ఆవేదన వ్యక్తం చేసిన ఉప రాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. పార్లమెంట్లో ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుపై కలత చెందిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలు సభ చైర్మన్ స్థానం వద్దకు దూసుకెళ్లారు. కొద్ది రోజుల నుంచి కూడా ఎంపీలు ఇదే తీరును ప్రదర్శించారు. ఆప్, కాంగ్రెస్ సభ్యులు పోడియం ఎదుట టేబుట్పైకి ఎక్కి ఆందోళన చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా చైర్మన్ సీటుపైకి ఫైల్స్ విసిరేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర కలత చెంది బుధవారం గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ పోడియం దేవాలయ గర్భగుడి లాంటిది. భక్తులు గర్భగుడి వరకు రావచ్చుకానీ లోపలకు రాకూడదు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం ఆవేదన కలిగించే విషయం. నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అంటూ సభ్యులకు వెంకయ్య నాయుడు హితవు చెప్పారు.