో పిల్లల తల్లిదండ్రులు, తమ పిల్లలు బాగా చదివి ప్రతి వారు, ప్రతి తరగతి లో ఫస్ట్ ర్యాంక్ సాధించి, గొప్ప డాక్టర్‌గా ,గొప్ప ఇంజనీరుగా లేక ఇతర దేశాలకు వెళ్లి డాలర్లు సంపాదించాలని ,ఆరాటపడుతూ అనవసర వ్యయ ప్రయాసలకు లోనవుతూ….స్వచ్ఛమైన మల్లె పువ్వు వంటి తెల్లని హృదయం కలిగిన కల్లకపటమెరుగని భాగ్య దాతలను,’’ చదువూ’’ చదవమని ఒత్తిడి పెంచుతూ… చిన్నారులను కాన్వెంట్, కార్పొరేట్ స్కూళ్లలో కుక్కి , అయిష్టంగా ఉన్నాను అందరికంటే ముందు అందలం ఎక్కాలని తరుముతున్న నేపథ్యంలో….. ఆ పసి హృదయాలు తట్టుకోలేక తనువు చాలిస్తున్న సందర్భాలు కోకొల్లలు…. పిల్లలు కన్న తల్లిదండ్రుల ఆరాటం, ఆర్భాటం, సాంఘిక హోదా పరువు ప్రతిష్ఠలకు ముడిపెడుతూ చిన్నారులు మోయలేని భారాన్ని, ఇష్టం లేని చదువులను పిల్లల మీద రుద్దుతూ…. పరిగెత్తిస్తున్న సందర్భంలో విద్యా వ్యాపార మై మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతూ ఉండటం అత్యంత విచారకరం…… ఏడు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలు బాలల సంక్షేమం, వారి అభివృద్ధికి, మెరుగైన జీవితానికి కావాల్సిన మౌలిక అవసరాలను అందించడంలో విఫలం అవ్వడం ఫలితంగా అభం, శుభం తెలియని అమాయకపు బాలలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ, తమ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో బ్రతుకు ఈడ్చుతున్నారు…. పేదరికం, నిరక్షరాస్యత ,నిరుద్యోగం, లింగవివక్ష ఆచార వ్యవహారాలు ,సామాజిక కట్టుబాట్లు తదితర విషయాలు భావిభారత పౌరులను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టి వేస్తున్నాయి ……భారత దేశం వెలిగిపోతోందని, ప్రపంచ దేశాలలో అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నదని, అధిక వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తున్నదని ప్రగల్భాలు పలుకుతున్న తరుణంలో పౌష్టికాహార లోపాలు ఉన్న పిల్లలు అధికంగా ఉండటం దేశ భవిష్యత్తుకు అనారోగ్యకరం. దేశంలో ఆరు ఏళ్లలోపు పిల్లలు 22 కోట్ల మంది ఉన్నారని, వారిలో 44. 3 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారని , 51 శాతం మహిళలు రక్తహీనతతో, 19 కోట్ల పై చిలుకు పౌష్టికాహార లేమితో, 59 శాతం పిల్లల్లో వయస్సుకు తగ్గ ఎదుగుదల లేదు. దేశంలోని 24 శాతం పిల్లలు రోజంతా ఆహారం లేకుండా ఉంటున్నారని సేవ్ ది చిల్డ్రన్ ఇంటర్నేషనల్’’ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో వెల్లడి కావడం హృదయవిదారకం … అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఉన్నామని ఢంకా బజాయించే పాలక వర్గాలకు పిల్లలు పస్తులు ఉంటున్న పరిస్థితులు తెలియకపోవడం ఆందోళనకరం….. పిల్లలు తినడానికి తిండిని కూడా సమకూర్చ లేకపోవడం దేశానికే సిగ్గుచేటు గా భావించాలి…..
ఇక బాలికల పట్ల, వారిని పరిరక్షించే విషయంలో చిత్తశుద్ధి లేకపోవడం అక్రమ రవాణా కు భారత్ కేంద్రంగా మారింది. ఆడపిల్లలను బాల్యంలోనే వ్యభిచార గృహాలకు అమ్మి వేయడం, నిత్యం అప్పుడే పుట్టిన బిడ్డ నుండి పండు ముదుసలి వరకు లైంగిక వేధింపులకు గురవడం, ప్రేమ పేరుతో బాలికలను మోసం చేయడం . అత్యాచారాలను జరుపడం నిత్యకృత్యాలు గా మిగిలిపోతున్నాయి. నిందితులను శిక్షించడంలో తాత్సారం మూలంగా వీటికి అదుపు అడ్డు లేకుండా పోతున్నాయి. సమాజంలో అనేక మంది బాలలు చదువుకు దూరంగా ఉంటూ, పారిశ్రామిక వాడలలో, పొలాల్లో, హోటళ్లలో,రెస్టారెంట్లలో, కిరాణా షాపుల్లో, మోటర్ మెకానిజం లో, బీడీ పరిశ్రమ ,మత్స్య పరిశ్రమ, గనులలో ,భవన నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క రంగంలో చివరకు మద్యం దుకాణాల్లో సైతం పనిచేస్తున్నారు. బాలకార్మికులు లేని రంగం దాదాపు ఏదీ లేదు. బాల కార్మిక చట్టం 2016 ప్రకారం సెలవుల్లో, తీరిక వేళల్లో పనులు చేయవచ్చు అనడంతో బాలకార్మికత కు చట్టబద్ధత కల్పించినట్లు అయింది. బాలకార్మిక వ్యవస్థ ఓరకంగా తీవ్రమైన మానవహక్కుల సమస్య. బాలల శారీరక ,మానసిక అభివృద్ధికి ఆటంకం అయిన వారికి కనీస అక్షరాస్యతను ,వినోదాన్ని పొందకుండా చేసే వ్యవస్థ… అక్షర గంధానికి నోచుకోకుండా భారమైన శ్రమకు బలైపోతున్న బాలల జీవితాలు…. యునిసెఫ్ లెక్కల ప్రకారం దాదాపు 50 శాతం మంది ,ప్రణాళికా సంఘం అంచనా ప్రకారం 43 శాతం మంది బాలబాలికలు 8వ తరగతి లోపు బడి మానేస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రాథమిక విద్యను హక్కుగా గుర్తించినప్పటికీ ,2009లో విద్యాహక్కుచట్టం తెచ్చినప్పటికీ ,అందరికీ విద్య అందని ద్రాక్షగానే మిగిలినది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 152 మిలియన్ బాలలు కార్మికులుగా పని చేస్తున్నారు.
పేదరికం, దారిద్య్రం ఉన్నంతకాలం బాలకార్మిక వ్యవస్థ ఉంటుంది. నేటి సమాజంలో బాలబాలికలు లింగవివక్ష ,కార్పొరేట్ చదువుల ఒత్తిడి ,పౌష్టికాహార లోపం, ఆహారం దొరకక పస్తులు ఉండటం, బాలికల అక్రమ రవాణా, వ్యభిచార గృహాలకు అమ్మి వేయడం,లైంగిక వేధింపులు ,అత్యాచారాలు బాలకార్మికులుగా, వీధి బాలలుగా ,అనాధలుగా , కిడ్నాప్ లకు గురవుతూ పాలకుల నిర్లక్ష్యం వల్ల, పెద్దల బాధ్యతారాహిత్యం వల్ల బాల బాలికలు అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు, ప్రమాదాలకు లోనవుతూ.., డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులకు గురై వైద్యం అందక మరణిస్తున్న బాలల బాల్యం బుగ్గిపాలు అవుతున్నది…. దీనిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా బాలల భావి తవ్యం గురించి తీసుకున్న చర్యలను, బాలల కు గల హక్కులను ఒకసారి అధ్యయనం చేద్దాం….
బాలల హక్కుల గురించి తొలిసారిగా నానాజాతి సమితి సంస్థ 1924 సెప్టెంబర్ 16న ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బాలల సంక్షేమం ,అభివృద్ధికి భద్రతకు ఐక్యరాజ్యసమితి 1959 నవంబరు 20న బాలల హక్కుల ప్రకటన చేసింది . ఈ ప్రకటన ప్రకారం పొందుపరిచిన హక్కులను అనుభవించే క్రమంలో జాతి, మత ,వర్ణ ,రాజకీయ ,ప్రాంత మరియు లింగ వివక్ష తలు చూపరాదు… బాలల హక్కుల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి 1979వ సంవత్సరాన్ని ప్రకటించింది. అదే విధంగా 1989 నవంబర్ 20న బాలల హక్కుల ఒడంబడికను ఆమోదించింది. ఇది 1990 సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చింది.
ఈ ఒడంబడిక లో 54 నిబంధనలు, మూడు భాగాలు ఉన్నాయి. బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం
1. జీవించే హక్కు
2. రక్షణ హక్కు
3. అభివృద్ధి చెందే హక్కు
4. భాగస్వామ్య హక్కు
5. విద్యా హక్కులు కల్పించడం జరిగింది.
ఈ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ పై ఇప్పటివరకు 192 దేశాలు సంతకం చేశాయి. కానీ అమెరికా, సోమాలియా దేశాలు సంతకం చేయలేదు. మన దేశం 1992లో సంతకం చేసింది. ఈ ఒడంబడిక ప్రకారం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం 2007లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం బాల నువ్వంటే 0 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారిగా నిర్వచించట0 జరిగింది. దేశంలోని బాలల హక్కుల పరిరక్షణయే ద్యేయంగా పనిచేసే సంస్థ. దేశంలో ఎక్కడైనా బాలల హక్కులకు భంగం వాటిల్లే నట్లయితే అట్టి వారికి న్యాయం జరిగేలా ఈ సంఘం సహాయపడుతుంది. ఈ బాలల హక్కుల గురించి భారత రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరచబడినది. రాజ్యాంగంలోని బాలల హక్కులకు సంబంధించిన వివిధ ప్రకారణాలను భారత రాజ్యాంగంలోని 3వ భాగాలలో పేర్కొన్నారు అవి:
1. ప్రాథమిక హక్కులు
2. ఆదేశిక సూత్రాలు
3. ప్రాథమిక వీధులు.
ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుండి 14 సంవత్సరాల లో పిల్లలకు అందజేయాలని 86 వ రాజ్యాంగ సవరణ 2002 లో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 ల ప్రకారం బాలలను ప్రమాదమైన పనులలో, బాల శ్రామికులుగా, మోటార్ రవాణా రంగంలో, ప్లాంటేషన్ పనులలో కి తీసుకోకూడదు అని కొన్ని ప్రత్యేకమైన చట్టాలను చేశారు. బాలలను బాలకార్మికులుగా నియమించుకోవడం నిషేధిస్తూ 1986లో బాల కార్మికుల చట్టం ను తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మరియు భారత దేశంలో కూడా పలు రకాల చట్టాలు తీసుక వచ్చినను బాలల బంగారు భవిష్యత్తును సుందరంగా తయారు చేయడంలో విఫలమైన దని భావించాలి. బాలల హక్కుల పరిరక్షణలో భారత్ వెనుకంజలో ఉందని, తాజా నివేదికలో 181 దేశాల్లో 117 వ స్థానంలో ఉంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, శ్రీ లంకల కంటే వెనుకబడి ఉండటం శోచనీయం……
బాలల అభివృద్ధికి పరిష్కార మార్గాలు:
బాలలు ఆనందంగా ఆటపాటలతో స్వేచ్ఛ గా జీవితాన్ని కొనసాగనివ్వాలి. మధురమైన బాల్యం నుఅనుభవించనీయకుండా చదువు చదువు అంటూ ఒత్తిడి తీసుకోవచ్చే కాన్వెంటు ,కార్పొరేట్ చదువులకు స్వస్తి పలకాలి. జాతిని సవాల్ చేస్తూ పేదరికం కారణంగా బాలల బంగారు భవితను బుగ్గిపాలు చేసే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. అందుకు పాలకవర్గాలు చిత్తశుద్ధితో పని చేయాలి. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందడానికి, వారి భద్రతను కాపాడటానికి బాలల హక్కులు చట్టాల పట్ల చైతన్యం కలిగించాలి. వీధి బాలల కోసం,అనాథల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను , వారికి గల హక్కుల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి సాధించినప్పటికీ, ఇంకను 24 శాతం మంది పిల్లలకు ఆహారం లేకుండా పస్తులు ఉండటం, పోషక ఆహారలేమి తో బాధపడుతుండటాన్ని నివారించాలి .సమగ్ర శిశు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించి నాణ్యమైన పోషక విలువలున్న ఆహారాన్ని అందించుటకు ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి. బేటీ పడావో బేటీ బచావో అనే నినాదం సార్ధకత చేకూర్చే విధంగా బాలికల చదువుకు బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. దేశంలో జరిగే అత్యాచారాలు ,లైంగిక వేధింపులు, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. సురక్షిత వాతావరణంలో పిల్లలు ఉండేలా చూడటం, వీలున్నంత ఎక్కువగా పిల్లలతో సంభాషిస్తూ వారి మనసు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి సురక్షిత బాల్యమే కాక ఇంకా ఎన్నో రకాల హక్కులు ఉన్నాయని పెద్దలందరికీ తెలియజేసి వాటిని సంరక్షించేలా చూడాలి. బాలల హక్కుల పరిరక్షణ సామాజిక బాధ్యతగా చూడాలి. రక్షించడానికి టోల్ ఫ్రీ నెంబర్ 10 98 ఏర్పాటు చేయడం జరిగింది దానికి అందిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పారదర్శకంగా పరిష్కరించాలి.ఫోక్సో చట్టం, నిర్భయ చట్టం ,దిశ చట్టం, ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం, బాల కార్మిక నిర్మూలన చట్టాలను విజయవంతంగా అమలు చేయాలి.
‘‘ నే•టి బాలలే రేపటి సమాజ నిర్మాతలు’’ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బాల సంపద జాతి సంపదగా గుర్తించి ,బాలవికాస మే జాతి వికాసం గా భావించి బాలల సంరక్షణ కోసం పాలక ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజం బాధ్యతగా స్వీకరించాలి, పిడికెడు మంది ప్రపంచ కుబేరులు గా ప్రసిద్ధికి ఎక్కుతుంటే , చాలామందికి జీవితం గడవడమే కష్టంగా మారింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించే వ్యవస్థను నెలకొల్పాలి . కార్పొరేట్ విద్య ను, పోటీ పరీక్షలను రద్దు చేయాలి. విద్యా వైద్యములు సంపూర్ణంగా పేరెంట్స్‌కు భారంగా కాకుండా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. పిల్లలలో మానవీయ విలువలు పెంపొందించాలి. ఐర్లాండ్, స్వీడన్, నార్వే దేశాలలో బాలల అభివృద్ధికి చేస్తున్న చర్యలను పరిగణనలోకి తీసుకొని దేశంలో బాలల సంక్షేమానికి, పాలకులు చిత్తశుద్ధితో పని చేస్తే బాలల భవిష్యత్తు బంగారు మయం అవుతుంది.

జిల్లా ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్.
మహబఃబాద్ జిల్లా. 9989584665,