Take a fresh look at your lifestyle.

హుజురాబాద్‌లో మారుతున్న సమీకరణాలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, భారతీయ జనతాపార్టీ కండువా కప్పుకోవడంతో హుజురాబాద్‌లో రాజకీయ సమీకరణాల్లో త్వరితగతిన మార్పులు సంభవిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈటలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆయన్ను ఆహ్వానించాయి. అయితే రాష్ట్రంలో అధికారంలోఉన్న టిఆర్‌ఎస్‌ ‌నాయకత్వాన్ని ఎదుర్కునే సత్తా ఇవ్వాళ కేవలం బిజెపికే ఉండడంతో ఆయన ఆ పార్టీ తీర్థం తీసుకున్నారన్న విషయంలో ఏమాత్రం సందేహంలేదు. ఆయన్ను చేర్చుకోవడం వల్ల పార్టీ బలపడడంతో పాటు, తమ పార్టీలో కూడా ఉద్యమ నాయకులున్నారని చెప్పుకునే అవకాశం బిజెపికి ఏర్పడింది. ఈటల ఒంటరిగానే కాకుండా తనతోపాటు మాజీ జడ్పీ చేర్‌ ‌పర్సన్‌ ‌తుల ఉమ, గండ్ర నళినితోసహా దాదాపు మరో మూడు వందల మంది బిజెపిలో చేర్పించారు. ఈ చేరికల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. బిజెపి శ్రేణులు కూడా అమితోత్సహాన్ని చూపిస్తున్నాయి. ఢిల్లీలో పార్టీ కండువ కప్పుకున్న ఈటల హైదరాబాద్‌ ‌శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే బిజెపి శ్రేణులు ఘనంగా స్వాగతించడమే ఇందుకు నిదర్శనం. దీంతో బిజెపి ఊహించినట్లు హుజురాబాద్‌తో పాటు కరీంనగర్‌ ‌జిల్లాలో భాజపాకు మరింత పట్టు చేకూరినట్లైంది. అయితే ఢిల్లీ పెద్దలు ఆయన్ను అహ్వానించినంత సులభంగా స్థానిక నేతలు ఆయన రాకను జీర్ణించుకోలేక పోతున్నారు. ఈటల రాజేందర్‌ను బిజెపిలో చేర్చుకున్న విషయంలో మాజీ మంత్రి, బిజెపి నాయకుడు పెద్దిరెడ్డి కాస్త కినుక వహించారు.

తెలుగుదేశం పార్టీనుండి కొంతకాలం క్రితం బిజెపిలో చేరిన ఆయన హుజురాబాద్‌ ‌టికట్‌పై ఆశపెట్టుకున్నారు. అసలు ఆయన బిజెపిలో చేరినప్పుడే బిజెపి పెద్దలు అక్కడి నుండి టికెట్‌ ఇచ్చే ఒప్పందం జరిగిందనుకుంటున్నారు. అప్పటి నుండి ఆయన ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. ఇప్పుడాయన ఈటల చేరికను జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు తెలియకుండా, తనతో సంప్రదించకుండా ఈటలను ఎలా చేర్చుకున్నారంటూ అధిష్టానంపై అలుకపూనారు. అయితే పార్టీ వర్గాల నుండి ఆయనకు ఏలాంటి సంకేతాలు అందాయోగాని పార్టీలోకి ఎవరు వొచ్చినా, చివరకు కెసిఆర్‌ ‌వచ్చినా అహ్వానిస్తామంటూ మాటమార్చారు. ఏదైనా అంతర్గతంగా తనకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆయన మనస్థాపంతో ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే పార్టీ మారుతారా లేదా అన్నది ముందు ముందు తేలనుంది.

ఇదిలాఉంటే గత ఎన్నికల్లో ఈటలకు కాంగ్రెస్‌ ‌నుండి గట్టిపోటీ ఇచ్చిన కౌశిక్‌రెడ్డినే తిరిగి కాంగ్రెస్‌ ‌పోటీపెడుతుందనుకుంటున్నారు. కౌశిక్‌ ‌రెడ్డికూడా అదే ధీమాతో ఉన్నారు. అయితే ఇటీవల కౌశిక్‌రెడ్డి కెటిఆర్‌తో భేటీ అయినాడన్న వార్త గుప్పుమంది. దీంతో కాంగ్రెస్‌ ‌వర్గాలు అయోమయంలో పడ్డాయి. ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే అవకావం ఇస్తారా? కొత్తవారికెవరికైనా టికెట్‌ ఇస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఒక వేళ కొత్తవారికి టికెట్‌ ఇస్తే కౌశిక్‌రెడ్డి ఊరుకుంటారా, పార్టీలోనే ఉంటారా అన్నది కూడా చర్చనీయాంశమవుతున్నది. కౌశిక్‌ ‌రెడ్డి మాత్రం కెటిఆర్‌ను కలిసిన విషయాన్ని కొట్టిపారేయటంలేదు. తాను కెటిఆర్‌ను కలిసినంత మాత్రాన పార్టీ మారుతానని ఎందుకనుకోవాలని ప్రశ్నిస్తున్నప్పటికీ, ఈటలకు పోటీగా కౌశిక్‌రెడ్డిని తమ పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇచ్చే ఆలోచనలో టిఆర్‌ఎస్‌ ఉన్నదంటూ జరుగుతున్న ప్రచారం మేరకు కాంగ్రెస్‌ ‌టికెట్‌ ఇవ్వకపోతే మాత్రం కౌశిక్‌రెడ్డి పార్టీ మారే అవకాశాలున్నట్లుగా భావిస్తున్నారు.

కాగా, ఈటల బర్తరఫ్‌నుండే ఆ నియోజకవర్గంపైన టిఆర్‌ఎస్‌ ‌ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వొచ్చింది. ట్రబుల్‌ ‌షూటర్‌ ‌మంత్రి హరీష్‌రావుతోపాటు, గంగుల కమలాకర్‌, ‌కెప్టెన్‌ ‌లక్ష్మీకాంతరావు, ఎంఎల్‌ఏ ‌సతీష్‌కుమార్‌లు నియోజకవర్గం పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు చెయ్యిజారి పోకుండా ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా ఇటీవల నియోజకవర్గ అభివృద్ధికి 35 కోట్ల రూపాయల నిధులను కూడా ప్రభుత్వం కేటాయించిందంటేనే ఎట్టి పరిస్థితిలో ఇక్కడ మళ్ళీ తమ పార్టీయే గెలువాలన్న పట్టుదలతో టిఆర్‌ఎస్‌ ఉన్నట్లు స్పష్టమవుతున్నది. దీంతోపాటు ఈటలను ఢీ కొట్టగల సత్తా ఉన్న అభ్యర్థి కోసం పార్టీ వెతుకులాట ప్రారంభించింది. కౌశిక్‌రెడ్డి ఈటలకు ధీటైన వ్యక్తిగా నిన్నటివరకు వినిపిస్తుండగా, ఇప్పుడు మరో కొత్తపేరు వినిపిస్తున్నది. గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా మంచి పేరున్న ముద్దసాని దామోదర్‌రెడ్డి సోదరుడు ముద్దసాని పురుషోత్తమ్‌ ‌రెడ్డి పేరును కూడా టిఆర్‌ఎస్‌ ‌బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలోని కమలాపూర్‌ ‌ప్రాంతానికి చెందిన పురుషోత్తమ్‌ ‌రెడ్డి కుటుంబానికి మంచి పేరుండడమే కాకుండా రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉండడంతో ఆ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు వినికిడి.

Leave a Reply