Take a fresh look at your lifestyle.

చిక్కెంటికలోళ్లం

రోజులు మారాయి
మా బతుకు చిత్రాలు మారవు
అప్పట్లో బెల్లం, పుట్నాలతో
అందరి నోళ్ళు తీపిచేసేటోల్లం
వాళ్ళిచిన చిక్కెంటికల్ని
సొనపం( బంగారం) మాదిరి
సంచిల దాసోటోల్లం

రోజులు మారాయి
మా బతుకు చిత్రాలు మారవు
ఇప్పుడు
ఊరురు తిరిగి బోల్లు, గిన్నెలు
ఇచ్చి చిక్కెంటికల కోసం
అయ్యా, అవ్వ ,తమ్మి, చెల్లే
అంటూ ఊరూరా సుట్టాలని
చేసుకొనివారితో
బందాలని
చిక్కెంటికలలో పెనవేసుకొని
కాస్త మురిసి పోతుంటం.

రోజులు మారాయి
మా ఇంట్లో దినాము
పంచాయతీ మాత్రం మారదు
తాగి పెనిమిటి పెట్టే బాధలు
చిన్నప్పటి అయ్యారూపం
ఒకమాడిరి తోస్తున్నై
ఐనా నన్నొదార్సేటి ఆప్తులు చిక్కెంటికలే
కాస్తంత ఎక్కువ దొరికితే
మొగుడితో తిప్పలు ఆ దినామూ తగ్గినట్టే
పసోల్ల బాధలను చూసి
రోజూ నాలో నేను దైర్యన్ని
నింపుకొని బయలెళ్లుతాను బ్యారనికి..

మా గీతాలు చిన్నప్పుడే
నిర్ణయిస్తారు మా పెద్దలు
ఆడోళ్లు బ్యారాలకు(వ్యాపారాలకు)
మోగోళ్లు షికార్లకు(వేటకు)
రోజంతా తెచ్చిన చిక్కెంటికలు
మా కులపు కామధేనువులు

ఆపూట ఆకల్ని తీర్చి
మా చిన్నోడి డోక్కల్ని
కాస్త వుబ్బెట్టుగా చేస్తాయి
నా భర్త వేధింపులు ఆగాలన్న
నా బిడ్డ సదువులు సాగాలన్న
నా బాకీలు తీరాలన్న
చిట్టిలు కట్టి చిట్టితల్లి కి
లగ్గం చేయాలన్న
రోజూ ఊరూరూ తిరగాల్సిందే
కాసిన్ని చిక్కెంటికలు తేవల్సిందే
అవే మా జీవితంలో
పెద్ద కానుకలుగామురిసి
మోడువారిన జీవితాలతో
కాలం వెళ్లదీస్తున్నాం

74 ఎండ్లు
పిప్పరమెట్లు,చక్లెట్లతోనే
స్వతంత్ర సంబురాలు
అవే మన ఆర్భాటాలు
ఆగేదెన్నడు
ఆకలి పోరాటాలు
బడుగుల జీవిత చిత్రాలు
అందులో మాలాంటి బ్యారగాల్లు
చెక్కెంటికలోల్లం..
మరెవరికీ పట్టనొల్లం.. ఇంకెన్ని
దినాలు సుడల్నో….
-ఎమ్‌.‌నాగరాజు(6301 993211) 

Leave a Reply