Take a fresh look at your lifestyle.

టీకా మిక్సింగ్‌తో డెల్టా వేరియంట్‌కు చెక్‌

  • ‌మరిన్ని అధ్యయనాలు జరగాలన్న ఎయిమ్స్ ‌చీఫ్‌
  • ‌తమిళనాడులో తొలి డెల్టా వేరియంట్‌ ‌మృతి కేసు నమోదు
  • థర్డ్‌వేవ్‌ అం‌త తీవ్రంగా ఉండకపోవచ్చు : ఐసిఎంఆర్‌-‌లండన్‌ ఇం‌పీరియల్‌ ‌కాలేజీ స్టడీ
  • భారత్‌లోకి జాన్సన్‌ అం‌డ్‌ ‌జాన్సన్‌ ‌టీకా : సింగిల్‌ ‌డోస్‌ ‌టీకా ధర 25 డాలర్లుగా నిర్ణయం

వేగంగా వ్యాపించే డెల్టా, డెల్టా ప్లస్‌ ‌వేరియంట్లను వ్యాక్సిన్‌ ‌మిక్సింగ్‌ ‌ద్వారా ఎదుర్కోవచ్చని ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌డా. రణదీప్‌ ‌గులేరియా అన్నారు. అయితే.. ఈ విధానాన్ని అనుమతిం చేందుకు మరింత సమాచారం కావాల్సి ఉందన్నారు. డెల్టా, డెల్టా ప్లస్‌ ‌లాంటి కొత్త కరోనా వేరియంట్లపై టీకాల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండొచ్చన్న భయాల నడుమ ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఊరట కలిగించేలా ఉన్నాయి. రెండు వేర్వేరు టీకాలను వేసుకోవడం ద్వారా వేరియంట్లకు చెక్‌ ‌పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై జరిగిన తొలి దశ అధ్యయనాలు..వేరియంట్లకు వ్యాక్సిన్‌ ‌మిక్సింగ్‌ ‌చెక్‌ ‌పెట్టగలదని సూచించాయి. కాబట్టి.. ఏయే టీకాలు వేయాలనేదానిపై మరింత అధ్యయనం జరగాలన్నారు. వేర్వేరు టీకాల వినియోగం వల్ల వ్యాక్సిన్‌ ‌ప్రభావశీలత కచ్చితంగా పెరుగుతుందని ఆయన తెలిపారు. రెండు భిన్నమైన కరోనా టీకాలను ఇవ్వడం ద్వారా ఎంత ప్రయోజనం ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త టీకా విధానంలో భాగంగా కేంద్రం ఈ విషయాన్నితెలిపింది. ఏయే టీకాలను కలపాలనేది ప్రభుత్వ నిపుణుల నిర్ణయిస్తారని పేర్కొంది.

ఇక కొత్త వేరియంట్లపై ప్రస్తుతమున్న టీకాలు పనిచేయకపోవచ్చన్న వార్తలను డా. రణదీప్‌ ‌గులేరియా గతంలోనే తోసిపుచ్చారు. ఈ విషయాలను నిర్దారించేందుకు అదనపు సమాచారం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుంటే డెల్టా ప్లస్‌ ‌కోవిడ్‌ ‌వేరియంట్‌తో తమిళనాడులో తొలి మరణం నమోదైంది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్రలో తొలి మరణాలు నమోదయ్యాయి. మదురైకి చెందిన ఒక వ్యక్తి కొత్త డెల్టా వేరియంట్‌తో మృతి చెందినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మదురై పేషెంట్‌ ‌మృతి తర్వాత శాంపుల్స్ ‌సేకరించామని, పరీక్షల్లో డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ అని తేలిందని వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రమణియన్‌ ‌తెలిపారు. డెల్టా ప్లస్‌ ‌కేసులు మూడు నమోదు కాగా, ఇద్దరు కోలుకున్నారని, వీరిలో చెన్నైకి చెందిన 32 ఏళ్ల నర్సు ఒకరు, కాంచీపురం జిల్లాకు చెందిన మరొకరు ఉన్నట్టు చెప్పారు.దేశంలో ఇంతవరకూ 45,000 శాంపుల్స్ ‌పరీక్షించగా 51 కేసుల్లో కరోనా డెల్లా ప్లస్‌ ‌వేరియంట్‌ ఉన్నట్టు సమాచారం ఉందని కేంద్రం ప్రకటించింది. మొత్తం కేసుల్లో తమిళనాడులో 9, మహారాష్ట్రలో 22, మధ్యప్రదేశ్‌లో 7, కేరళలో 3, పంజాబ్‌, ‌గుజరాత్‌లలో చెరో రెండు, ఆంధప్రదేశ్‌లో, ఒడిశా, రాజస్థాన్‌, ‌జమ్మూకశ్మీర్‌, ‌హర్యానా, కర్ణాటకలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కొత్త మ్యూటెంట్‌తో మహారాష్ట్రలో ఒకరు, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు మృతి చెందారు. కాగా, దేశంలో డెల్టా ప్లస్‌ ‌కేసులు పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేసులు వెలుగుచూస్తున్న జిల్లాల్లో జనం గుమిగూడకుండా చూడటం, కోవిడ్‌ ‌పరీక్షలు, వ్యాక్సినేషన్‌ ‌పక్రియ వేగవంతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది.

థర్డ్‌వేవ్‌ అం‌త తీవ్రంగా ఉండకపోవొచ్చు : ఐసిఎంఆర్‌-‌లండన్‌ ఇం‌పీరియల్‌ ‌కాలేజీ స్టడీ
కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ అం‌త తీవ్రంగా థర్డ్ ‌వేవ్‌ ఉం‌డకపోవొచ్చునని ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ ఐసీఎంఆర్‌ ‌పేర్కొంది. మూడోవేవ్‌ ‌రావడానికి అవకాశాలు తక్కువేనని, ఒకవేళ వొచ్చినా రెండో వేవ్‌ అం‌త తీవ్రంగా ఉండకపోవొచ్చునని స్పష్టం చేసింది. కొరోనా తీవ్రతపై ఇంపీరియల్‌ ‌కాలేజ్‌ ఆఫ్‌ ‌లండన్‌తో కలసి ఐసీఎంఆర్‌ ఓ ‌స్టడీ చేపట్టింది. ఐసీఎంఆర్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌బలరాం భార్గవ, మెడికల్‌ ఎక్స్‌పర్ట్ ‌సందీప్‌ ‌మండల్‌, ‌సవి•రన్‌ ‌పండా, లండన్‌లోని ఇంపీరియల్‌ ‌కాలేజ్‌కు చెందిన నిమలన్‌ అరినమిన్‌పతి సంయుక్తంగా ఓ రీసెర్చ్ ‌పేపర్‌ను రూపొందించారు. ఈ పరిశోధనలోని విషయాలు ఇండియన్‌ ‌జర్నల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి. కొత్త వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి ఉండి, అదే సమయంలో రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలగితే థర్డ్ ‌వేవ్‌ ‌వొచ్చే చాన్సెస్‌ ఉన్నాయని రీసెర్చ్ ‌పేపర్‌లో పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కొరోనా వేవ్స్ ‌రాకూడదంటే భారీ ఎత్తున వ్యాక్సినేషన్‌ ‌పక్రియను చేపట్టాలని సూచించారు.

భారత్‌లోకి జాన్సన్‌ అం‌డ్‌ ‌జాన్సన్‌ ‌వ్యాక్సిన్‌ : ‌సింగిల్‌ ‌డోస్‌ ‌టీకా ధర 25 డాలర్లుగా నిర్ణయం
దేశంలో టీకా డిమాండ్‌ ‌పెరుగుతున్న క్రమంలో విదేశీ టీకాలకు డిమాండ్‌ ‌పెరుగుతున్నది. ఇప్పటికే స్పుత్నిక్‌ ‌మనదేశానికి రాగా, అమెరికాకు చెందిన జాన్సన్‌ అం‌డ్‌ ‌జాన్సన్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ ‌టీకా వొచ్చే నెలలో ఇండియాలో కొద్దిమొత్తంలో అందుబాటులోకి రానుంది. త్వరలోనే దీనికి భారత ప్రభుత్వం నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులు వొచ్చే అవకాశం ఉంది. అమెరికా ఎఫ్‌డీఏ మాత్రం ఫిబ్రవరిలోనే ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. గత నెలలో బ్రిటన్‌ ‌కూడా వినియోగానికి పచ్చజెండా ఊపింది. అయితే, డెల్టా ప్లస్‌ ‌లాంటి వేరియంట్లపై ఇది ఏమాత్రం ప్రభావం చూపుతుందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధ్యయనాలు జరగనప్పటకీ జాన్సన్‌ ‌మాత్రం తమ టీకా డెల్టా వేరియంట్‌పైనా ప్రభావం చూపుతుందని చెబుతున్నది. అసోసియేషన్‌ ఆఫ్‌ ‌హెల్త్‌కేర్‌ ‌ప్రొవైడర్స్ (ఇం‌డియా) ఈ టీకాను ప్రైవేటుగా ఆ సంస్థ నుంచి నేరుగా సేకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

Leave a Reply