Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌లో విద్యుత్‌ ‌బిల్లుల మాఫీని పరిశీలించండి ప్రభుత్వానికి హైకోర్టు సూచన

లాక్‌డౌన్‌ ‌సమయంలో రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు భారం మోపకుండా విద్యుత్‌ ‌బిల్లులను మినహాయించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ మైనార్టీ విభాగం చైర్మన్‌ ‌వలియుల్లా దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ ‌చౌహాన్‌ ఈమేరకు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. కేసు విచారణ సందర్భంగా పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా సామాన్య ప్రజలపై విద్యుత్‌ ‌బిల్లుల భారాన్ని మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌ ‌కాలానికి సంబంధించి విద్యుత్‌ ‌బిల్లుల మాఫీని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చందంగా ప్రకటించాలని కోరారు. మంత్రి జగదీష్‌రెడ్డి పెరిగిన విద్యుత్‌ ‌బిల్లులను సమర్థించడం చాలా దురదృష్టకరమనీ, ప్రజలు లేవనెత్తిన వేలాది అభ్యంతరాలపై స్పందించడం లేదని ఆరోపించారు. విద్యుత్‌ ‌బిల్లుల సమస్యపై ఫిర్యాదులను స్వీకరిస్తున్నామనీ, మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌ద్వారా హామీ ఇచ్చారనీ, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపశమనం లభించనందున హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. పిటిషనర్‌ ‌వాదనలు విన్న హైకోర్టు దీనిపై తగిన వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

Leave a Reply