పార్టీ నేతల శుభాకాంక్షలు
అమరావతి, ఏప్రిల్ 20 : టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయిడు గురువారం 73వ ఏట అడుగిడారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 1950, ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలో నారావారిపల్లెలో జన్మించారు. చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. నవ్యాంధప్రదేశ్ కు తొలి సీఎం అయ్యారు. కాంగ్రెస్ లో సాధారణ కార్యకర్తగా మొదలైన ఆయన ప్రయాణం టీడీపీ అధినేతగా, దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నేతగా పేరు సంపాదించుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, విభజన ఏపీలో ఐదేళ్లు సీఎంగా చంద్రబాబుల పనిచేశారు. ఇక ప్రతిపక్ష నేతగా కూడా అదే రికార్డును కూడా నెలకొల్పారు. దాదాపు పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. పలు సందర్భాల్లో టీడీపీ పని ఖతమని ప్రతిపక్షాలు విమర్శలు చేసినా.. మొక్కవోని ధైర్యంతో పార్టీని నిలబట్టి తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు. ఏడు పదుల వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు దూసుకుపోతున్నారు చంద్రబాబు.టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో సినీమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించిన చంద్రబాబు ఎన్టీఆర్ కుమార్తె నందమూరి భువనేశ్వరిని 1980లో వివాహమాడారు. వీరికి ఉన్న ఏకైక సంతానం నారా లోకేష్. ఈయన ప్రస్తుతం టీడీపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.