న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన యాజమాన్య ప్రతినిధి
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం ఇండియన్ జర్నలిస్టస్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్య్లుజె) మద్దతుతో ఆంధ్రభూమి ఉద్యోగుల అసోసియేషన్ నిర్వహించిన చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతమైంది. ఉద్యోగుల నినాదాలతో సికింద్రాబాద్‌లోని సరోజినీదేవి రోడ్డు దద్దరిల్లిపోయింది. దక్కన్ క్రానికల్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా ఆ పత్రిక యాజమాన్యాన్ని హడలెత్తించింది.
ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసులు బలగాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రదర్శనకు ముందు క్లాక్ టవర్ వద్ద అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఆంధ్రభూమి ఉద్యోగుల సమస్య రెండు తెలుగు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున ఆంధప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టస్ (ఏపీయూడబ్ల్యుజె), తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టస్ అసోసియేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టస్ (హెచ్‌యూజే) సంఘాలు మద్దతు తెలిపాయి.
ఐజేయూ నాయకులు కె.శ్రీనివాసరెడ్డి, అమర్నాథ్, అంబటి ఆంజనేయులు, ఆలపాటి సురేశ్, సోమసుందర్, టీయూడబ్ల్యుజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ధుదాస్ శ్రీకాంత్, నేతలు ఎ.రాజేశ్, కె.రాములు, హెచ్‌యుజె కార్యదర్శి శిగ శంకర్ గౌడ్, టిఎస్పిజెఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, హరి, ఆంధ్రభూమి ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్, నాయకులు విజయ్ ప్రసాద్, జెఎస్ఎం మూర్తి, స్వామినాథ్, నగేశ్, వసుంధర, ఆదిలక్ష్మి, రిటైర్డ్ ఎంప్లాయిస్ నాయకులు బాలకృష్ణ, నర్సింగ్‌రావు, శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేస్తాం
ఆంధ్రభూమి ఉద్యోగుల పోరాటంపై యాజమాన్యం దిగివచ్చింది. యాజమాన్య ప్రతినిధి, డిప్యూటీ సిఈవో పిఎస్వి కృష్ణయ్య యూనియన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు చట్టపరంగా దక్కాల్సిన అన్ని ప్రయోజనాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామనీ, ఈ వ్యవహారం ఎన్‌సిఎల్‌టిలో ఉన్నందున తుది తీర్పు వచ్చాక తమ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగిస్తామన్నారు. త్వరలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.