Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు

  • తన మనషులకు కాంగ్రెస్‌లో పదవులు ఇప్పిస్తున్నాడు..
  • బిజెపి ధరలు పెంచడం తప్ప దేశానికేమీ చేసింది?
  • కాంగ్రెస్‌ ‌హయాంలో క్రాప్‌లోన్లకు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది
  • గులాబీ జెండాతోనే తెలంగాణాకు సాగు, తాగు నీరు
  • బెజ్జంకి పర్యటనలో మంత్రి హరీష్‌రావు

బిజెపి, టిడిపి, కాంగ్రెస్‌ ‌పార్టీలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు తన్నీరు హరీష్‌రావు తనదైనశైలిలో మండిపడ్డాడు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. నాలుగవ విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ మహిళా సమాఖ్య భవనాన్ని, అలాగే కల్లేపల్లిలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌(అం‌బేద్కర్‌ ‌భవనం), లయన్స్ ‌క్లబ్‌ ఆఫ్‌ ‌బెజ్జంకి తరపున రూ.80 వేల రూపాయల విలువ కలిగిన బాడీ ఫ్రీజర్‌(‌శవ పేటిక)ను కల్లెపల్లి గ్రామ పంచాయితీకి అందజేసిన సందర్భంగా క్లబ్‌ ‌సభ్యులైన మోహన్‌, ‌రవీంద్ర ప్రసాద్‌ను మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ‌మంత్రి హరీష్‌రావు అభినందించారు. అనంతరం కల్లేపల్లి గ్రామ రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంధ్రాబాబు అని తెలంగాణ ప్రజలు వెళ్లగొట్టారన్నారు. టిడిపి ముఖం పెట్టుకుని వొస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్‌లోకి పంపి రాష్ట్రంలోకి చంద్రబాబు అడుగు పెడుతున్నాడనీ, మళ్లీ కాంగ్రెస్‌ ‌ముసుగులో వొస్తున్నారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో చంద్రబాబు తన వాళ్లకు పదవులు ఇప్పిస్తున్నాడనీ, టిపిసిసి చీఫ్‌గా నియమితుడైన రేవంత్‌రెడ్డి ఎవరు? వోటుకు నోటు కేసులో ఉన్నవాళ్లే కదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు టిపిసిసి చీఫ్‌గా వొచ్చాడన్నాడు. కాంగ్రెస్‌ ‌పార్టీ హయాంలో రైతులకు పంట రుణాలు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేదని అన్నారు.

70 ఏళ్లలో కాంగ్రెస్‌, ‌టిపిడి పార్టీ ప్రభుత్వాలు చేయని పనిని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కేవలం ఏడంటే యేడేండ్లలో చేసిందన్నారు. తెలంగాణలోని ఏ చెరువు చూసినా నీటితో నిండి ఉన్నాయనీ, వానలు ఇంకా రాకముందే కాళేశ్వరం నీటితో నిండిపోయిందన్నారు. టిఆర్‌ఎస్‌ ‌జెండా ఎత్తుకున్నాక.. పొలాల్లో నీళ్లు, ఇంటింటికీ తాగునీళ్లు వొస్తున్నాయన్నారు. సిఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వ హయాంలో కాలు బయట పెట్టకుండా రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారనీ, ఎకరానికి 5 వేలు రూపాయలు, విత్తనాలు, నాట్లు, నారుమడి వంటి ఖర్చు కోసం ఇస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా? ఏమీ ఇవ్వకపోగా ధరలు మాత్రం పెంచి పేదల నడ్డీ విరుస్తుందన్నారు. డీజిల్‌ ‌ధర రూ.100 చేసిందన్నారు. రైతు శ్రేయస్సుకై ఎకరానికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం 5 వేల రూపాయలిస్తే డీజిల్‌ ‌ధర పెంచి బిజెపి పార్టీ ప్రభుత్వం రైతుల పైసలు గుంజేసుకుంటుందన్నారు. ఏడేళ్లలో బిజెపి పార్టీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందనీ ప్రశ్నించారు. పేద ప్రజల కోసం ఏం చేసింది. యేడాదిలో 25, 26 రూపాయల పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెంచింది. దీంతో అన్ని ధరలు పెరిగాయన్నారు. కొరోనా కష్ట కాలంలోనూ తాము రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామనీ, ఒక్క గింజ లేకుండా ధాన్యం కొన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణానేననీ అన్నారు.

90 లక్షల మెట్రిక్‌ ‌టన్నులు యాసంగిలో కొన్నామని, ఆంధప్రదేశ్‌లో 24 లక్షల మెట్రిక్‌ ‌టన్నులు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. ఒకప్పుడు ఆంధ్రావాళ్లు తెలంగాణవాళ్లకు వ్యవసాయం రాదని వెక్కిరించారనీ, ఇప్పుడు వెక్కించిరించినవాళ్లే అసూయ పడేలా తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందనీ, దేశంలోని రాష్ట్రాల్లో 2 కోట్ల 2 లక్షల మెట్రిక్‌ ‌టన్నులు పంజాబ్‌ ‌పండించగా, తెలంగాణ 3 కోట్ల మెట్రిక్‌ ‌టన్నులు ధాన్యం పండించి దేశంలో నెంబర్‌ ‌వన్‌ ‌స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారిందన్నారు. తెలంగాణ రాకముందు బెజ్జంకిలో ఎకరం భూమి ధర 4 లక్షలు ఉంటే, రైతుబంధు, కాళేశ్వరం నీరు, ఉచిత విద్యుత్‌ ‌వంటి పథకాలవల్ల ఇప్పుడు 40 లక్షలకు ఎకరం చొప్పున పెరిగిందన్నారు. ఇక్కడ మహిళా భవనాన్ని, అంబేద్కర్‌ ‌భవనాన్ని, రైతు వేదికను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందనీ, బెజ్జంకి మండలంలో 16 గ్రామాలలో మహిళా సమాఖ్య భవనాలు నిర్మించామనీ, కల్లెపల్లి ఒక్కటే మిగిలిందన్నారు. మండలంలో 7 కొత్త గ్రామ పంచాయతీలకు కొత్త పంచాయతీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు అడిగారనీ, ఒక్కో భవనానికి రూ.25 లక్షల చొప్పున రూ.1.75 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

కల్లెపల్లి గ్రామ అభివృద్ధి పనుల కోసం ఒక కోటి రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. బెజ్జంకిలో మార్కెట్‌ ‌యార్డు లేకపోతే రూ.20 కోట్ల రూపాయలతో మార్కెట్‌ ‌యార్డు, గోదాములు, సబ్‌ ‌మార్కెట్‌ ‌యార్డులు ఏర్పాటు చేసుకున్నామనీ, బెజ్జంకి మండలంలో గతంలో గుక్కెడు తాగునీటి కోసం కష్టపడ్డ పరిస్థితి, పంటలు ఎండిపోయే పరిస్థితి, ట్రాన్స్ ‌ఫార్మర్లు పేలుడు, మోటార్లు కాలిపోయే పరిస్థితి ఉండేదన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక గత వేసవిలో ఒక్క గుంట ఎండలేదనీ, ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మిడ్‌ ‌మానేరు నింపి నీళ్లు తెచ్చుకున్నామన్నారు. బెజ్జంకి మండలంలో అభివృద్ధి పనులకై రూ.20 కోట్ల జీవో తీసుకొచ్చి ఇచ్చిన మంత్రి, అభివృద్ధి పనులన్నీ త్వరగా చేయించాలనీ, బిల్లులు సైతం త్వరితగతిన ఇప్పిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ‌జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాధాక్రిష్ణశర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు పెద్దయెత్తున పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి హరీష్‌రావుకు టిఆర్‌ఎస్‌ ‌యూత్‌ ఆధ్వర్యంలో బెజ్జంకి కమాన్‌ ‌నుంచి బెజ్జంకి వరకూ భారీ బైక్‌ ‌ర్యాలీతో డప్పు చప్పులు, బోనాలతో ఘన స్వాగతం పలికారు.

Leave a Reply