Take a fresh look at your lifestyle.

సవాళ్లు…ప్రతి సవాళ్లు…మాటల ‘వార్‌’

  • మునుపెన్నడూ లేనంతగా దూషణలు
  • ఫిర్యాదులతో కలెక్టర్‌ ‌బదిలీ
  • అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులొడ్డిన నేతలు
  • టిఆర్‌ఎస్‌లో అన్నీ తానైన మంత్రి హరీష్‌రావు
  • హీట్‌ ‌హీట్‌గా…హాట్‌ ‌హాట్‌గా దుబ్బాక బై పోల్స్ ‌ప్రచారం
  • ప్రచారంలో హైలైట్‌గా దుబ్బాక బస్టాండ్‌
  • ఆదివారం సాయంత్రంతో ప్రచారం సమాప్తం

సవాళ్లు….ప్రతి సవాళ్లు..మాటల ‘వార్‌’. ‌పదవులకు రాజీనామాలు..ముక్కు నేలకు రాస్తావా అంటూ… వ్యక్తిగత విమర్శలు, దూషణలు… టిఆర్‌ఎస్‌-‌బిజెపి పార్టీ నేతల మధ్య ఓ చిన్నపాటి యుద్ధం. జిల్లా అధికార యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్‌, ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తీరుపై కేంద్రంలోని బిజెపి పార్టీ తీవ్రమైన అభియోగాలు. అధికారులపై ఆరోపణలు, ఫిర్యాదులు..వెరసి జిల్లా పాలనాధికారి ఆకస్మిక బదిలీ. పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సంగతి ఎన్నికలయ్యాక తేలుస్తామంటూ శపథాలు..ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుల నియామకాలు..కేంద్ర బలగాలు. ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం పార్టీల నేతలు సర్వశక్తులొడ్డటం. ఒక మాటలో చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా దుబ్బాక ఉప ఎన్నిక వేళ…టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల అభ్యర్థుల మధ్యన కాకుండా నేతల మధ్య చిన్నపాటి కురుక్షేత్ర యుద్ధమే నడిచిందని చెప్పాలి. అయితే, గత నెల రోజులుగా హోరా హోరీగా సాగిన ఆయ పార్టీల అభ్యర్థులు, నేతల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనున్నది. ఎన్నికల ప్రచారానికి కేవలం మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఆయా పార్టీ నేతలు వారి వారి పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారాన్ని మరింతగా ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై మాటల తూటాల్ని పేలుస్తూనే ఉన్నారు. ఒకసారి ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే… గత నెల 9న నామినేషన్ల పక్రియ ప్రారంభం కావడంతో మొదలైన దుబ్బాక బై పోల్‌ ‌దంగల్‌ ‌ప్రచార పర్వం ఆదివారం సాయంత్రంతో సమాప్తం కానున్నది. నవంబర్‌ 3‌న పోలింగ్‌ ‌జరగనున్నది.

పోలింగ్‌కు సంబంధించి అధికార యంత్రాంగం దాదాపుగా ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రచార వేళ…అధికార యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ బై ఎలక్షన్‌ ‌పోలింగ్‌ను చాలా సజావుగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక అధికారుల డైరెక్షన్‌లో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా పకడ్బందీ ఏర్పాట్లను చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే, ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలు మాత్రమే అవకాశం ఉండటంతో.. ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాలకు, వ్యూహాలకు మరింత పదునుపెట్టాయి. టిఆర్‌ఎస్‌, ‌బిజేపీ పార్టీల నేతలు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. కాంగ్రెస్‌ ‌కూడా నియోజకవర్గంలో బాగానే ప్రచారం చేసింది. అయితే దుబ్బాక ఎన్నికల రణరంగంలో…బిజెపితో పోలిస్తే కాంగ్రెస్‌ ‌కాస్త ప్రచారంలో వెనుకబడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ తరపున మాజీమంత్రి, దివంగత ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్త మొదలుకుని పిసిసి చీఫ్‌ ‌వరకు ప్రతి ఒక్కరూ ఐక్యతగా, కలిసికట్టుగా, సమన్వయంతో దుబ్బాకలోనే మకాం వేసి పని చేయడంతో ప్రచారం ప్రారంభమైన మొదట్లో కాంగ్రెస్‌ ‌పార్టీ టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ, ఎప్పుడైతే పోలీసులు బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు వాహనాన్ని త•నిఖీలు, సిద్ధిపేటలోని ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు చేయడంతో సీన్‌ ‌కాస్త రివర్సయింది. డబ్బుల ఎపిసోడ్‌, ‌సిద్ధిపేటకు వొచ్చిన బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌పట్ల సిపి ఆధ్వర్యంలోని పోలీసులు వ్యవహరించిన తీరుతో ఒక్కసారిగా బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీల మధ్య మాటల యుద్ధం సాగడంతో సీన్‌ ‌పూర్తిగా మారిపోయింది.

సిపి తీరును నిరసిస్తూ బిజెపి చీఫ్‌ ‌బండి దీక్షకు దిగడం, ఆయన అంతు తేలుస్తానంటూ శపథం చేయడం…సీన్‌లోకి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా రావడం…మరో సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రంగంలోకి దిగడం..జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ట్రయాంగిల్‌ ‌ఫైట్‌ ‌కాస్త టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీల మధ్య ద్విముఖ పోటీగా మారింది. తనిఖీలు, సోదాలతో టిఆర్‌ఎస్‌కు పోటీ కాంగ్రెస్‌ ‌నుంచి టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీల మధ్యన పోటీగా మారడంతో…టిఆర్‌ఎస్‌ ‌నేతలు ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల్లో అన్నీ తానై ప్రచారాన్ని నిర్వహించిన మంత్రి హరీష్‌రావు బిజెపి నేతలను లక్ష్యంగా చేసుకుని సవాళ్లు విసరడం మొదలుపెట్టారు. బిజెపి నేతలు కూడా టిఆర్‌ఎస్‌ ‌పార్టీని లక్ష్యంగా చేసుకుని చర్చకు సిద్ధమంటూ సవాల్‌ ‌విసరడం మొదలుపెట్టారు. దీంతో ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ‌ప్రచారానికి అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే, కాంగ్రెస్‌ ‌పార్టీకి అంతగా ప్రాధాన్యత లేకుండా చేయడం కూడా టిఆర్‌ఎస్‌ ‌వ్యూహంలో భాగమే అనే అభిప్రాయం కూడా ఉంది. కాంగ్రెస్‌ ‌తరపున బరిలోకి దిగిన శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గంలో చాలావరకు గుర్తింపు ఉంది. దీనికితోడు ఈ దఫా కాంగ్రెస్‌ ‌నాయకత్వమంతా దుబ్బాకలోనే మకాం వేసి ప్రచారాన్ని నిర్వహించింది. కాంగ్రెస్‌ ‌నాయకత్వం సమన్వయంతో కలిసి పనిచేయడం, కాంగ్రెస్‌ అభ్యర్థికి తన తండ్రి ముత్యంరెడ్డి చేసిన పనులు కలిసొచ్చే అవకాశం ఉండటం కారణంగానే కాంగ్రెస్‌ ‌గురించి పెద్దగా అంతా చర్చ జరగకుండా…టిఆర్‌ఎస్‌ ఎక్కువగా బిజెపిని టార్గెట్‌ ‌చేసిందన్న అభిప్రాయం లేకపోలేదు.

టిఆర్‌ఎస్‌, ‌బిజెపి ద్విముఖ పోటీలో తమకు లబ్ది కలగడంతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థిని దెబ్బకొట్టొచ్చన్నది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే టిఆర్‌ఎస్‌ ‌తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి హరీష్‌రావు బిజెపినే ఎక్కువగా విమర్శించారు. ముత్యంరెడ్డి ఉన్నప్పుడు విద్యుత్‌ ‌ట్రాన్స్‌ఫార్మర్‌కు 30వేల రూపాయలు తీసుకునేవాడనీ ఒకట్రెండు సందర్భాలలో విమర్శించడం మినహా కాంగ్రెస్‌ ‌పార్టీని, ఆ పార్టీ అభ్యర్థిని శ్రీనివాసరెడ్డిని పెద్దగా విమర్శించిన దాఖలాలు కనిపించలేదు. ఈ కారణంగానే కాంగ్రెస్‌ ‌నేతలు దుబ్బాకలో పర్యటించిన ప్రచారం చేస్తున్నా…ఉప ఎన్నికల ప్రచార హోరు మొత్తం టిఆర్‌ఎస్‌, ‌బిజెపి మధ్యే నడిచిందని చెప్పొచ్చు. ఈ ప్రచారంలో అన్నింటికంటే హైలెట్‌ ‌దుబ్బాక బస్టాండ్‌ ‌నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బీడీ కార్మికుల పింఛన్‌ ‌డబ్బులపై బిజెపి చేసిన ప్రచారంపై మంత్రి హరీష్‌రావు డబ్బులపై చర్చకు దుబ్బాక పాత బస్టాండ్‌ ‌వద్దకు రావాలంటూ మంత్రి హరీష్‌రావు బిజెపి చీఫ్‌ ‌బండికి సవాల్‌ ‌విసురడంతో ఈ ఉప ఎన్నికల్లో దుబ్బాక పాత బస్టాండ్‌ ‌చాలా పాపులరైంది. మంత్రి హరీష్‌రావు సవాల్‌తో ప్రచారానికి వొచ్చిన ఆయా పార్టీల నేతలు బస్టాండ్‌ను సందర్శించడం, బస్టాండ్‌ ‌వద్ద ఫోటోలో దిగి సోషల్‌ ‌మీడియాలో పెట్టడంతో ఈ ఉప ఎన్నికల్లో దుబ్బాక బస్టాండ్‌ ‌హైలెట్‌గా నిలిచింది. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో దుబ్బాక ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో హోరా హోరీగా సాగిన దుబ్బాక బై ఎలక్షన్‌ ఆయా పార్టీల మధ్యన టఫ్‌ ‌ఫైట్‌గా ఉందనే చెప్పాలి. అంతేకాదు, దుబ్బాకలో ఎవరిపై ఎవరు ఎక్కువగా పైచేయి సాధిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Leave a Reply