- పార్టీ బాధ్యతలను నాకు, రేవంత్‌రెడ్డికి అప్పగించండి
- పిసిసి దూతలకు తేల్చి చెప్పిన విజయశాంతి
కాంగ్రెస్ పార్టీ బలోపేతమై, అధికారంలోకి రావాలని బలంగా కోరుకునే వ్యక్తిగా చెబుతున్నా. తక్షణమే పిసిసి చీఫ్‌ను మార్చండి. పిసిసి బాధ్యతలను నాకు, ఎంపి రేవంత్‌రెడ్డికి అప్పగించండి. ఇద్దరం కలిసి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వొస్తుందనీ, తామిద్దరం కచ్చితంగా ప్రభావితం చేయగలుగుతామనీ తనను బుజ్జగించేందుకు వొచ్చిన పిసిసి దూతలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చకుంటే పార్టీ మరింతగా బలహీనపడి ఎవరి దారి వారు చూసుకోవడం తథ్యమని కూడా విజయశాంతి తన వద్దకు వొచ్చిన, తనను పార్టీ మారొద్దంటూ ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్న వారికి కాస్త దూకుడుగానే చెప్పినట్లు తెలుస్తుంది.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న విజయశాంతితో బిజెపి నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి వరుస భేటీలు కావడంతో ఆమె కాంగ్రెస్‌ను వీడి బిజెపిలోకి చేరనున్నట్లు మీడియాలో పెద్దయెత్తున వార్తలు వొస్తున్న విషయం విధితమే. ఈ వార్తలను ఆమె ఔననీ కానీ, కాదనీ కానీ ఎక్కడా కూడా అనలేదు. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా విజయశాంతి వద్దకు కొందరు పిసిసి దూతలు నేరుగా వెళ్లినప్పుడు, మరి కొందరు ఫోన్లో మాట్లాడినప్పుడు మాత్రం విజయశాంతి తన మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తుంది. పిసిసి నేతల వైఖరి వల్లే దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉందనీ విజయశాంతి సదరు దూతలకు తేల్చిచెప్పారనీ అత్యంతమైన విశ్వసనీయవర్గాలు గురువారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయి. రానున్న జిహెచ్ఎంసి, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోగా పిసిసిలో పూర్తిగా సమూల మార్పులు తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, పిసిసిలో మార్పుల్లో భాగంగా పార్టీ బాధ్యతలను తనకు, ఎంపి రేవంత్‌రెడ్డికి అప్పగించి తమ ఇద్దరికీ కార్యచరణను నిర్దేశించడం తప్ప మరో మార్గం లేదనీ విజయశాంతి కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం.