వరంగల్ నగరంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ జిల్లా వైద్య శాఖ అధికారులతో బాల సముద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కరోనా నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. ప్రజల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. పౌష్టికాహారం, తగిన మందులు వాడి కరోనాను జయించవచ్చని పేర్కొన్నారు. నగరంలోని 14 అర్బన్ హెల్త్ సెంటర్లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
కరోనా నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా మందుల కిట్ అందజేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు మైరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని చీఫ్ విప్ పేర్కొన్నారు. బాధితులు అధైర్య పడకుండా 17 రోజులు హోంక్వారంటైన్లో ఉండి వైద్యులు ఇచ్చిన మందులు వాడితే కరోనా నయం అవుతుందన్నారు. వరంగల్ నగరంలో కరోనా పరిస్థితులు, వైద్య సదుపాయాలు, వైరస్ కట్టడికి వ్యూహాలు, కరోనా టెస్టుల వంటి అంశాలపై డిఎంహెచ్ఓ డాక్టర్ లలితా దేవి, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్లతో చర్చించారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రస్తుత స్థితిగతులు, ఆస్పత్రులు, డాక్టర్ల పనితీరు, కోవిడ్ కేర్ సెంటర్లు, ఆహార నాణ్యత వంటి అంశాలను పరిశీలన చేయాలని ఆదేశించారు. ప్రజలు నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.