Take a fresh look at your lifestyle.

చక్కా జామ్‌ ‌ప్రశాంతం… ఉద్యమం కొనసాగిస్తామని రైతుల ప్రకటన

సాగు చట్టాల రద్దు కోసం రైతు సంఘాలు ఢిల్లీ శివార్లలో జరుపుతున్న ఆందోళన సందర్భంగా శనివారం నిర్వహించిన చక్కా జామ్‌ ‌కార్యక్రమం ప్రశాంతంగా ముగిసినందుకు ఆ సంఘాల నేతలే కాకుండా, ప్రభుత్వం తేలిగ్గా ఊపిరి తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగానే నిర్వహిస్తామని కిసాన్‌ ‌యూనియన్‌ ‌నాయకులు మొదటి నుంచి ప్రకటనలు చేస్తున్నారు.అయితే,ఇది అంతర్జాతీయ కుట్ర అనీ, భారత ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు విదేశీ శక్తులు పన్నిన పన్నాగమని కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు.ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ ‌తోమార్‌ ‌శుక్రవారం నాడు పార్లమెంటులో ఈ చట్టాల్లో ఒక్క లొసుగును కూడా రైతు సంఘాల నాయకులు చూపలేకపోయారని ఎద్దేవా చేశారు. లోపాలు లేకపోతే అదే విషయమై రైతులకు భరోసా ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎందుకు చొరవ తీసుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఇంతవరకూ రైతులు వ్యక్తం చేసిన అనుమానాలను ఇప్పుడు ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలు రైతులకు సంబంధించిన అంశమైనప్పుడు వారితో కాకుండా వేరే ఎవరితో ఏ ప్రభుత్వమైనా చర్చలు ఎలా జరుపుతుందని ప్రశ్నిస్తున్నారు.అయితే, ఈ ఉద్యమం కారణంగా చిన్న రైతులు నలిగి పోతున్నారు.ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న పెద్ద రైతులు చిన్న రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.ఈ విషయమై పెద్ద రైతులు వివరణ ఇవ్వాల్సి ఉంది. మన దేశంలోని రైతుల్లో 80 శాతం మంది రైతులు సన్నకారు, చిన్న రైతులే, వారిని అడ్డు పెట్టుకుని పెద్ద రైతులు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారంటూ కమలనాథులు ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌నాయకులు కూడా పలువురు ఈ ఉద్యమాన్నిసమర్ధిస్తున్నారు.

మధ్య ప్రదేశ్‌ ‌కి చెందిన రఘునందన్‌ ‌శుక్లా అనే ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌నాయకుడు రైతుల అభ్యంతరాలను ప్రధాని స్వయంగా పరిశీలించాలని సూచించారు.అలాగే, ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌మూలాలున్న బీజేపీ ఎంపీ డాక్టర్‌ ‌సుబ్రహ్మణ్య స్వామి ఈ చట్టాలు అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు.ఇది మంచి సూచనే.ఎందుకంటే సాగుచట్టాలను అమలు జేయాల్సింది రాష్ట్రాలే. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇస్తే ఈ చట్టాల్లో లొసుగులు, మంచి చెడ్డలను వారు చూసుకుంటారు. రైతులకు ఏది మంచో దానిపై నిర్ణయం తీసుకుంటారు.అయితే, కేంద్రం కార్పొరేట్‌ ‌శక్తులకు హామీ ఇచ్చిన కారణంగా ఈ విషయమై అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చేందుకు సుముఖంగా లేదని పలువురు అంటున్నారు. కేంద్ర మంత్రుల్లో కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయనీ, ప్రధానమంత్రి హెచ్చరికలకు భయపడి వారు నోరు మెదపడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

ప్రధానమంత్రి తన సహచరులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఈ సమస్య క్షణాల్లో పరిష్కారం అవుతుందని రైతు సంఘం నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. రైతులఆందోళన కొనసాగుతున్నందున ప్రభుత్వం ప్రతిష్ఠ దెబ్బతింటోందని పలువురు మంత్రులు,అధికార పార్టీ నాయకులు లోపాయికారీగా అంగీకరిస్తున్నారు.అందుకే ఈ ఆందోళన వెనుక విదేశీ శక్తులు, ప్రతిపక్షాలు ఉన్నాయంటూ ఎదురుదాడి చేసి తమ బాధ్యత పూర్తి అయిందని భావిస్తున్నారు. మరో వంక చక్కా జామ్‌ ‌ను ప్రశాంతంగా నిర్వహించిన రైతు సంఘ నాయకుడు రాకేష్‌ ‌తికాయత్‌ ‌ప్రభుత్వంలో కదలిక వస్తుందేమోనన్న తమ ఆశలు అడుగంటి పోతున్నాయనీ,ఏమైనా, కోర్కెలు సాధించేవరకూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు.

తమను ఏ విదేశీ శక్తి నడిపించడం లేదనీ,అలాగే, పెద్ద రైతుల ప్రయోజనాల కోసం తామేమీ ఉద్యమం సాగించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వారిలో కొందరు పెద్దరైతులు ఉండవచ్చనీ,అంతమాత్రాన వారు చెప్పినట్టు మొత్తం రైతాంగం అంతా నడుచుకుంటోందనడం సరైంది కాదని ఆయన అన్నారు. రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వివరణలు సామాన్య రైతులను దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నట్టుగా కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు.ముఖ్యంగా ఎంత సేపూ రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చనంటూ చేసే ప్రకటనలు వారిని రెచ్చగొడుతున్నాయి. చిన్న కమతాల యజమానులు తమ పంటను ఎక్కడికి తీసుకుని వెళ్లగలవు. ప్రభుత్వ యంత్రంగాలే రైతుల వద్ద కొనుగోలు చేయనప్పుడు బడా భూస్వాములు, కార్పొరేట్‌ ‌రంగ ప్రముఖులు తమ పంటను కొనుగోలు చేస్తారన్న గ్యారెంటీ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలు ఆచరణాత్మకంగా లేవని అంటున్నారు. మండీలనేవి రైతుల ఫలసాయాన్ని ఒక చోట చేర్చేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్లనీ, వాటిప్రమేయం లేకుండా చేస్తే రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపైకి తరలించాలా అని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు ఆదర్శవంతమైనవే కావచ్చు కానీ,ఆచరణ సాధ్యమైనవి కావని పలువురు వాదిస్తున్నారు. మొత్తం ఆహారధాన్యాలను పెద్ద లారీలు, ట్రక్కుల్లో తరలించుకుని వెళ్ళే శక్తి, మంది మార్బలం కార్పొరేట్‌, ‌కాంట్రాక్టు రైతాంగానికే ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఆ విధంగా ఆహారధాన్యాల సేకరణ రంగంలోకి కార్పొరేట్‌ ‌శక్తులను అనుమతించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ సూటిగా అడుగుతామేమోననే ప్రధానమంత్రి తమతో చర్చలు జరపడం లేదని కొందరు రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

Leave a Reply