Take a fresh look at your lifestyle.

మారుతున్న యువత తీరు

ప్రపంచదేశాలలో కంటే అతి ప్రధానంగా మన భారతదేశానికి ఉన్న గొప్ప పేరు భారత్‌ అత్యధికంగా యువ సంపద ఉన్న దేశం అని పిలువబడడామే!ఇతర దేశాలతో పోల్చితే మన దేశ జనాభాలో యువతీయువకుల జనాభా శాతం ఎక్కువగా ఉంది.మరీ ఇంత ప్రాధాన్యత ఉన్న యువభారత్‌ ‌కు దేనినైనా సాధించడంలో అడ్డులేదాని భావించవచ్చు.మరీ అలాంటి పరిస్థితులు నేడు మన కనులముందు ఉన్నాయా?అని ఆలోచించాల్సిన అవసరం ఉంది.దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంతో మంది యువతీయువకులు ఉన్నత విద్యను పూర్తి చేసి ఉపాధి కోసం,ఉద్యోగాల కోసం కంట్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. పాలకులు స్పందించి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయకుండా జాప్యం చేస్తున్నారు.

ఎంతో కష్టపడి,తల్లిదండ్రుల కష్టసుఖాలను ఆకలింపు చేసుకుంటూ భవిష్యత్తును ఎంతో అందంగా ఊహించుకున్నా యువత నేడు దిక్కు తోచని స్థితిలో ఆగంమవుతుంది.ఎన్నో ఆశల నడుమ కొడుకులు,కూతుళ్లు కొలువులు చేస్తారని ఆనందపడే తల్లిదండ్రులకు అది ఒక పగటికలలాగే మిగిలిపోతుంది.ఎమ్మెస్సీలు, బిఇడిలు,ఎంఈడీలు, ఫార్మసీ లు ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నతవిద్య,వృత్తి విద్య అనే ఎలాంటి తేడా లేకుండా విద్యను పూర్తి చేసిన ఎన్నో లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉపాధిలేక దారి తప్పుతున్నారు. యువతీయువకులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి,ఊరికి,కన్నా వాళ్లకు దూరంగా ఉంటూ యూనివర్సిటీలలో,ప్రభుత్వ, ప్రవేయిట్‌ ‌వసతిగృహలలో అరకొర వసతుల మధ్య కష్టపడి చదువుకున్నా నేడు ఫలితం కానరాకుండా ఉంది. ఉన్నతవిద్యను అభ్యసించిన ఆ విద్యలో సారం లేక సరియైన నైపుణ్యంతో కూడిన విద్యావిధానం లేక నానా అవస్థలు పడుతున్నా యువత కళ్లలో కన్నీటి చెలిమలు కనిపిస్తున్నాయి.

పెళ్లివయస్సు దూరమైనా,అవసరాలు ఆపదాలను సృష్టిస్తున్నా కన్న వారి కలను సాధనకై బతుకుపాలిట ఆశతో బరువెక్కిన గుండెతో కొన్ని సంవత్సరాల కాలంతో పాటు పోటీ పడుతూ ప్రభుత్వ కొలువులకై సాధన చేస్తున్నారు. అయిన ఆ కొలువల జాడలేకుండా ఉంది.ప్రభుత్వ కొలువులు లేకపోయినా స్వయం ఉపాధికై కూడా దారులు కానరాకుండా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ,ప్రభుత్వయేతర పరిశ్రమలలో,వివిధ రకాల సంస్థలలో స్థానికంగా ఉన్న విద్యావంతులయిన యువతకు అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయాలి. ఎంతో మేధస్సు,విజ్ఞానం ఉండి కూడా నిర్విర్యాయం అవుతున్నా యువతకు చేయుతనిచ్చే పథకాలు,కార్యక్రమాలకై ఒక నిర్థిష్టమైన కార్యచరణతో కూడిన ప్రణాళికను రూపొందించాలి.

యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేలా చర్యలు చేపట్టాలి.స్వయం ఉపాధి అవకాశాల కల్పనకై సమగ్రమైన ఆలోచనాలు చేసి వ్యాపార వాణిజ్య పెట్టుబడులకై ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి ఋణసదుపాయాలను కల్పించాలి.కాలంతో పాటు ప్రతి ఒకరి అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. అవసరాలు పెరిగిన కొలది మనిషి ఆలోచనాలలో కూడా మార్పులు వస్తాయి. అదేవిధంగా ఎలాంటి ఉపాధి లేక ఆగం అవుతున్నా యువత ఆలోచనాలు దారి తప్పి జరుగుతున్నా ఎన్నో అఘాయిత్యాలు,విపరీతమైన వికృత చేష్టలు చూస్తూనే ఉన్నాం.సమాజంలో ఎదురైన అవహేళనలు,కుటుంబంలో ఎదుర్కొనే విమర్శలు,సన్నిహితులు మధ్య విభేదాలు ఇలా ఎన్నో మానసిక సంఘర్షణాల నడుమ నేటి యువత ముందుకెళ్తుందాని చెప్పవచ్చు.

కుటుంబాల ఆర్థికపరిస్థితిని అదుపుచేయలేక,ఆదుకోలేక గొప్ప చదువులు,ఆలోచనలు ఉండి కూలీ పని చేసేందుకు ఆత్మగౌరవం చంపుకొలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిఅవుతూ మత్తుకు,మాదకద్రవ్యాలకు, పలు రకాల వ్యాసనాలకు బానిసలవుతూ జీవితాల పట్ల విరక్తికి,ఆత్మనూన్యత భావాలకు లోనుఅయి ఆత్మహత్యలకు,హత్యలకు, దోపిడిలకు పాల్పడుతున్నారు.గొప్ప ఆలోచనాలు ఉండి,సమాజంపై అవగహన కలిగి ఉండి కూడా సంఘవిద్రోహ శక్తులకు అవసరాలుగా మారే అవకాశాలు లేకపోలేదు.కావున వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకుని పాలకులు సాధ్యమైనంత త్వరగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై ప్రకటనలు చేయాలి.అదేవిధంగా ఉపాధి అవకాశాలకు దారి చూపాలి.దేశమైనా, రాష్ట్రంమైనా అభివృద్ధిలో ముందంజలో ఉండాలంటే యువతే కీలకం. యువత ఆలోచనాల విధానంపై సమగ్రభివృద్ధి ఆధారపడి ఉంటుంది. యువతకు తమ శక్తి సామర్థ్యాల మీద నమ్మకాన్ని,అభిమానాన్ని కలిగించే ప్రయత్నాలు మొదలైనప్పుడే వారి జీవితాల్లో వెలుగులు చూడగల్గుతాం.
– బండి.వంశీకృష్ణ గౌడ్‌
‌రంగయ్యపల్లి, రేగొండ, జయశంకర్‌ ‌జిల్లా
9550837962

Leave a Reply