దివ్యాంగ దత్తపుత్రికలకు కోర్టు కలాపాల వివరణ
న్యూదిల్లీ,జనవరి6 :భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తన పెంపుడు కుమార్తెలను సుప్రీంకోర్టుకు తీసుకొచ్చి, తన చాంబర్‌ను చూపించి, కోర్టు కార్యకలాపాలను వివరించడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆసక్తిగా గమనించారు. ప్రియాంక (20), మహి (16) అనే ఇద్దరు దివ్యాంగులను జస్టిస్ చంద్రచూడ్ తన కుమార్తెలుగా పెంచుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆయన సుప్రీంకోర్టు కు వచ్చారు.
పబ్లిక్ గ్యాలరీ నుంచి వారు కోర్టులోకి ప్రవేశించారు. ఆ తర్వాత వారు ఒకటో గదిలోని సీజేఐ కోర్ట్‌కు వెళ్ళారు. కోర్టు కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతాయో వారికి ఆయన వివరించారు. జడ్జిలు ఎక్కడ కూర్చుంటారు? న్యాయవాదులు ఎక్కడి నుంచి వాదనలు వినిపిస్తారనే అంశాలను వివరించారు. అనంతరం ఆయన వారిద్దరినీ తన చాంబర్‌కు తీసుకెళ్ళారు.సుప్రీంకోర్టును చూడాలని ఉందని ప్రియాంక, మహి కోరడంతో జస్టిస్ చంద్రచూడ్ వారిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.