Take a fresh look at your lifestyle.

దేశారాజకీయాల్లో కెసిఆర్‌తోనే మార్పు

  • తెలంగాణ సాధనతో పాటు అభివృద్ధిలో నడిపారు
  • కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌దేశ రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నడుం కట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్‌(‌సెక్యులర్‌) అ‌గ్ర నేత హెచ్‌డి. కుమారస్వామి అన్నారు. దేశంలోభారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ‌గుణాత్మకమైన మార్పు తీసుకు వొస్తుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భావ వేడుకలకు హాజరైన ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఆమరణ నిరాహార దీక్షతో కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని, ఇప్పుడు అన్నిరంగాల్లో అగ్రపథంలో నిలిపారని కుమారస్వామి తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా దళితబంధు, రైతుబంధు వంటి పథకాలను ప్రవేశ పెట్టారని, రికార్డు సమయంలో నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేశారని ఆయన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ప్రశంసించారు. కేసీఆర్‌ ఆలోచనా ధోరణి, ఆయన చిత్తశుద్ధి అద్భుతమని కొనియాడారు. ఈ సందర్భంగా తాను రెండోసారి తెలంగాణ భవన్‌కు వొచ్చానని ఆయన తెలిపారు.

మొదటిసారి దసరా రోజు వొచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌ ‌పేరుకు అంకురార్పణ జరిగిందని, రెండోసారి వొచ్చినప్పుడు ఎన్నికల సంఘం నుంచి బీఆర్‌ఎస్‌కు గుర్తింపు రావడంతో ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయని కుమారస్వామి గుర్తు చేసుకున్నారు. అంతేకాదు కర్నాటకలో జనతాదళ్‌తో కలిసి నడుస్తామని ప్రకటించినందుకు కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశ రక్షణ కోసం జనతాదళ్‌(ఎస్‌) ‌కేసీఆర్‌ ‌వెంటే ఉంటుందని కుమారస్వామి స్పష్టం చేశారు.

Leave a Reply