- పండగల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే
- నీతి ఆయోగ్ హెల్త్ మెంబర్ డాక్టర్ పాల్
- 71శాతం చిన్నారుల్లో కరోనా యాంటీబాడీలు: చండీగఢ్ మెడికల్ కాలేజీ రీసెర్స్ వెల్లడి
దేశాన్ని కొరోనా ఇంకా వదిలిపెట్టలేదని, థర్డ్‌వేవ్ వొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున నిర్లక్ష్యం తగదని నీతి ఆయోగ్ హెల్త్ మెంబర్ డాక్టర్ పాల్ అన్నారు. 2022లోనూ ప్రజలంతా మాస్క్‌లు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. టీకాల కాంబినేషన్‌పై అధ్యయనం జరగాలన్నారు. దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి అడుగపెడుతుందన్నారు పాల్. అనేక పండగలు ముందున్నాయని…అందుకే జాగ్రత్తగా ఉండడం తప్పనిసరని చెప్పారు. పండగలను కరెక్ట్‌గా మేనేజ్ చేయలేకపోతే…భారీ దెబ్బ తప్పదన్నారు. టీకా కాంబినేషన్, మందులు, క్రమశిక్షణ కలిగిన ప్రవర్తన మాత్రమే కొరోనాను అడ్డుకోగలదని చెప్పారు. కొరోనా వ్యాధి విస్తరణను అడ్డుకోవడానికి మందులు కావాలన్నారు పాల్. త్వరలోనే కొవాగ్జిత్తో పాటు భారత్‌లో అభివృద్ధి చేసిన ఇతర టీకాలకు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ వొస్తుందని నమ్ముతున్నట్టు పాల్ చెప్పారు. అయితే థర్డ్ వేవ్ వొచ్చే అవకాశాన్ని కొట్టిపారేయ లేమన్నారు. అయితే వొచ్చే మూడు, నాలుగు నెలల్లో వ్యాక్సినేషన్ ద్వారా డెవలప్ అయ్యే ఇమ్యూనిటీ కొరోనాను అడ్డుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
71శాతం చిన్నారుల్లో కొరోనా యాంటీబాడీలు: చండీగఢ్ మెడికల్ కాలేజీ రీసెర్స్ వెల్లడి
కొరోనా మూడోముప్పు చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలు నివేదికల్లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) నిర్వహించిన సీరో సర్వేలో ఆశాజనక ఫలితాలు వెలువడ్డాయి. రానున్న ముప్పు గురించి మరీ అంత ఆందోళన అవసరం లేదని తేలింది. 2,700 మంది చిన్నారుల నమూనాలను పరీక్షించగా..71 శాతం మందిలో కొరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. దీనిపై పీజీఐఎంఈఆర్ డైరెక్టర్ డాక్టర్ జగత్ రామ్ మిడియాతో మాట్లాడుతూ..‘మనం కొరోనా మూడో వేవ్ ప్రారంభ దశలో ఉన్నాం. 2,700 మంది చిన్నారులపై పీజీఐఎంఈఆర్ సీరో సర్వే నిర్వహించగా.. 71 శాతం మందిలో కొరోనా యాంటీబాడీలు కనిపించాయి.
మూడో ముప్పు పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపదని దీన్నిబట్టి తెలుస్తుంది’ అని జగత్ రామ్ వెల్లడించారు. చండీగఢ్, మురికివాడలు, గ్రామిణ, పట్టణ ప్రాంతాల నుంచి ఈ నమూనాలను సేకరించినట్లు తెలిపారు. అలాగే దిల్లీ, మహారాష్ట్ర నుంచి వెలువడిన సీరో సర్వేల్లో కూడా 50 నుంచి 75 శాతం మంది చిన్నారుల్లో యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది. ‘మనదేశంలో చిన్నారులకు టీకా అందుబాటులో లేదు. కొరోనా సోకిన కారణంగానే వారిలో యాంటీబాడీలు కనిపించాయి. దీన్నిబట్టి మూడో ముప్పు పిల్లల్ని ప్రభావితం చేస్తుందని నేను భావించడం లేదు’ అని అభిప్రాయపడ్డారు. అలాగే ఆరు నుంచి 10 శాతం మందిలో బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్ను గుర్తించినట్లు చెప్పారు. బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్ వొచ్చినప్పటికీ.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు.