Take a fresh look at your lifestyle.

29 ‌లక్షలు గోల్‌మాల్‌ ‌చేసిన పంచాయితీ కార్యదర్శి

  • సొంతానికి వాడుకుంటూ భార్య ఖాతాకు నిధులు జమ
  • విచారణ జరిపించాలని పలువురి డిమాండ్‌

‌కర్నూలు,జూలై 21 : బనగానప్లలె మండలంలోని నందవరం గ్రామ పంచాయతీలో రూ.29 లక్షల నిధులు గోల్‌మాల్‌ అయ్యాయి. గ్రామ పంచాయతీ గ్రేడ్‌-2 ‌కార్యదర్శి గ్రామ పంచాయతీ నిధులను తన సొంత నిధులలాగా ఇష్టానుసారంగా ఖర్చు చేసి పక్కదారి పట్టించారు. గ్రామ పంచాయతీ నిధులను తన భార్య బ్యాంకు ఖాతాకు రూ.29 లక్షలను మళ్లించినట్లు తేలింది. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 14వ, 15వ ఫైనాన్స్ ‌నిధులతో పాటు గ్రామ పంచాయతీ జనరల్‌ ‌ఫండ్‌ ‌నిధులను పక్కదారి పట్టించినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. నందవరం గ్రామ పంచాయతీ గ్రేడ్‌-2 ‌కార్యదర్శిగా పనిచేస్తున్న సతీష్‌ ‌కుమార్‌ ‌రెడ్డి గ్రామ పంచాయతీ నిధులలో నుంచి రూ.29 లక్షలను తన భార్య బ్యాంకు ఖాతాకు మళ్లించారు. రికార్డుల్లో అందులోని రూ.23 లక్షలను వివిధ అభివృద్ధి పనుల కోసం డ్రా చేసినట్లు నమోదు చేశారు. అవి కూడా ఏ పనికి ఎంత ఖర్చు చేసిందీ రికార్డుల్లో సక్రమంగా లేదు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు కార్యదర్శిపై నంద్యాల పంచాయతీ డివిజనల్‌ అధికారి శ్రీనివాసులుకు ఇటీవల ఫిర్యాదు చేశారు.

దీంతో డివిజనల్‌ అధికారి గ్రామ పంచాయతీ కార్యదర్శి అవినీతిపై విచారణ చేశారు. గ్రామ పంచాయతీ నిధులు రూ.29 లక్షలు భార్య బ్యాంకు ఖాతాలో జమ చేశారని, అందులో రూ.23 లక్షలను డ్రా చేసి వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్లు రికార్డులు నమోదు చేశారని, గ్రామ పంచాయతీ నిధుల్లో అక్రమాలు జరిగాయని జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్‌కు నివేదికను ఇచ్చారు. అయితే జిల్లా అధికారులు ఇంతవరకు గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయన గతంలో నంద్యాల మండలం రైతు నగర్‌ ‌గ్రామపంచాయతీలో పని చేసేటప్పుడు అక్రమాలకు అవినీతికి పాల్పడడంతో సస్పెండ్‌ ‌చేశారు. సస్పెన్షన్‌ ‌పెండింగ్‌ ‌కింద తిరిగి నందవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నియమించారు. బనగానప్లలె మేజర్‌ ‌గ్రామ పంచాయతీకి ఇంచార్జి ఈఓగా పని చేశారు. అక్కడ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు రావడంతో పలుకూరు మేజర్‌ ‌గ్రామ పంచాయతీకి ఇంచార్జి ఈవోగా బదిలీ చేశారు. అక్కడ సైతం అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply