Take a fresh look at your lifestyle.

కథా రచయితలకు మార్గదర్శకాలు చాసో కథలు

‘‘‌చాసో కథల్లో ఉన్న మనుషులకి అంటే ప్రధాన పాత్రలకి ఆవేశాలుండవు కామం, ప్రేమ, ఈర్య్ష, క్రోధం, ఇలాంటి ఉద్రేకాలుండవు. వాళ్ళు ఏ కోరికకీ లొంగిపోరు ఒక్క బతకాలనే కోరిక తప్ప. మనిషి సుఖంగా బతకాలంటే ఏం చెయ్యాలో చాసో పాత్రలు అన్యాపదేశంగా వివరిస్తాయి. సుఖం దానంతట అది రాదు. సుఖం నువ్వు చేసుకునేది. అది అదృష్టం వల్లో, మరో సదుపాయం వల్లో వచ్చే వొస్తువు కాదు. ఆలోచనల వల్ల, లౌక్యం వల్ల, చాకచక్యం వల్ల మాత్రమే సౌఖ్యం సాధ్యం. నీతి, స్నేహం, న్యాయం, ధర్మం ఇవి నిజాలు కావు. కాని ఇవి ఉన్నాయని తెలివితక్కువ వాళ్ళు నమ్ముతారు. అవి నిజంగా ఉన్నాయని నువ్వు నమ్మేవో నువ్వూ లోకంలో నానా కష్టాలూ పడే వాళ్ళలో చేరిపోతావు. ఇలా చాసో కథలలో పాత్రల ద్వారా చెపుతారు.’’

కథకులకు కథకులు చాసో

తెలుగు కథకు దిశానిర్దేశం చేసిన కొద్ది మంది ప్రముఖులలో చాసో ఒకరు. తెలుగు సాహిత్యంలో ‘కథకులకి కథకుడు’ అని పేరు ఆయన పేరెన్నిక గన్నారు. చాసో పూర్తి పేరు చాగంటి సోమయాజులు. ‘’ఏలూరెళ్ళాలి ‘ ‘‘వాయులీనం’’ ‘’కుంకుడాకు’’ ‘’కుక్కుటేశ్వరము’’ చాసో పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చే కథలు. ఈ నాలుగు కథలు ప్రధానంగా పేర్కొన్న బడినా, 1943-79 మధ్య కాలంలో చాసో రాసిన కథల నుంచి ఎంపిక చేసిన నలభై కథలతో విశాలాంధ్ర సంకలనం ‘చాసో కథలు పేరున వెలువరించింది. మళ్ళీ మళ్ళీ చదువుకునే కథలు ఇవి. కొత్తగా కథలు రాయాలనుకునే వారికి చాసో కథలు మార్గదర్శకాలు. ఒక కథకు మరో కథకు ఏ మాత్రం పోలిక పరంగా సంబంధం లేక పోవడమనే అంశం ఆయనను గొప్ప కథకుడిని చేసింది.

చాగంటి సోమయాజులు ( 1915, జనవరి 15 – 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. ఆయన మొట్ట మొదటి రచన ‘‘చిన్నాజీ’’ 1942లో భారతి పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశారు. ఆయన రాసిన కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, సమ కాలీన వ్యవస్థ అయన రచనలో ప్రధానంగా ఉన్నాయి. ఆయన రాసిన చాలా కథలు హిందీ, రష్యన్‌, ‌కన్నడ, మరాఠి, మలయాళం, ఉర్దూ భాషలలోకి అనువదించ బడ్డాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది. 1915 జనవరి 15 న శ్రీకాకుళంలో జన్మించిన చాగంటి సోమయాజులు తల్లితండ్రులు కానుకొలను లక్ష్మీనారాయణ శర్మ, తులసమ్మ. తర్వాత పెదతల్లి తులసమ్మకు దత్త పుత్రునిగా విజయ నగరం వెళ్ళారు. చాసో అయిదో ఫారం వరకు శ్రీకాకుళంలో చదివారు. విజయ నగరం ఉన్నత పాఠశాలలో ఎస్‌.ఎస్‌.ఎల్‌.‌సి. పూర్తి చేసి మహారాజా కళాశాల విజయ నగరంలో పై చదువులు చదివారు.

కళాశాల విద్యార్థిగానే ఆయన కవితా రచనకు శ్రీకారం చుట్టారు. తోరుదత్‌, ‌సరోజినీ నాయుడుల కవిత్వం, లియో టాల్‌స్టాయ్‌, ‌మాక్సిం గోర్కీల కళాత్మక వ్యక్తీకరణ, ప్రగతిశీల మార్క్సిస్టు దృక్పథం చాసోను ప్రభావితం చేశాయి. సృజనాత్మక ప్రక్రియలైన కథ, కవిత్వం, రెండింటినీ దాదాపు ఒకే సమయంలో వ్రాస్తూ వచ్చినా, తర్వాతి కాలంలో ఆయన కథా రచనకే ప్రాధాన్య మిచ్చారు. అచ్చయిన చాసో తొలి కవిత ‘ధర్మక్షేత్రము’ (భారతి : 1941 జూన్‌), ‌కాగా తొలి కథ చిన్నాజీ (భారతి: 1942). చాసో కథల రెండో కూర్పు విశాలాంధ్ర ప్రచురణాలయం 1983లో ముద్రించింది. ఇందులో మొత్తం 40 కథలున్నాయి. అభ్యుదయ రచయితల సంఘం స్థాపించిన వారిలో చాసో ఒకరు. ఆయన నిత్యజీవితంలో చాలా ఆదర్శాల కోసం పనిచేసారు. అభ్యుదయ సాహిత్యోద్యమ వేదిక, అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభలు తెనాలిలో 1943లో జరిపారు. కన్నుమూసే వరకూ ఆయన ‘అరసం’లోనే ఉంటూ కార్యకర్తగా నాయకునిగా తెలుగునాట అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి విశేష సేవలందించారు.

చాసో 1994 జనవరి 1 న మరణించారు. మరణానంతరం తన భౌతిక కాయాన్ని మెడికల్‌ ‌కాలేజీకి పరిశోధనల నిమిత్తం ఇమ్మని కోరటం ఆయన అభ్యుదయ జీవన దృక్పథానికి నిదర్శనం. చాసో కథల్లో ఉన్న మనుషులకి అంటే ప్రధాన పాత్రలకి ఆవేశాలుండవుబీ కామం, ప్రేమ, ఈర్య్ష, క్రోధం, ఇలాంటి ఉద్రేకాలుండవు. వాళ్ళు ఏ కోరికకీ లొంగిపోరు ఒక్క బతకాలనే కోరిక తప్ప. మనిషి సుఖంగా బతకాలంటే ఏం చెయ్యాలో చాసో పాత్రలు అన్యాపదేశంగా వివరిస్తాయి. సుఖం దానంతట అది రాదు. సుఖం నువ్వు చేసుకునేది. అది అదృష్టం వల్లో, మరో సదుపాయం వల్లో వచ్చే వొస్తువు కాదు. ఆలోచనల వల్ల, లౌక్యం వల్ల, చాకచక్యం వల్ల మాత్రమే సౌఖ్యం సాధ్యం. నీతి, స్నేహం, న్యాయం, ధర్మం ఇవి నిజాలు కావు. కాని ఇవి ఉన్నాయని తెలివితక్కువ వాళ్ళు నమ్ముతారు. అవి నిజంగా ఉన్నాయని నువ్వు నమ్మేవో నువ్వూ లోకంలో నానా కష్టాలూ పడే వాళ్ళలో చేరిపోతావు. ఇలా చాసో కథలలో పాత్రల ద్వారా చెపుతారు.

తెలుగు కథా విమర్శకులలో చాసోని మెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వేళ్ళ మీద లెక్కపెట్ట దగిన పదిమంది తెలుగు కథానికా రచయితలలో చాసో పేరుంటుందని రోణంకి అప్పలస్వామి కితాబిచ్చారు. తెలుగు మరిచి పోయినప్పుడే చాగంటి సోమయాజులుని మరిచి పోవడమని ఆరుద్ర పేర్కొన్నారు.

– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply