తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. కరీంనగర్ నుంచి సీఎం హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకున్నారు. హెలికాప్టర్ నుంచి మేడిగడ్డ జలాశయం, కన్నేపల్లి పంప్‌హౌస్‌లను విహంగ వీక్షణం చేశారు. అనంతరం గోదావరి పుష్కరఘాట్‌కు చేరుకుని త్రివేణి సంగమం వద్ద పూజలు చేశారు. ప్రాణహిత-గోదావరి పవిత్ర జలాలను తలద చల్లుకున్నారు.
నదిలో నాణెళిలు వదిలి జల నీరాజనాలు అర్పించారు. అనంతరం ముక్తేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ బ్యారేజీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో సీఎస్ సోమేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.