Take a fresh look at your lifestyle.

రెండు స్వప్నాల మధ్య సంఘర్షణ..!

“గాంధీ వర్సెస్‌ ‌గాడ్సే మధ్య. అంటే రెండు రకాల స్వప్నాల మధ్య సంఘర్షణ ఇది. భారతదేశంలో రెండు రకాల స్వప్నాలు స్వతంత్ర కాలం నుంచీ కొనసాగుతున్నాయి. ఓ దృష్టి కోణం భారత దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి. ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి.  హిందువులు ఆధిపత్యంలో ఉండి, హిందువుల దయాదాక్షిణ్యంపైన ఆధారపడి ఇతరులు బ్రతకాలి. ఒకరు ఇంటి ఓనర్‌గా, మరొకరు కిరాయి ఇచ్చి  అద్దెకు ఉంటున్న వారిగా ఈ దేశంలో  కొనసాగాలి. ఇక గాంధీ ఠాగూర్‌, ‌మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌, ‌జవహర్లాల్‌ ‌నెహ్రూ కలలు కన్న భారతదేశం మరో దృష్టికోణం.”

“సుప్రీమ్‌కోర్టు రాజ్యాంగం పరిరక్షక పాత్రలో ఉండాలని ఆశించాను. కానీ సుప్రీంకోర్టు పరిస్థితి డోలాయమానంగా కనిపించింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఏ తీరుగా వ్యవహరించిందో అదే తీరున వ్యవహరించింది. సుప్రీంకోర్టుకు రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ఉంది. ఆ బాధ్యత సుప్రీంకోర్టు చేయనప్పుడు, ప్రజలే ఆ బాధ్యతలు నెరవేరుస్తారు.
-‌యోగేంద్ర యాదవ్‌”

Gandhi Tagore, Maulana Abul Kalam Azad, Jawaharlal Nehru
దేశ వ్యాపితంగా జరుగుతున్న సిఏఏ-ఎన్‌ఆర్‌సి-ఎన్‌ఆర్‌పిల నిరసన ప్రదర్శనలను యోగేంద్ర యాదవ్‌ ‌రెండు స్వప్నాల మధ్య జరుగుతున్న యుద్ధం అంటారు. యోగేంద్ర యాదవ్‌ ‌తొలినాళ్ళలో అరవింద్‌ ‌కేజ్రీవాల్‌తో పాటు నడిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు… ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆల్టర్నేటివ్‌ ‌పాలిటిక్స్ అన్నమాటను పక్కన పెట్టేసాక, ఆ పార్టీకి దూరమై సొంతంగా స్వరాజ్‌ ‌పార్టీని పెట్టారు. స్వరాజ్‌ ‌పార్టీ తరఫున ఆయన దేశవ్యాప్తంగా జరుగుతున్న సిఏఏ-ఎన్‌ఆర్‌సి-ఎన్‌ఆర్‌పిల నిరసన ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. జనవరి 30వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజలు మానవహారంగా ఏర్పడి సిఏఏ-ఎన్‌ఆర్‌సి-ఎన్‌ఆర్‌పిలకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చెమట చుక్కలు యోగేంద్ర యాదవ్‌ను ఇంటర్వ్యూ చేశాయి.

చెమట చుక్కలు :- దేశంలో రెండు రకాల స్వప్నాలు ఉన్నాయని, ఆ రెండు స్వప్నాల మధ్య జరుగుతున్న సంఘర్షణ నేడు దేశంలో చూస్తున్నాం అని మీరు ఎందుకు అంటున్నారు?

యోగేంద్ర యాదవ్‌ :- ‌సిఏఏ-ఎన్‌ఆర్‌సి-ఎన్‌ఆర్‌పిల నిరసన ప్రదర్శనలను ఒక ప్రాంతం, ఒక మతం లేదా రాజకీయ పార్టీలు లేదా అధికార పార్టీ అపోజిషన్‌ ‌పార్టీల మధ్య జరిగే సంఘర్షణగా చూడడం అనేది సరైన నిర్ధారణ కాదు. వీటన్నిటి మధ్య సంఘర్షణ ఉన్నమాట కొంతవరకు నిజం. అయితే అసలైన సంఘర్షణ జరుగుతున్నది మాత్రం, గాంధీ వర్సెస్‌ ‌గాడ్సే మధ్య. అంటే రెండు రకాల స్వప్నాల మధ్య సంఘర్షణ ఇది. భారతదేశంలో రెండు రకాల స్వప్నాలు స్వతంత్ర కాలం నుంచీ కొనసాగుతున్నాయి. ఓ దృష్టి కోణం భారత దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి. ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి. హిందువులు ఆధిపత్యంలో ఉండి, హిందువుల దయాదాక్షిణ్యంపైన ఆధారపడి ఇతరులు బ్రతకాలి. ఒకరు ఇంటి ఓనర్‌గా, మరొకరు కిరాయి ఇచ్చి అద్దెకు ఉంటున్న వారిగా ఈ దేశంలో కొనసాగాలి. ఇక గాంధీ ఠాగూర్‌, ‌మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌, ‌జవహర్లాల్‌ ‌నెహ్రూ కలలు కన్న భారతదేశం మరో దృష్టికోణం. దీనిప్రకారం, భారతదేశంలో మతం రాజ్యం రెండు వేరు వేరు అంశాలుగా ఉంటాయి. ఎవరి పూర్వీకుల అస్తికలు ఈ మట్టిలో ఖననం అయి ఉన్నాయో వారందరిదీ భారత దేశం. ఎవరైతే భారతీయ తత్వాన్ని నరనరాలలో జీర్ణించుకుని ఉన్నారో వారందరిది భారతదేశం. ఈ రెండు ఆలోచనల మధ్య జరుగుతున్న ఘర్షణే నేటి నిరసనలు. ప్రస్తుత సిఏఏ-ఎన్‌ఆర్‌సి-ఎన్‌ఆర్‌పి చట్టాల ద్వారా గాడ్సే కలలు కన్నా భారత దేశ స్థాపనకై ప్రయత్నం జరుగుతున్నది. ప్రస్తుత చట్టాలు అమలు అయితే భారతదేశంలో రెండు రకాల పౌరసత్వం ఉంటుంది. ఒకరు ఇంటి ఓనర్లు పౌరసత్వంతో ఉంటే మరొకరు కిరాయి ఇచ్చి అద్దెకు ఉండే పౌరసత్వంతో వుంటారు. ఈ తరహా పౌరసత్వానికి ఎంత మాత్రం సిద్ధంగా లేము. నిరసనలు చేస్తున్న మేము గాంధీతో నిలబడి ఉన్నాం. మాకు జిన్నా ఆలోచనలతో సంబంధం లేదు. విభజన ఆలోచనలను మేము ఎంత మాత్రం సహించం. నాకు పూర్తి నమ్మకం ఉంది. గాంధీ కలలు భారతదేశం మట్టి నుండి పుట్టాయి. గాంధీ స్వప్నాలు జయిస్తాయి. గంగా యమునా సంస్కృతి గెలుస్తుంది. కబీర్‌ ‌గెలుస్తారు. గాంధీ జయిస్తారు.

చెమట చుక్కలు:- మీరు ఇంత ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అయితే 140 పిటిషన్లు సుప్రీంకోర్టులో ఫైల్‌ అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో మీరు ఆశించిన ఫలితాలు రాలేదు. అత్యున్నత న్యాయస్థానం చట్టాన్ని నిలుపుదల చేయాలని ఆర్డర్‌ ఇవ్వలేదు. ఈ అంశాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు..?
యోగేంద్ర యాదవ్‌ :- ‌సుప్రీంకోర్టు చట్టం నిలుపుదల అంశంపై నెల రోజుల తర్వాత పరిశీలిస్తాం అన్నది. నెల రోజుల తర్వాత సుప్రీంకోర్టు ఏం చెబుతుంది అన్నది అప్పుడే ఊహించటం కరెక్ట్ ‌కాదు. అయితే ఒక విషయం తప్పకుండా ఒప్పుకుంటాను. సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు వల్ల నిరాశకు గురి అయ్యాను. ఎందుకంటే ప్రస్తుత చట్టం తొమ్మిదవ తరగతిలో చదివిన రాజ్యాంగం, సివిక్స్, ‌రాజకీయ శాస్త్రం అవగాహన మేరకు చెప్పవచ్చు ఈ చట్టం భారతదేశ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని. దేశ రాజ్యాంగాన్ని అనుసరించి తెచ్చిన చట్టం కాదని ఇంత స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు సుప్రీం కోర్టు చట్టంపై స్టే విధించక పోవటం దురదృష్టం. ప్రాథమిక అవగాహన మేరకు సుప్రీంకోర్టు తొలుత ఈ చట్టంపై స్టే విధిస్తూ ఆర్డర్‌ ‌పాస్‌ ‌చేసి ఉంటే బాగుండేది. స్టే విధించిన అనంతరం మిగతా పిటిషన్స్ అన్ని కూడా పరిశీలిస్తుందని ఆశించాను. కోట్లాది భారతీయులు చింతలో ఉన్నారు. తమ పౌరసత్వం ఉంటుందా.. ఊడుతుందా.. అన్న బెంగలో ఉన్నారు. కోట్లాది ప్రజలు మా దగ్గర కాగితాలు లేవు మా గతేం కాను అన్న బాధలో ఉన్నారు. ఇటువంటి ప్రజలకు సుప్రీంకోర్టు భరోసా ఇచ్చి ఉంటే బాగుండేది. చింతలో ఉన్న ప్రజలకు గనుక సుప్రీంకోర్టు భరోసా ఇచ్చి ఉంటే సుప్రీంకోర్టు ప్రతిష్ట పెరిగేది. కానీ సుప్రీంకోర్టు అలా వ్యవహరించలేదు. సుప్రీంకోర్టు రాజ్యాంగం పరిరక్షక పాత్రలో ఉండాలని ఆశించాను. కానీ సుప్రీంకోర్టు పరిస్థితి డోలాయమానంగా కనిపించింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఏ తీరుగా వ్యవహరించిందో అదే తీరున వ్యవహరించింది. సుప్రీంకోర్టుకు రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ఉంది. ఆ బాధ్యత సుప్రీంకోర్టు చేయనప్పుడు, ప్రజలే ఆ బాధ్యతలు నెరవేరుస్తారు.

చెమట చుక్కలు :- మీరు గత కొన్ని గంటలుగా రానున్న కాలంలో చేయనున్న ప్రదర్శనలు గురించి మీతో పాటు ఉన్న సామాజిక కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. మీ వంటి వారు ఫ్రంట్‌ ‌రోలో నడుస్తున్నప్పటికీ తరచూ వినిపించే మాట ప్రస్తుతం జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు నేతృత్వం లేమి ఉంది ఈ విషయాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు..?
యోగేంద్ర యాదవ్‌ :- ‌మీరన్నది నిజమే.. ప్రస్తుత ఆందోళన నిరసన కార్యక్రమాలకు నేతృత్వం లేమి ఉంది. నేతృత్వం లేమి ఉండటం మంచి పరిణామమే.. గమనించాల్సిన విషయం ఏంటంటే మేము మీ పరిరక్షకులం అని చెప్పి రాజకీయం చేసే రాజకీయ పార్టీలను ప్రజలు నమ్మడం లేదు.. అస్సాంలో ప్రజలు కొనసాగుతున్న రాజకీయ నేతృత్వాన్ని కాదని స్వతంత్రంగా ఆందోళనలు చేస్తున్నారు. అలాగే ముస్లిం సమాజం సాంప్రదాయబద్ధమైన ముస్లిం సమాజ పరిరక్షక ముస్లిం నేతృత్వాన్ని ముస్లిం సమాజం తిరస్కరించింది. నేడు మీరు చూస్తున్నారు మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మహిళలంతా రాజకీయ పార్టీల పిలుపు మేరకు రోడ్లపైకి రాలేదు. స్వతస్సిద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజకీయ పార్టీల మీద వీరికి నమ్మకం లేదు. సామాజిక కార్యకర్తలకు కూడా వీరికి నేతృత్వం వహించాలి అన్న కోరిక లేదు. నిజం చెప్పాలంటే వీరికి నేతృత్వం వహించే అంత శక్తి మాకు లేదు కూడా. అంతిమంగా ఈ ఆందోళనకు నేతృత్వం లేమి అసెట్‌ అవుతుందే తప్ప మైనస్‌ ‌కాదు చూడండి. ప్రజలకు ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం లేదు అంచేత ప్రజలు రాజకీయ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. అంచేత ప్రస్తుతం మేము చేయగలిగింది, ఆందోళన కార్యక్రమాలలో ఉన్న ఎనర్జీని కాపాడటం. ఈ ప్రస్తుత ఆందోళన కార్యక్రమాలు దిశ తప్పిపోకుండా కాపాడుకోవటం. అందుకోసమే జనవరి 30వ తారీఖున సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలకు దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని మానవహారంగా ఏర్పడి, దేశాన్ని విభజించే వారు వాళ్లయితే..దేశాన్ని కలిసికట్టుగా ఉంచే వారం మేము అని నినాదించాలని కోరుతున్నాం.

చెమట చుక్కలు :- మీకు తెలుసు ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి ఆజాదీ నినాదం దేశద్రోహ నినాదం అని ప్రకటించారు.. ఈ నేపథ్యంలో మీరు చేపట్టే ఆందోళన కార్యక్రమాలలో ఆజాదీ నినాదం వినపడుతుందా..?
యోగేంద్ర యాదవ్‌ :- ‌కచ్చితంగా మేం చేపట్టే నినాదాలలో ఆజాదీ నినాదం మారుమోగుతుంది.. స్వతంత్ర పోరాటం జరుగుతుంటే ఆ పోరాటానికి దూరంగా ఉంటూ ఇళ్లల్లో గొంగలి కప్పుకుని విశ్రాంతి తీసుకున్న వారి వారసుడు ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి. అందుకే ఆయనకు ఆజాదీ నినాదం విలువ తెలియదు.. ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి పూర్వీకులు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వారు. అంచేత వారు రాజ్యాంగాన్ని చదవలేదు. అందుకే వారికి ఆజాదీ అంటే భారతదేశం నుంచి ఆజాదీ అన్నట్లు అర్థమవుతుంది. భారత రాజ్యాంగం ప్రస్తావన ఆజాదీ పదంతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19, 21‌లో ఆజాదీ పదం గురించి మాట్లాడుతాయి. భారత రాజ్యాంగం భారతదేశంలోని ఆజాదీ గురించి మాట్లాడుతుంది.. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన భారత రాజ్యాంగంలో ఉన్న ఆజాదీని డిమాండ్‌ ‌చేస్తున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం ఆజాదీ కావాలన్నా కోరిక దేశవ్యాపితంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతాను. వీరివలన కొంతమందికి మాత్రమే పరిమితమైన ఆజాదీ నినాదం, దేశవ్యాపితంగా మార్మోగుతున్నది. ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వ్యాఖ్యల తర్వాత ఆజాదీ నినాదం ఉత్తర ప్రదేశ్‌ ‌గ్రామాలలో మరింత గట్టిగా మారు మోగుతోంది.

చెమట చుక్కలు :- ప్రస్తుత ఆందోళన కార్యక్రమాలలో ఆడవారిని ముందుకు పంపించి మగవారు ఇళ్లల్లో గొంగళ్ళు కప్పుకుని పిరికి పందలాగా ప్రవర్తిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.
యోగేంద్ర యాదవ్‌ :- ‌వీరికి ఎప్పటికీ అర్థం కాదు మహిళ తన సొంత ఆలోచనలతో ఉంటుందని. మహిళలు ఏమి చేసినా గాని వారి వెనక ఎవరిదో ప్రోద్బలం ఉంటుందని వీరు భావిస్తారు.. నేను వీరికి ఇచ్చే సలహా రండి మహిళలతో మాట్లాడండి. అప్పుడు మీ మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి ఒకసారి సమయం కుదుర్చుకుని షాహీన్‌ ‌బాగ్‌ ‌వస్తే మంచిది. అక్కడి మహిళలతో మాట్లాడితే అర్థమవుతుంది వారెందుకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. వీరికి వివరంగా షాహీన్‌ ‌బాగ్‌ ‌మహిళలు చెప్పగలుగుతారు. ఆందోళన కార్యక్రమంలో మొదట పురుషులు వచ్చినప్పుడు..వీరి ఇళ్ళల్లో ఉండే మహిళలు మాకు మద్దతుగా నిలుస్తున్నారు అని ప్రకటించారు. ఇప్పుడు మహిళలే ఆందోళన కార్యక్రమాలకు వస్తూ ఉంటే, పురుషులు వెనక ఉండి మహిళలను పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మహిళలు పురుషులు ఇద్దరూ కలిసి వస్తుంటే పిల్లల్ని వదిలేసి వస్తున్నారని అర్ధరహితమైన వ్యాఖ్యలు చేస్తారు. పిల్లలు కూడా ఆందోళన కార్యక్రమాలకు వస్తే, పిల్లలు ఆందోళన కార్యక్రమాలకు రావడమేమిటి అని ప్రశ్నిస్తారు.. వీళ్ళ మాటలకు అర్థం లేదు. అని యోగేంద్ర యాదవ్‌ ఇం‌టర్వ్యూ ముగించారు.

Tags: Chamatachukkalu articles, yogendra yadav, arvindh kejriwal, Gandhi vs. Godse,

Leave a Reply