Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు

దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ జండాను ఎగురవేసే సంకల్పంతో భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తుండడంతో తెలంగాణ రాజకీయాల్లో విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణాదిలో పెత్తనం చెలాయించాలంటే ముందుగా తెలంగాణను చేజిక్కించుకోవాలన్న లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతున్న విషయం తెలియంది కాదు. కర్నాటక తర్వాత తాజాగా మహారాష్ట్రలో అడుగుపెట్టిన బిజెపి ఇప్పుడు తన దృష్టినంతా తెలంగాణపైనే కేంద్రీకృతం చేస్తున్నది. కాంగ్రెస్‌తో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు కూడా వొచ్చే ఎన్నికల్లో  తామే అధికారంలోకి రానున్నట్లుగా శక్తిమేర ప్రచారం చేసుకుంటున్నాయి. ఒక విధంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి అధికార టిఆర్‌ఎస్‌ను చక్రబంధంలో ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. వాస్తవంగా తెలంగాణలో  మొదట్లో భారతీయ జనతా పార్టీకి పెద్దగా చెప్పుకోత•గినంత ఆదరణ లేదన్న విషయం తెలియంది కాదు.

ఎప్పుడైతే రెండు ఉప ఎన్నికలు, జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఆ పార్టీ విజయాలవైపు దూసుకుపోయిందో ఆ పార్టీ లక్ష్యానికి చంపుడు పందెం పుట్టినట్లైంది.  దీంతో ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై మరింత దృష్టిని సారిస్తున్నది. ఇక్కడ విచిత్రకర విషయం ఏమంటే బిజెపి రాష్ట్ర నాయకత్వం అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీని తరుచు విమర్శిస్తుంటే ఆ పార్టీకి చెందిన కేంద్ర నాయకులు, మంత్రులు ఇక్కడికి వొచ్చినప్పుడల్లా రాష్ట్ర పథకాలను మెచ్చుకోవడం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కేంద్ర ప్రభుత్వంతో దూరాన్ని పాటించడంతోపాటు, కేంద్రంపై విమర్శనాస్త్రాలను ఎప్పుడైతే సంధించడం ప్రారంభించాడో, బిజెపి కేంద్ర నాయకత్వం కెసిఆర్‌ను గద్దె దింపి తీరాల్సిందేనన్న పట్టుదలతో ముందుకు కదలడం ప్రారంభించింది. అది మొదలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించిన పలువురు ఉద్యమకారులను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో దాదాపు సఫలీకృతమయింది. దానికి తగినట్లుగా టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత ఇతర పార్టీల నుండి నాయకులను  తీసుకొచ్చి, వారిని అందలం ఎక్కిస్తూ, అసలైన ఉద్యమకారులకు  సిఎం కనీసం ఇంటర్వూ కూడా ఇవ్వని పరస్థితిలో కక్కలేక మింగలేక ఉన్న వారికి బిజెపి మేమున్నామని అభయమివ్వడంతో ఇప్పుడు ఆ పార్టీకి తెలంగాణలో మంచి వాతావరణం ఏర్పడింది. అయితే నిజంగానే తమకెంత బలముందన్న విషయాన్ని తాజాగా రాష్ట్ర రాజధానిలో ఆ పార్టీ మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు అద్దం పట్టాయి.

బిజెపి ఊహించినట్లుగానే ఈ సమావేశాల ద్వారా ఆ పార్టీ ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రులు, నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన ఉపన్యాసాలతో స్థానిక ప్రజల్లో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీరును బేరీజు వేసుకునే అవకాశాన్ని కలిగించినట్లు అయింది.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలా?  లేక రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌చేపట్టిన పథకాలా ఏవి సరైనవి, ఎవరు అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు నిజాలు చెబుతున్నారన్నది ఇప్పుడు ప్రజల్లో చర్చ నీయాంశమయింది. బిజెపిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలేవీ ఇంకా సంఘటితం కాలేకపోవడం కూడా ఆ పార్టీకి కలిసి వొస్తున్న అంశం. ఇంతవరకు దేశాన్ని ఏలిన  బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు ప్రజారంజకంగా పాలించలేకపోయాయి కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీని ఏర్పాటు చేయాలనుకున్న విపక్షాల్లో కూడా  భేదాభిప్రాయాలున్నాయి. తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో  ఆ పార్టీలు ఏ మేరకు ఒకటిగా నిలబడ్డాయన్నది బహిరంగ రహస్యమే. ఇది బిజెపి దూకుడుకు మరింత అవకాశంగా మారింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా ముగియడంతో ఆ పార్టీకి  వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అయింది. దీంతో కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ మీద ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాడు.

ఇందుకోసం అయన ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా సిద్ధంగా ఉండే విధంగా ఆ పార్టీ ఇప్పటి నుండే పకడ్బందీగా ప్రణాళికను రచిస్తుంది. కేవలం జాతీయ కార్యవర్గ సమావేశాలకే నియోజకవర్గాల వారిగా పార్టీ శ్రేణులను దింపిన విషయం తెలియంది కాదు. ఇక ఎన్నికల కోసం బూతుస్థాయి నిర్వాహకులను ఏర్పాటుచేసే పనిలో ఆ పార్టీ ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటికే రెండు విడుతలుగా పాదయాత్ర నిర్వహించినప్పుడు వాటి ప్రారంభమనో, ముగింపు అనో ఏదో ఒక కారణంగా కేంద్ర నాయకత్వం తరుచు తెలంగాణలో పర్యటిస్తూనే ఉన్నది. ఇప్పుడు మరోసారి ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్‌ ‌చేపట్టబోతున్నారు. ఈ సందర్భంతో పాటు, ఇక నుంచి ప్రతీ నెల తప్పకుండా కేంద్ర నాయకులు, ముఖ్యంగా అమిత్‌షా తెలంగాణలో పర్యటించే విధంగా ఏర్పాట్లు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ సంగ్రామ యాత్ర ముగింపు సమావేశం ఉద్యమ ఖిలా అయిన వరంగల్‌లో ఏర్పాట్లు చేయాలనుకోవడం కూడా ఆ పార్టీ ఎత్తుగడలో భాగమేనని తెలుస్తున్నది.

Leave a Reply