Take a fresh look at your lifestyle.

ప్రధాన న్యాయమూర్తి ‘బోబ్డే’ వ్యాఖ్యలు అత్యాచార సంస్కృతిని పెంచిపోషించేవి

“లైంగిక అత్యాచారం అనేది నేరం. హింసా పూరితమైనది. పరస్పర అంగీకారం వుండదు. మైనారిటీ తీరని పిల్లల విషయంలో పోక్సో చట్టం ప్రకారం అంగీకార సంబంధం అనేది వుండదు. ఈ కేసు విషయంలో ఇంత స్పష్టంగా బెదిరించి, హింసతో లొంగదీసుకున్న నిందితుడిని, పదే పదే అత్యాచారం చేసిన నిందితుడిని ఆ విషయం మీద విచారించకుండా ‘ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా’ అని అడగటమంటేనే రాజ్యాంగం కల్పించిన స్త్రీల హక్కుల మీదే ప్రధాన న్యాయమూర్తికి గౌరవం లేకపోవటాన్ని సూచిస్తోంది.”

k sajaya sankethamఅత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న వ్యక్తులు రాజ్యాంగం కల్పించిన చట్టపరమైన హక్కుల్ని అపహాస్యంగా మారుస్తారని ఊహించగలుగుతామా? కానీ ఇప్పుడు ఇది మన కళ్లముందు జరుగుతున్న వాస్తవం. లైంగిక అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తన మీద వచ్చిన ఆరోపణలను తానే విచారించటానికి కూర్చున్న విషయమే అత్యంత దుర్మార్గమనుకుంటే (మాజీ ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ పదవీ విరమణ తర్వాత అధికారపార్టీ అతన్ని పిలిచి మరీ రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టటం కూడా జరిగింది!) ఇప్పుడు ఒకేరోజు అత్యాచారాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి శరద్ అర్వింద్ బోబ్డే. ఈయనే ఇంతకూ ముందు కూడా రైతాంగ ఉద్యమంలో మహిళలెందుకు ఉన్నారంటూ వారిని ఇళ్లకు పంపించివేయమని ఆదేశించిన వ్యక్తి. అవే అభ్యంతరకరమంటే ఇప్పుడు రెండు కేసులలో 1 మార్చ్, 2021 న చేసిన వ్యాఖ్యలు నిర్ద్వందంగా అందరూ ఖండించాల్సిన అంశాలు. సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికే చట్టం గురించి చెప్పేపాటి వాళ్లా మీరు అని కత్తులు దూసేవాళ్ళకి కొదవేమీ వుండకపోవచ్చు. ఇంతకీ ఆయన ఏ కేసు సందర్భంగా ఏమేం వ్యాఖ్యలు చేశాడో చూసిన తర్వాత తీరిగ్గా నిర్ణయిద్దాం . ‘నువ్వు ప్రభుత్వ వుద్యోగివి కాబట్టి నువ్వు అరెస్ట్ కాకుండా ఉండాలంటే, నువ్వు అత్యాచారం చేసిన అమ్మాయిని పెళ్ళిచేసుకుంటావా, నిన్ను మేము వొత్తిడి పెట్టటం లేదు కానీ, ‘రేప్’ చేస్తే, ‘ప్రేమిస్తే’ ఇలాంటి పరిణామాలుంటాయి అని ముందే ఆలోచించి వుండాల్సింది’ అని మోహిత్ సుభాష్ చవాన్ vs స్టేట్ అఫ్ మహారాష్ట్ర కేసులో సెలవిచ్చారు. (‘రేప్’ ‘ప్రేమిస్తే’ ఇవి రెండూ వేరు వేరు విషయాలు. రెంటినీ ఒకే అంశంగా ప్రకటించారు ఈ సారు!) అదేరోజు వినయ్ ప్రతాప్ సింగ్ vs స్టేట్ అఫ్ ఉత్తరప్రదేశ్ అనే మరో కేసులో “చట్టబద్ధంగా వివాహం చేసుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే సెక్స్ ని భర్త దుర్మార్గుడు, హింసాత్మకమైన వ్యక్తి అయినంత మాత్రాన ‘అత్యాచారం’ అని ఎలా అంటాం?” అని వాక్రుచ్చారు. భార్యకు ఇష్టం లేకపోయినా భర్త హింసాత్మకంగా శారీరక లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తే దాన్ని ప్రశ్నించకూడదనే అభిప్రాయం రెండోదానిలోనూ, నువ్వు రేప్ చేసినా గానీ పెళ్లి చేసుకుంటే దాన్ని నేరంగా పరిగణించమనే అభిప్రాయాన్ని మొదటి దానిలోనూ సెలవివ్వటం జరిగింది. ఈ రెండు అభిప్రాయాలూ ‘అత్యాచారం’ అనే అంశం చుట్టూ వున్న అనేక అంశాల దుర్మార్గాన్ని సహజమైన అంశాలుగా ప్రశ్నించకూడని విషయాలుగా మలిచే ఒక క్రమం మన ముందుకి వచ్చింది.

 

మొదటి కేసు గురించి కొంచం వివరంగా మాట్లాడుకుందాం. తొమ్మిదవ తరగతి చదువుతున్న పదిహేనేళ్ల ఒక మైనర్ బాలిక మీద ఈ మోహిత్ సుభాష్ అనేవాడు (దూరపు బంధువు, తెలిసిన వ్యక్తే) ఆమె వంటరిగా ఇంట్లో వున్న సమయంలో ఆమె మీద బలప్రయోగం చేసి, బంధించి అత్యాచారం చేశాడు. విషయం బయటికి చెబితే మొహం మీద ఆసిడ్ పోస్తానని, పెట్రోల్ పోసి తగలబెడతానని, వాళ్ల తమ్ముడిని చంపేస్తానని ఇలా రకరకాలుగా బెదిరించి లొంగదీసుకుని 2014-2015 సంవత్సరాల కాలంలో ఆమెని పదే పదే కొన్నిరోజుల పాటు అత్యాచారం చేస్తూ పోయాడు. ఇతను మానసికంగా, శారీరకంగా పెట్టే హింసను తట్టుకోలేక, సామాజికంగా ఎదురయ్యే అవమానానికి  ఆ అమ్మాయి ఉరి పెట్టుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆ అమ్మాయి తల్లి అడ్డుపడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటానికి వెళ్ళారు. వీళ్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన విషయం తెలిసిన అతని తల్లి వచ్చి తన కొడుకు చేసింది తప్పేనని, దాన్ని సరిదిద్దుకుంటామని పోలీసు కేసు పెట్టవద్దని, అమ్మాయికి మైనారిటీ తీరిన వెంటనే తన  కొడుకుతో పెళ్లి చేసి కోడలుగా చేసుకుంటామని చెప్పింది. అదే విషయాన్ని తల్లీకొడుకులిద్దరూ 2018లో ఒక నోటరీ కాగితం మీద రాసి ఇచ్చి కేసు పెట్టకుండా ఆపారు. సాధారణంగా కులపంచాయితీల్లో ఇలాంటి వొప్పందాలు అమ్మాయిలకు ఇష్టం వున్నా లేకపోయినా పెద్దల నిర్ణయంతో జరిగిపోతుంటాయి. అయితే, అమ్మాయి మేజర్ అయిన తర్వాత ఈ వొప్పందాన్ని అమలు చేయమని 2019లో ఆమె తల్లి అడిగినప్పుడు అతను, అతని కుటుంబం ఖాతరు చేయకపోగా బెదిరింపులకు దిగారు. దానితో, ఆలస్యంగా అతని మీద అప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 376(లైంగిక అత్యాచారం), 417(మోసం చేయటం), 506(హానికరమైన బెదిరింపు)లతో పాటు 4&12 పోక్సో 2012( ప్రొటెక్షన్ అఫ్ చిల్ద్రెన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద 2019 డిసెంబర్ 17న పోలీసు కేసు నమోదు చేశారు.

 అప్పటికే అతనికి ప్రభుత్వ వుద్యోగం లో వుండటం వల్ల అరెస్టు నుంచీ తప్పించుకోవటం కోసం, తమది  అంగీకారయోగ్యమైన లైంగిక సంబంధమని, బలవంతం ఉండుంటే ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేస్తారని అంటూ  ముందస్తు బెయిల్ కోసం 2019 డిసెంబర్ 23న దరఖాస్తు చేశాడు. దానిని విశ్వసించిన సెషన్స్ కోర్ట్ 2020 జనవరి 6 న బెయిల్ మంజూరు చేసింది.  ఆ బెయిల్ని రద్దు చేయమని ఆమె 2020  ఫిబ్రవరి 5వ తేదీన  హై కోర్ట్ లో పెటిషన్ వేయటంతో అతనికి సెషన్స్ కోర్ట్ మంజూరు చేసిన బెయిల్ రద్దయింది. దానితో అతను సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళాడు. అదిగో, ఆ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా అప్పుడు మన ఘనత వహించిన సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారు పై విధంగా వ్రాక్రుచ్చారు.

 లైంగిక అత్యాచారం అనేది నేరం. హింసా పూరితమైనది. పరస్పర అంగీకారం వుండదు.  మైనారిటీ తీరని పిల్లల విషయంలో పోక్సో చట్టం ప్రకారం అంగీకార సంబంధం అనేది వుండదు. ఈ కేసు విషయంలో ఇంత స్పష్టంగా బెదిరించి, హింసతో లొంగదీసుకున్న నిందితుడిని, పదే పదే అత్యాచారం చేసిన నిందితుడిని ఆ విషయం మీద విచారించకుండా ‘ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా’ అని అడగటమంటేనే రాజ్యాంగం కల్పించిన స్త్రీల హక్కుల మీదే ప్రధాన న్యాయమూర్తికి గౌరవం లేకపోవటాన్ని సూచిస్తోంది. మరీముఖ్యంగా అత్యాచార నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి అయివుంటే మరింత కటినంగా వ్యవహరించాలి కూడా. నిందితుడు ఏ స్థాయిలో ఆ అమ్మాయిని బెదిరించాడు అంటే ఆ అమ్మాయి తన ప్రాణాన్ని తీసుకోవాలనుకునేంతగా! అలాంటి వ్యక్తిని పట్టుకుని ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న వ్యక్తి ‘ఆ అమ్మాయికేదో న్యాయం జరుగుతుందన్నట్లుగా ‘గృహప్రవేశం, ‘పెదరాయుడి వంటి తెలుగు సినిమాల’ తరహాలో వ్యవహరించడం.

అంటే,  జీవితాంతం ఆ అమ్మాయి అలాంటి హింసా పూరితమైన వ్యక్తితోనే వుండాలని, అదే న్యాయమని ఈయన అభిప్రాయం. వాళ్ల ఆమ్మే వొప్పుకుందిగా అనొచ్చేమో ఈయన! ఒక నిరక్షరాస్యురాలైన, వంటరి తల్లి అనేక సామాజిక భయాలతో అలా ఆలోచించింది అంటే అర్థం చేసుకోవచ్చు కానీ, ఈయన కూర్చున్న స్థానం ఏమిటి? మళ్ళీ ఈయనే రెండో కేసులో ఏం చెప్పాడో చూశాం కదా! ‘చట్టబద్ధంగా వివాహమైన తర్వాత భార్యకు ఇష్టం లేకుండా సెక్స్ చేసినాగానీ అది అత్యాచారం ఎలా అంటాం’ అంటూ సెలవివ్వటం.  ఈయన దృష్టిలో స్త్రీలకు స్వయం నిర్ణయాధికారం వుండకూడదు. వాళ్ళు తమ నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తులు. స్త్రీల రాజ్యంగబద్ధమైన హక్కుల్ని గుర్తించని రచ్చబండ తీర్పులు, కుల పంచాయితీలు, ఖాఫ్ పంచాయితీలు, కుటుంబాలు ఈ విధంగా అడిగితేనే చట్టప్రకారం అవి చెల్లవని చెప్పి ఆ హక్కుల్ని రక్షించవలసిన, నిలబెట్టవలసిన న్యాయమూర్తులు ఇంత వివక్షా పూరితమైన  అభిప్రాయాలు వెల్లడించడం చట్టవిరుద్ధం కాదా? స్త్రీల చట్టాల గురించి అవి వచ్చిన నేపథ్యం గురించి భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న వక్తికి చెప్పాల్సి రావటం అత్యంత విషాదకరం.

అత్యాచారాలకు సంబంధించి చట్టాల్లో వచ్చిన అనేక మార్పులు సుదీర్ఘమైన స్త్రీల ఉద్యమాల వల్లనే వచ్చాయి. మధుర రేప్ సంఘటన నుంచీ, భన్వారి, నిర్భయ ఇంకా అనేకానేకమంది దుర్మార్గమైన అత్యాచార సంస్కృతికి బలయిపోయారు. ఇంకా బలవుతూనే వున్నారు. ఇప్పుడిప్పుడే బాధితులు అనేక విధాలుగా  ధైర్యాన్ని ప్రోది చేసుకుని చట్టపరంగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో న్యాయం జరిగే దిశగా నిర్దేశం చేయవలసిన వ్యవస్థల్లో పైస్థాయిలో వున్న ప్రధాన న్యాయమూర్తి తానూ చేసిన వ్యాఖ్యలకు బేషరతు క్షమాపణలతో వాటిని నిర్ద్వందంగా వెనక్కి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయాలి. 

Leave a Reply