Take a fresh look at your lifestyle.

బతుకు పాఠాలు నేర్పిన బాల్యం

అర్థ శతాబ్దం
గడిచిన వయస్సులో
పలక బలపం బట్టిన
పసితనాన్ని
ఒక్కసారి నెమరేసుకుంటే
గుడిసెల్లో గుడ్డి దీపం వెలుతురులో
అక్షరాలను పరిచయం చేసిన
వెలుగు కిరణాలు
గుండెల్లో గుట్టుగా సెగ రగిలిస్తూనే ఉన్నాయి

ఓనమాలు దిద్ధి ఒకటో తరగతిలో చదివిన
అకారాది క్రమాన అమ్మతో మొదలైన
మాతృభాష మమకారం
మమతల పూలు పూయిస్తూనే ఉంది

బాల్యం సదువంత బాధలు తెలువని
ఆటల్లో తేలియాడింది

గోటిబిల్ల గోలీలాటలు
కోతి కోమ్మచ్చి, కబడ్డీలు
దాగుడు మూతలు జాజిరాటలు
ఆట ఏదైతేనేమి
గెలుపులోని మజాను అనభవించిన క్షణాన్ని
ఏ కరెన్సీ లెక్కల్లో తూచగలము

ఓటమిలను కూడా దీటుగా
ఎదుర్కొని
ఒక్క గెలుపుతోను బలంగా
నిలబడగలవనే
భరోసా యిచ్చిన బాల్యం

కులాల కుంపట్ల సెగ లోలోపల
కుతకుత  లాడిన
బళ్ళో మాత్రం భాయి భాయి లా ఉంటే
సకల కులాల కామన్‌ ‌స్కూల్‌
‌సర్కార్‌ ‌బడొక్కటే

ఉన్నోడి లేనోడి
సదువులకు ఊపిరైన ఊరి బడి

ఆదివారం ఆటవిడుపుగా
మోట బావుల వద్ద మొక్క జొన్న కావలి
మంచె మీదికెక్కి గురి చూసి విసిరిన వడిసెల రాయికి
కిలకిలమని  ఎగిరి పరుగుపెట్టే
రామ చిలుకలు

అంతలోనే అద్భుత గానామృతం
ఆకాశం నుండి జాలువారుతుందా అన్నట్లు
తాటిచెట్టెక్కి కల్లుగీస్తున్న
సీపతి సాయిలు సిరుతల రామాయణం పాట
ఎంత వీనుల విందైయ్యేది.

ఎండకాలం సెలవుల్లో
గుండెలను కదిలించే చిందు యక్ష గానాలు
జానపదుల జ్ఞానదీపమైన
అద్భుత కళారూపాలు
గంజి లక్ష్మణస్వామి సారంగధర గీతాలు
ఆర్ధ్రతగా ఇంకా ఎదలను కదిలిస్తూనే ఉన్నయ్‌

ఇట్లా మా మదిలో నాటుకొన్న
నాటి గ్రామీణం

శ్రమజీవన సౌందర్యమైన
సకల వృత్తుల సారం
కళలకు జీవనాధారం
కలిలేముల్లో కలిసి బతికే
సహజీవన సహకారం

పరీశిలిస్తే
అన్నీ పాఠ్యగ్రంథాలే
పాఠశాలకు ఆవలైనా
జీవన నైపుణ్యాలకు
సోపాలైన
ప్రగతిశీల క్షేత్రాలవి

నేటి పట్నం నవ నాగరిక విద్యార్థికి
బియ్యపు గింజకు మూలమైన
బీజము తెలియని దుస్థితి

మట్టి కొట్టిన మనుషులు కనబడితేనే
ముఖము చిట్లిస్తూ ముక్కు మూసుకొని దూరంగా జరిగే ఒకింత
చిరాకు తనం

బతుకు మూలాల సారం తెలుపని
కాన్వెంటు చదువుల్లో
కనుమరుగైన కర్షకుని ఔన్నత్యం

ఈనాటి గోడలు కట్టిన బాల్యం కంటే
మట్టి పరిమళాల సాంగత్యంతో
అల్లుకున్న బతుకు పాఠాలే
మా బాల్యానికి లభించిన గొప్ప బలమని
సగర్వంగా చెప్పే సందేశమిది.

Leave a Reply