Take a fresh look at your lifestyle.

రేవంత్‌ ‌రెడ్డి ముందున్న సవాళ్ళు..

కాంగ్రెస్‌ ఏమాత్రం మారలేదు. అప్పుడెలా ఉందో..ఇప్పుడూ అలానే ఉంది. అదే అసమ్మతి రాగాలు..అవే హెచ్చరికలు.. అవే బుజ్జగింపులు.. అంతా అర్థమైనట్లే ఉంటుంది.. కానీ ఏం అర్థం కాదు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్‌లో కొత్త సంచలనం. తెలంగాణ పీసీసీకి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన తర్వాత పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఒక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌చరిత్ర నెమరు వేసుకుంటే పిసిసి అధ్యక్షునిగా ఎవరు ఉన్నా శిరోభారాలు, అసమ్మతి గళాలు తప్పలేదు. పార్టీ అధికారంలో ఉంటే కొంత సర్దుకుపోవడం, లేకుంటే రచ్చకెక్కడం ఆనవాయితీనే. ముఖ్య మంత్రులకు పిసిసి అధ్యక్షులకు మధ్య కూడా సత్సంబంధాలు లేని ఉదంతాలెన్నో. ఇలా పీసీసీ ప్రకటన వొచ్చిందో లేదో.. అలా మాజీ ఎమ్మెల్యే.. మేడ్చల్‌ ‌నియోజకవర్గం ఇంచార్జ్ ‌కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్‌) ‌పీసీసీ కార్యవర్గంపై అసంతృప్తి వ్యక్తం చేసి రాజీనామా చేశారు. అగ్గి మీద గుగ్గిలం వేసినట్లు సీనియర్‌ ‌నాయకుడు, ఎంపి కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ ‌రాజకీయం భగ్గుమంది. మరో సీనియర్‌ ‌నాయకుడు మర్రి శశిధర్‌ ‌రెడ్డి పార్టీలో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముందునుంచే ఆగ్రహావేశాలు కురిపించిన విహెచ్‌ ‌పూర్తి మౌనం పాటించి అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరారు.

పార్టీ బలహీనంగా ఉన్న చోట పార్టీని పటిష్టపరిచేందుకు నడుం బిగించి అవసరమైన చోట రాష్ట్ర స్థాయిలోనూ పార్టీ నాయకత్వాన్ని మార్చి వారి స్థానాల్లో మరొకరికి అవకాశం కల్పించాలని నిర్ణయించిన ఫలితమే రేవంత్‌కు పిసిసి పట్టం కట్టారంటున్నారు, గత లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన పేలవంగా ఉండడంతో, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిపై పలువురు నేతలు అసంతృప్తితో ఉండటం, తెలంగాణలో పార్టీ ఇన్‌ ‌చార్జ్ ఆర్సీ కుంతియాను తప్పించి మాణిక్యం టాకూర్‌ను ఇన్‌ ‌చార్జ్‌గా నియమించడం, ఎడతెగని వివాదాలను అంతర్గత విభేదాలను పక్కనపెట్టి అధిష్టానం రేవంత్‌ను ఎంపిక చేయడం ఆయనపై విశ్వాసంతో పాటు పార్టీ పరిస్థితి కూడా అర్థమవుతుంది. ఎప్పటి నుంచో వున్న పిసిపి పీఠం ఆశిస్తున్న హేమాహేమీలను కాదని, గత ఎన్నికల ముందు టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ను ఎంచుకున్నారంటే కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని ఢీకొనగల సత్తా ఆయనకే వుందని నాయకత్వం భావించిందన్నమాట. ఉత్తమ్‌ ‌పట్ల పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు అసంతృప్తితో అవసరమైన సందర్భాల్లో ఒక్క తాటిపైకి రావడం లేదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో పీసీసీ మార్పు జరిగిందని అంటున్నారు.

ఉత్తమ్‌ ‌స్థానంలో రేవంత్‌ ‌రెడ్డి సహా ముందు నుంచి పార్టీకి పనిచేసిన నేతలు, రేవంత్‌ ‌రెడ్డి సామాజిక వర్గం నుంచే కాకుండా ఇతర సామాజిక వర్గాల నుంచి సైతం పోటీలో ఉన్నప్పటికీ, మిగతా నేతలతో పోల్చుకుంటే అధికార పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌పైనా ఎక్కువ దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్‌ ‌రెడ్డి ముందుంటుండమే ఆయన్ను పీసీసీ రేసులో ముందంజలో నిలబెట్టిందని అంటున్నారు. అధిష్ఠానం రంగంలోకి దిగడంతో రేవంత్‌ ‌పని మొదలు పెట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించగానే..పెద్దలు జానారెడ్డిని తర్వాత ఒక్కొక్కరు సీనియర్‌ ‌నేతల ఇళ్లకు వెళ్లి కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. పీసీసీ మాజీ చీఫ్‌ ‌పొన్నాల నివాసానికి వెళ్లి అక్కడి నుంచి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వి హనుమంతరావును కలిసి పరామర్శించారు. రేవంత్‌ ‌పీసీసీ అధ్యక్షునిగా ప్రకటించిన తరువాత ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు, జీవన్‌ ‌రెడ్డి ఇప్పటి వరకు కలసే ప్రయత్నం చేయలేదని, రేవంత్‌ ‌వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా, స్పందించడం లేదని తెలిసింది. అందరినీ కలుపుకుపోతానని చెబుతున్న రేవంత్‌ ‌రెడ్డికి అదంత తేలిక కాదంటున్నారు. మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, మల్లురవి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, అద్దంకి దయాకర్‌, ‌బెల్లయ్యనాయక్‌, ‌రేవంత్‌ ‌రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేసిన వారిలో ఉన్నారు.

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎప్పుడు..ఎవరు ఎలా స్పందిస్తారో ఊహించడం చాలా కష్టం. అలజడి సద్దుమనిగాక కాంగ్రెస్‌లో ఇది మామూలేనని సరిపెట్టుకోవల్సిందే తప్ప.. పార్టీ క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తన ఆశించడం అత్యాశే. వెంకటరెడ్డి చేసిన దుందుడుకు వ్యాఖ్య కాంగ్రెస్‌లో భూకంపం పుట్టించింది. ఆయన నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి లక్ష్యంగా ఆరోపణలు చేయడం, ఆధారాలతోపాటు నిరూపిస్తానని అనడం పార్టీ శ్రేణుల్లో కలవరం రేపింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కొత్తగా ఎంపికైన కార్యవర్గంలో నేతలు కూడా అదే స్థాయిలో స్పందించి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసారు. ఏఐసీసీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవంటూ పార్టీ అధినాయకత్వం ఆగ్రహించడంతో కోమిటిరెడ్డి మెత్తబడినట్లు చెబుతున్నారు. అందరినీ కలుపుకుపోతానని చెబుతున్నా రేవంత్‌ ‌రెడ్డికి అదంత తేలికగా కనిపించడం లేదు. రేవంత్‌కు పీసీసీ ఎలా ఇస్తారంటూ కొందరు బాహటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు సీనియర్‌ ‌నాయకులు పార్టీ వీడేందుకు నిర్ణయించుకున్నారు.

పార్టీలో ఉండాలా ? వొద్దా? అని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకునే నేతలతో పాటు తన నాయకత్వాన్ని విభేదించే మిగిలిన వారితో రేవంత్‌ ‌రెడ్డి ఎలా సఖ్యత సాధిస్తారనేది పెద్ద ప్రశ్న? వారిని కలుపుకొని ముందుకు ఎలా సాగుతారన్నది అత్యంత ఆసక్తికర విషయం. కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు ముందున్న మరో అతి పెద్ద సవాల్‌. ఎవరిని అధ్యక్షుడిగా చేసినా..ఆ పార్టీలో వ్యతిరేకంగా మరో వర్గం ఏర్పడడం గతంలో నుంచే ఉంది. ఇప్పటికీ పార్టీలో రెండు, మూడు వర్గాలు ఉన్నాయి. సీనియర్‌, ‌జూనియర్‌ అనే భేదాలు, రెడ్డి, కమ్మ, బీసీ వర్గాలంటూ తలనొప్పు ఉన్నాయి. పీసీసీ లాంటి కీలక పదవులు రెడ్డి వర్గానికి ఇచ్చినప్పుడు ప్రతిసారి బీసీ నేతలు అలక వహించేవారు. గతంలో ఉత్తమ్‌, ఇప్పుడు రేవంత్‌ ఇద్దరూ రెడ్డి సమాజిక వర్గానికి చెందిన వారినే పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేయడంతో బీసీ వర్గాలు అసంతృప్తికి గురవుతున్నాయి. ఈ సమస్యను రేవంత్‌ ఎలా ఎదుర్కుంటారనే ఆసక్తి రేకెత్తిస్తుంది. కాంగ్రెస్‌ ‌పార్టీని ప్రధానంగా వేధిస్తున్న సమస్య కోవర్టులు. కాంగ్రెస్‌ ‌పార్టీలో టీఆర్‌ఎస్‌ ‌కోవర్టులు ఉన్నారని చాలా మంది నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో కీలక పదవుల్లో కొనసాగే నేతలు అధికారపార్టీ విధేయత చూపిస్తున్నారని కూడా వినిపించాయి. వారిపై రేవంత్‌ ‌రెడ్డి ఎలా దృష్టి పెడతారు? వారిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెడతారా? కలుపుకొని వెళ్తారా? అన్నది ఆసక్తికర విషయం.

కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని ఢీకొనగల సత్తా, ఆర్థిక వనరుల సమీకరణ, సమస్యలపై చొరవతో రంగంలోకి దిగడం, ప్రభుత్వాన్ని తీవ్ర భాషలో ఢీకొనడం ఇవన్నీ ఆయనకు అదనపు అర్హతలై వుండాలి. ఆయనతో పాటు వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్లనూ, పలువురు ఉపాధ్యక్షులు, కమిటీల బాధ్యులను నియమించారు గనక వారందరినీ కలుపుకొని పోవలసిన బరువు బాధ్యతలు ఆయనవే. చాలా విషయాల్లో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చాలా అంశాల్లో రేవంత్‌పై కేంద్రీకరించడం గత ఎన్నికల ముందు ఐటి దాడులు నిర్వహించడం, ఆయన కూడా అదే స్థాయిలో కెటిఆర్‌ ‌భూముల వంటి అంశాలపై కేసులు వేయడం ఘర్షణను పెంచింది. ఇప్పుడు ఇవన్నీ కొనసాగుతున్నాయి. టిడిపిలో వుండగా చంద్రబాబుకు బాగా సన్నిహితుడైన రేవంత్‌ ‌కాంగ్రెస్‌లో చేరినా పాత శక్తుల అండదండలు కాపాడుకుంటున్నారు. మీడియాలోనూ కొందరు ఆయనకు మద్దతునిస్తున్నారు. ఎక్కువ మందిని కలుపుకు పోవడం, సంయమనంతో అడుగులేయడంపై రేవంత్‌ ‌భవిష్యత్‌ ఆధారపడి వుంటుంది. మారిన దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో ఎలా నెట్టుకువస్తారో చూడాల్సిందే. కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్‌, ‌గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ ‌యాదవ్‌, ‌టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ను, సీనియర్‌ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ ‌సంబాని చంద్రశేఖర్‌, ‌దామోదర్‌ •రెడ్డి, మల్లు రవి, పొడెం వీరయ్య, సురేశ్‌ ‌షెట్కార్‌, ‌వేం నరేందర్‌ ‌రెడ్డి, రమేశ్‌ ‌ముదిరాజ్‌, ‌గోపిశెట్టి నిరంజన్‌, ‌టి.కుమార్‌ ‌రావు, జావేద్‌ ఆమీర్లను నియమించింది. ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌, ‌కన్వీనర్‌గా సయ్యద్‌ అజమ్తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ ‌సి. రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

Leave a Reply